ఇక విషయానికొస్తే—మీరే కాదు పై పోస్టుకి వ్యాఖ్యానించిన వారిలో చాలామంది నన్నొక చోట (తప్పుగా) తప్పు పట్టారు. మీ వ్యాఖ్య చదివాకాగాని ఎక్కడ తప్పు పడుతున్నారో, ఇంత సులభ గ్రాహ్యమైన, స్వయం నిరూపితమైన విషయం ఎందుకు అంగీకరింపబడటంలేదో నాకు అర్థం కాలేదు. నా పోస్టులో నేను "దృశ్యం" అన్న పదాన్ని వాడింది మీరనుకున్నట్టు సీనరీ, లాండ్‌స్కేప్ వర్ణనల్ని సూచిస్తూ కాదు; ఆ పదానికి నేనంత సంకుచితార్థాన్ని నిర్దేశించలేదు. ఏ విశాలార్థాన్ని వ్యక్తీకరించడానికి ఆ పదాన్ని వాడానో మీకు విశదపరచడానికి, నేను మరలా అయాన్‌రాండ్ సహాయాన్నే తీసుకుంటున్నాను. అయాన్‌రాండ్ తన సాహిత్యవ్యాసాల సంకలనం "రొమాంటిక్ మేనిఫెస్టో"లో రచనా శైలి విషయమై తన అభిప్రాయాల్ని వెల్లడి చేస్తూ, ఒక డిటెక్టివ్ నవలా రచయిత Mickey Spillane శైలికీ, మరో సీరియస్ రచయిత Thomas Wolfe శైలికీ పోలిక తెస్తుంది. వారి రచనల్లోంచి న్యూయార్క్ నగర వర్ణనకు సంబంధించిన రెండు వచన భాగాల్ని ఇలా ఉదహరిస్తుంది:
First excerpt:
Nobody ever walked across the bridge, not on a night like this. The rain was misty enough to be almost fog-like, a cold gray curtain that separated me from the pale ovals of white that were faces locked behind the steamed-up windows of the cars that hissed by. Even the brilliance that was Manhattan by night was reduced to a few sleepy, yellow lights off in the distance.
Some place over there I had left my car and started walking, burying my head in the collar of my raincoat, with the night pulled in around me like a blanket. I walked and I smoked and I flipped the spent butts ahead of me and watched them arch to the pavement and fizzle out with one last wink.
Second excerpt:
That hour, that moment, and that place struck with a peerless co-incision upon the very heart of his own youth, the crest and zenith of his own desire. The city had never seemed as beautiful as it looked that night. For the first time he saw that New York was supremely, among the cities of the world, the city of the night. There had been achieved here a loveliness that was astounding and incomparable, a kind of modern beauty, inherent to its place and time, that no other place nor time could match. He realized suddenly that the beauty of other cities of the night—of Paris spread below one from the butte of Sacré-Coeur, in its vast, mysterious blossoms of nocturnal radiance; of London with its smoky nimbus of fogged light, which was so peculiarly thrilling because it was so vast, so lost in the illimitable—had each its special quality, so lovely and mysterious, but had yet produced no beauty that could equal this.
[పై రెండు ఉదాహరణల్నీ నిశితంగా చదవకుండా మీరు క్రిందికి రావొద్దు.]
మొదటి ఉదాహరణలో రచయిత పాత్రతో పాటు వెళ్తున్నాడు. పాత్ర చూసింది చూస్తున్నాడు; మనకు చూపిస్తున్నాడు. అతడు మన ఎదుట పరుస్తున్నవన్నీ concrete visual facts. ప్రతీ వివరం ఒక దృశ్యాన్ని మన ముందు ఉంచుతుంది. అయితే రచయిత తను అనుకున్న దృశ్యాన్ని ప్రతిష్టించడానికి ఎన్నుకున్న ఈ వివరాలు కేవలం దృశ్య ప్రతిష్టాపనకే పరిమితం కావడం లేదు, అక్కడితో ఆగిపోవడం లేదు; ఇంకా ముందుకు పోయి, ఒక సున్నితమైన భావచిత్రాన్ని మనకు స్ఫురింప జేస్తున్నాయి: న్యూయార్క్ నగరం, నగరంలో ఒంటరిదనం, ఒంటరిదనంలో వెచ్చదనం, వెచ్చదనంలో సౌకర్యం... ఇవేమీ రచయిత మనకు నేరుగా చెప్పడం లేదు; తదనుగుణమైన దృశ్యవివరాల్ని కచ్చితంగా చిత్రిక పట్టడం ద్వారా వాటి వెనకాల ఉన్న ఈ మెటాఫిజికల్ ఎమోషన్స్ సున్నితంగా మనచే అనుభూతింప జేస్తున్నాడు. ఇలాంటి వచనం పాఠకుడి నుండి పూర్తి ఏకాగ్రతను ఆశిస్తుంది. ఇక్కడ ఏ దృశ్య వివరం మిస్సయినా పాఠకుడు ఒక అనుభూతిని మిస్సవుతాడు. నేను నా పోస్టులో "దృశ్యం" అన్న పదాన్ని ఈ అర్థంతో వాడాను; కథా పరిసర చిత్రణకు సంబంధించిన డొల్ల వర్ణనల్ని ఉద్దేశించి కాదు. (ఇది డిటెక్టివ్ నవలా రచయిత Mickey Spillane శైలి.)
రెండో ఉదాహరణలో రచయిత ఏదీ చూపించడం లేదు; అంతా తనే చొరబడి చెప్పేస్తున్నాడు. న్యూయార్క్ నగరం "బ్యూటిఫుల్", "లవ్లీ", "థ్రిల్లింగ్" అంటూ విశేషణాల్ని గుమ్మరించేస్తున్నాడే తప్ప, ఎందుకు బ్యూటిఫుల్లో ఎలా థ్రిల్లింగో చెప్పడం లేదు; సంబంధిత visual facts ని మన కందీయడం లేదు. ఫలితంగా మనదాకా చేరేది ఓ మబ్బు చిత్రం; మనకు మిగిలే అనుభూతి శూన్యం. ఇక్కడ పాఠకుడు పెద్ద ఏకాగ్రత పెట్టనక్కర్లేదు; పేరా పైనుంచి క్రిందకోసారి చూపు దొర్లించేసినా అర్థమైపోతుంది—రచయిత న్యూయార్క్ నగరాన్నేదో పొగుడుతున్నాడని. (ఇది Thomas Wolfe రచన.)
అయాన్‌రాండ్ ఇక్కడ మొదట ఉదాహరణను సమర్థిస్తూ, రెండో ఉదాహరణను నాసిరకం శైలిగా నిర్థారించడం నాకూ సబబుగానే తోచింది. కాని తను సమర్థించిన మార్గాన్ని తను కూడా కాస్త అనుసరించి చూపిస్తే మరింత సబబుగా ఉండేది; పాపం "అట్లాస్" మోత బరువు మరో ఐదొందల పేజీలైనా తగ్గి ఉండేది.
అయాన్‌రాండ్ ఈ రెండో వచన భాగాన్ని ఉదహరిస్తూ, రచయితే రచనలో చొరబడి అంతా చెప్పేయడాన్ని నిరసిస్తుంది. కాని చిత్రంగా ఆమె తన ప్రసిధ్ధ నవలలో అదే తప్పు చేస్తుంది. ప్రతీ పాత్రలోకీ తనే జొరబడి, ప్రతీ పాత్ర నోటివెంటా తనే బయల్పడి, చివరాఖరికి పాత్రల్ని ఒకదానికొకటి కార్బన్ కాపీల్లా చేసి వదిలిపెడుతుంది. (నిజానికి వాళ్ళిలా కనిపించడానికి ఆమె సిధ్థాంతంలోని ఇరుకుదనం కూడా కొంత కారణం కావచ్చు. జాన్‌గాల్ట్, ఫ్రాన్సిస్కో, హాంక్ రియర్డెన్ = మంచి వాళ్ళు; జేమ్స్ టాగర్ట్, ఒరైన్ బొయేల్, లిలియన్ రియర్డెన్ = చెడ్డవాళ్ళు—ఇలా ఆమె తన పాత్రల్ని [చందమామ కథల్లోలా] మంచి వైపుకో, చెడు వైపుకో చాలా సులభంగా నెట్టేస్తుంది. నిజంగా ప్రపంచం అంత సులభంగా లెక్కతేలిపోతే ఎంత బావుంటుందో కదా! బహుశా అందుకే, మొత్తం నవల్లోకి నాకు కాస్త వాస్తవికంగా కనిపించే పాత్ర—ఎడ్డీ విల్లర్స్! ఏ సిధ్థాంతం అయినా మానవాళికి ఉపయోగపడాలంటే అది మొదట మానవ స్వభావాన్ని యథాతథంగా అంగీకరించాలి, మానవాళి వైవిధ్యాన్నంతా తనలో కలుపుకోవాలి; అంతేకాని ముందో సిధ్థాంతపు గిరి గీసేసి అందులో మానవాళిని బలవంతంగా ఇరికిద్దామంటే, ఇలాంటి అపరిపక్వ సిధ్థాంతాలే బయటపడతాయి. సరే ఇదంతా సైధ్థాంతిక పార్శ్వం కాబట్టి వదిలేద్దాం.)
ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది—రచయిత తన రచనలో చొరబడి అంతా చెప్పేయడం చాలా సులభం; తొక్క వలిచిన అరటిపళ్ళే కావాలనే పాఠకులకి ఈ పద్థతి బాగా నప్పుతుంది. కాని రచయిత తెరవెనుక నిలబడి రచనతో స్వతంత్రంగా మాట్లాడించడం కష్టం; ఇది కొంతమంది రచయితలకే సాధ్యం. (వీర్ని మచ్చుకు తర్వాత ఉదహరిస్తాను.) అయాన్‌రాండ్ తన కళ లక్ష్యం పరిపూర్ణ మానవుడ్ని సృజించడం అని చెప్పుకుంది. ఇక్కడ నాకు దుస్సహ మనిపించింది ఏమిటంటే, ఆమె "పరిపూర్ణ మానవులు" ఎందుకో అతిగా వాగుతుంటారు; మలబద్దకపు మొహాలేసుకుని పేజీలకు పేజీలు ఉపన్యాసాలు దంచుతుంటారు. (If I am condemned as a living embodiment of "Ellsworth Toohey" for making such statements, so be it. Any philosophical doctrine that excludes the ineluctable human frailties from its functional realm and regards them with contempt [without compassion], is, ultimately, doomed to fail in its practical execution.—Oh! I am going back again to all that philosophical mumbo jumbo.... Let’s skip it.) మరలా మన చర్చకొచ్చేద్దాం. మీరు "అట్లాస్ ష్రగ్డ్" నవలంతటిలో జాన్‌గాల్ట్ స్పీచ్ సమ్మరీ మాత్రం గుర్తుందని రాసారు. నిజానికి ఆమె "వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్‌నెస్" చదివినా మీ దగ్గిర మిగిలే సారం దాదాపు అదే. మరి ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్‌గా "అట్లా ష్రగ్డ్"కీ, ఒక వ్యాస సంపుటిగా "వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్‌నెస్"కీ తేడా ఏం లేదా? నిజంగా మీకు అందులో దృశ్యాలేం గుర్తు లేవంటే ఒక నవలగా అది దాని ఫెయిల్యూరు. (ఫిలాసఫికల్ మేనిఫెస్టో అంటే ఒప్పుకుంటాను. అయితే, "Art has an end in itself" అని నమ్మిన అయాన్‌రాండ్ మరి తన ఆర్టును ఇలా సిద్థాంతపు బాకాగా ఎందుకు వాడుకుందో నాకర్థం కాదు.) అందుకే నేను మరలా అదే వక్కాణిస్తున్నాను: ఒక కళాత్మక రచన కలకాలం నిలవాలంటే కావాల్సింది సారవంతమైన ఇమేజెస్; ఐడియాస్ కాదు.
మీరు డాస్టొయెవ్‌స్కీ "క్రైమ్ & పనిష్మెంట్" చదివారా. వందేళ్ళ క్రితం దాన్ని చదివిన పాఠకులకు "రస్కోల్నికొవ్ బాధ ప్రపంచానికి బాధ" అనిపించి ఉండేది; కాని ఇప్పటి పాఠకులకు రస్కోల్నికోవ్ బాధ అతని బాధగానే మిగిలిపోతుంది. ఇక "చివరకు మిగిలేది" ఉదాహరణనే తీసుకుంటే, ఆ నవలలో వ్యక్తి పై సంఘం మోపే అదృశ్య ఒత్తిడి ప్రధానాంశం. రచయిత నవల్లో చాలా చోట్ల—కథానాయకుడు దయానిధి ద్వారా గానీ, తనే నేరుగా గానీ—స్వంత అభిప్రాయాల్నీ, వ్యాఖ్యానాల్నీ చొప్పిస్తుంటాడు. అప్పటి సమాజంలో వ్యక్తిపై సంఘం పొసెసివ్‌నెస్ చూస్తే, లేటుగా పుట్టి మనం చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో వ్యక్తిపై సంఘపు ఒత్తిడి అంతగా లేదు. ఒక వ్యక్తి ఒంటరి ద్వీపంలా మిగిలి పోదల్చుకుంటే సంఘం ఇదివరకట్లా అతన్ని కుమ్మటానికి కొమ్ములు రువ్వడం లేదు; అతని మానాన అతన్ని వదిలేస్తుంది. మరికొంత కాలానికి ఈ వ్యక్తి స్వాతంత్రపు పరిధి మరింత విస్తృత మౌతుంది. ఒక పాతికేళ్ళ భవిష్యత్తులో, ఇంకా "చివరకు మిగిలేది" ప్రచురణలో ఉండి, ఇంకా దాన్ని చదివే నూతన తరం పాఠకులు ఉన్నారన్న హైపోథెటికల్ సందర్భాన్ని మనం ఊహించ గలిగితే, వారు దయానిధి వేదననంతా చూసి "What the hell is the matter with this guy" అని చికాకు పడి తీరతారన్న విషయం తట్టడానికి మనం బృహస్పతులం కానవసరం లేదు. ఎందుకంటే, ఆ తరానికి సంబంధించినంత వరకూ సంఘం–వ్యక్తుల మధ్య సంఘర్షణ అనేది ఏలియన్ థీమ్; expired idea. అందుకే, నా దృష్టిలో "చివరకు మిగిలేది"లో చివరి దాకా మిగిలే సత్తువ ఉన్నదేమన్నా ఉంటే అది అందులోని ఇమేజరీ మాత్రమే. (మళ్ళీ చెపుతున్నాను—ఇక్కడ ఇమేజరీ అంటే సీనిక్ వర్ణనలు కావు; రచయిత తన కథ యొక్క మెటాఫిక్స్‌ని పాఠకుడి దాకా చేరవేయడానికి ఎన్నుకున్న సముచిత దృశ్య సంచయం.)
నేనిందాక—తెర వెనుక ఉండి రచనచేత మాట్లాడించే రచయితలు చాలా తక్కువమంది ఉంటారని చెపుతూ, మచ్చుకి వారిని తర్వాత పరిచయం చేస్తానన్నాను. Here comes my బ్రహ్మాస్త్రం: కాఫ్కా. నేన్నిజానికి మీకింత విస్తారంగా ఈ వివరణ ఇయ్యనవసరం లేదు; ఓ కాఫ్కా పుస్తకాన్ని మీ చేతిలో పెట్టేస్తే చాలు—అదే నా తరపున మాట్లాడుతుంది; నా వాదనను ఋజువులతో నిర్థారిస్తుంది. అది ప్రస్తుతం కుదరదు కనుక, ఆయన రచనల్ని కొన్నింటిని సంక్షిప్తంగా క్రింద పరిచయం చేస్తున్నాను:
కాఫ్కా అసంపూర్ణ నవల "The Trial"లో, ఒక బాంక్ ఉద్యోగి జోసెఫ్ కె. ఒక "శుభోదయాన" నిద్ర లేవగానే పోలీసుల చేత అరెస్టు చేయబడతాడు. అతనికి తన నేరమేమిటో అర్థం కాదు; ఎవరూ చెప్పరు. అతను మాత్రం తన నేరమేదో ఉండే ఉంటుందన్న నమ్మికతో, నవలంతా, అదేమిటో తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. చివరకు తెలుసుకోకుండానే చట్టం చేతిలో మరణిస్తాడు. మరో అసంపూర్ణ నవల "The Castle"లో ఒక లాండ్ సర్వేయరు కె., ధారాపాతంగా మంచు కురుస్తున్న ఓ అర్థ రాత్రి, ఒక గ్రామంలోకి ప్రవేశిస్తాడు. ఆ రాత్రికి ఒక సత్రంలో తల దాచుకుందామని ప్రయత్నించబోతే, ఆ గ్రామం మొత్తాన్ని అజమాయిషీ చేసే కోటకు (Castle) చెందిన ఒక ఉద్యోగి, కె.కు గ్రామంలోనికి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నిస్తాడు. కోట అధికారులే తనను ఈ గ్రామానికి లాండ్ సర్వేయరు గా నియమించారని, రమ్మని కబురు పంపారని సమాధానమిస్తాడు కె. తక్షణం కోట అధికారులను ఫోనులో సంప్రదించి, అలాంటి అనుమతిని ఎవరూ ఎవరికీ ఇవ్వలేదంటాడు ఉద్యోగి. ఇది మొదలుకొని నవల చివరివరకూ కె. కోట అధికారుల నుండి లాండ్ సర్వేయరుగా తన ఆమోదం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ కనీసం కోటలోకి కూడా ఎప్పుడూ వెళ్ళలేక పోతాడు. అతని ప్రయత్నాలు ఇంకా కొనసాగుతుండగానే నవల ముగింపుకొస్తుంది.
వీటి కథాంశాలు పైకి కనబడేవి కావు. నిజానికి తరచి చూస్తే రెండింటి కథాంశాలూ ఒకటే; క్లుప్తంగా ఇలా వివరించ వచ్చు: మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్పలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత. ఇక్కడ కాఫ్కా కథానాయకులిరువురూ ఈ ఖాళీని, తమ అస్థిత్వాలకు అర్థాన్ని అన్వేషించడంతోనే పూరిస్తున్నారు.
మరో కథ: "Josephine, or the mouse folk". ఇది అంతర్లీనంగా సమాజానికీ, కళాకారుడికీ మధ్య భాంధవ్యాన్ని చర్చించే కథ. బహిర్ దృష్టికి కనిపించేది మాత్రం జోసెఫైన్ అనే ఎలుక గాయని కథ. కథను ఎలుకల గుంపులో మరో ఎలుక మనకు చెప్తుంది. (First Person Plural narration)
జోసెఫైన్ తన పాటల ద్వారా ఎలుకల గుంపును ఉద్దరిస్తున్నానని భావించే ఎలుక. ఎలుకల గుంపు కలతల్లో, కష్టాల్లో ఉన్నపుడు తన పాటల ద్వారా వాటికి స్వాంతన చేకూరుస్తున్నానని భావిస్తుంటుంది ఆ ఎలుక. ఎలుకల గుంపుకు మాత్రం జోసెఫైన్ పాటల గొప్పదనమేంటో అర్థం కాదు. అయినా అవి జోసెఫైన్ కళని ఆదరిస్తాయి. జోసెఫైన్ తమ రక్షణకూ, ఆదరానికి హక్కుదారని భావించి గౌరవమిస్తాయి. అయితే, నిజంగా విపత్తులు వచ్చినప్పుడు జోసెఫైన్ పాటల వల్ల తమకు అంతగా ఒరిగేదేం లేదని మిగతా ఎలుకలకు తెలుసు. నిజానికి ఆ ఎలుకల గుంపు విపత్తుల ముంగిట కోరుకునేది పరిష్కారాన్ని కాదు; ఆ విపత్తు కారణంగా తామంతా ఒక గుంపుగా దగ్గరకు జేరడం, ఆ దగ్గిరదనంలోని వెచ్చదనపు సౌకర్యాన్ని అనుభవించడం, భోరున ఏడుస్తూ తమ మాసకిస్టిక్ టెండెన్సీస్‌ని తృప్తి పరచుకోవడం—ఇవే వాటికి కావాలి. ఇలా తమను దగ్గరకు జేర్చడానికి మాత్రమే వాటికి జోసెఫైన్ పాటలు అవసర పడతాయి; తమ మాసకిస్టిక్ టెండెన్సీస్‌ని తృప్తి పరిచే పరికరంగా మాత్రమే అవి జోసెఫైన్‌ని చూస్తాయి. కాని జోసెఫైన్ తన స్థానం ఇంకా గొప్పదని, తను హక్కుదారైన ఆ స్థానాన్ని తనకు ఇచ్చి తీరాలని ఆశిస్తుంది. సమస్యల నుండి తన పాటల ద్వారా ఎలుకల గుంపుకు నిశ్చింత కలిగిస్తున్నాను కాబట్టి తనకు రోజూవారీ పనుల నుండి మినహాయింపులు కావాలని వగైరా డిమాండ్లు చేస్తుంది. మిగతా ఎలుకల గుంపు మాత్రం, చివరకు సమస్యలు తీరేది తమ ప్రయత్నం, తమ త్యాగాల వల్లనే అని, దీనికి అన్యాయంగా జోసెఫైన్ క్రెడిట్ కొట్టేస్తుందని దాన్ని ద్వేషిచడం మొదలు పెడతాయి. ఇది స్థూల కథ.
నా ఈ కథా సంక్షిప్తంలో "జోసెఫైన్" అని ఉన్న చోట "కళాకారుడు" అని, "ఎలకల గుంపు" అని ఉన్న చోట "సమాజం" అని తర్జుమా చేసి చదువుకుంటే మీకు కథాంశం ఏమిటో విశదపడుతుంది. ఈ పారభౌతిక కథాంశాన్ని పట్టించు కోకుండా, దృగ్గోచర కథను అనుసరించి చదివినా జోసెఫైన్ నాణ్యత గల కథగానే నిలబడుతుంది.
ఇక మరో కథ "The Burrow"లో ఒక పురుగు తన బొరియను చాలా కష్టపడి, చాలా నైపుణ్యంతో నిర్మించు కుంటుంది. లోపల అనేక గదులు ఏర్పాటు చేసుకుని, వాటిలో ప్రతికూల కాలానికి సరిపడా ఆహార నిల్వల్ని కూడబెట్టుకుని సౌకర్యంగా, వెచ్చగా జీవిస్తుంది. రోజులు కులాసాగా దొర్లిపోతున్నా యనుకున్న సమయంలో, దానికి బొరియ గోడల్లోంచి ఏదో శబ్దం వినిపించడం మొదలౌతుంది. అవతలి వైపు నుండి ఎవరో—బహుశా మరో పురుగు—గోడల్ని తొలుస్తున్న ధ్వని నిరంతరాయంగా వినిపిస్తూంటుంది. ఒక రోజు ఒక వైపు నుండి వినిపించిన ధ్వని, మరుసటి రోజు మరో వైపు నుండి వస్తుంది. ఇక దాని జీవితం దుర్భరమై పోతుంది. దీని కథాంశాన్ని క్లుప్తంగా చెప్పాలంటే: The fear of the unknown.
ఈ కథల్లో ఎక్కడా రచయిత కనపడడు, వినపడడు, చొరబడడు; నిజానికి రచయిత చెప్ప దల్చుకున్న కథ కూడా బహిర్గతం కాదు. కేవలం దృశ్యాలు; స్పష్టమైన, సారవంతమైన దృశ్యాలు. కథాంశాలు కూడా కాలగమనానికి నిలిచి ఉండేవి—కాలంతో పాటు expire అయిపోయే జనరలైజ్డ్ ఐడియాస్ కావు. సృష్టిలో ఎంత నిగూడత ఉందో, దానికి కాఫ్కా ప్రతి సృష్టిలో కూడా అంతే నిగూడత ఉంటుంది.
ఇంత చెప్పినా, మీరో వాదన లేవదీస్తే నేను చచ్చినట్టు అంగీకరించక తప్పదు: ఏది ఉత్తమమైన రచన, ఏది కాదు అన్న తీర్పు వ్యక్తిగత అభిరుచిని బట్టి మారుతుందని మీరంటే, నేను ఔననక చేసేదేం లేదు. కొంతమంది పాఠకులు తాము చదివే రచయితలు వెంట్రిలాక్విస్టులో, తోలుబొమ్మల ఆటగాళ్ళో అయితే చాలనుకుంటారు; కొంత మంది మాత్రం తమ రచయితలు విశ్వస్రష్ట తో (Alimighty) పోటీ పడాలనుకుంటారు. నేనీ విభాగపు పాఠకుడ్నే. సృష్టికర్త తన సృష్టితో అవిభాజ్యమై ఉంటూనే ఎలా నిమిత్తమాత్రత వహిస్తాడో, రచయితలూ వారి రచనల నుండి అదే డిటాచ్‌మెంట్‌తో మెలగాలని నేను కోరుకుంటాను. సృష్టికర్త తన సృజనలో ఎపుడూ వేలు పెట్టడు, చొరబడి వ్యాఖ్యానాలివ్వడు, తన పాత్రలకు తన గొంతు ఇవ్వడు, తన పాత్రలపై తన మొరాలిటీ రుద్దడు. సృజన మాత్రమే ఆయన పని; సారాన్ని గ్రహించే కష్టమంతా (పడాలనుకుంటే) మనం పడాల్సిందే. ఆయన తన సృజనకు ఆపాదించిన ఈ స్వతంత్రతే సృష్టిని ఇంత వైవిధ్యంతో, సజీవ చైతన్యంతో అలరారేలా చేస్తుంది. దీనికి విరుద్దంగా తమ పాత్రల్ని ప్రాణంలేని ప్లాస్టిక్‌బొమ్మల్లా వళ్ళో కూర్చో బెట్టుకుని తామే మాట్లాడేసే వెంట్రిలాక్విస్టు రచయితలంటే నాకు మా చెడ్డ చిరాకు. వాళ్ళ నెల తక్కువ సిధ్థాంతాలూ, పక్వానికి రాని భావాలు నాకు అవసరం లేదు. వాళ్ళు తమ రచనకు ఉద్దేశించిన అమూర్త భావాలను, కళాత్మకమైన దృశ్యాల అమరికతో మనకు సమర్పించ గలగాలి; వారి రచనలు వారితో నిమిత్తం లేకుండా తమదైన స్వతంత్ర అస్థిత్వాన్ని కలిగి ఉండాలి—ఇంతే నేను ఆశించేది. అయితే, ఇది నా వ్యక్తిగత అభిరుచిమాత్రమేనా? కార్లూ బైకులూ వచ్చాక కూడా ఎవడైనా ఎద్దులబండి నా వ్యక్తిగత అభిరుచి అన్నాడనుకోండి, బైకు మీద వెళ్ళేవాడు బైకు తన వ్యక్తిగత అభిరుచి అని చెప్పుకోవాలా లేక ఎద్దులబండి కన్నా బైక్ కార్యానుకూలత పరంగా ఉన్నతమైందన్న నిజాన్ని నొక్కి చెప్పాలా. (Clumsy metaphor... I give you that. Nevertheless, you know what I mean by it, right?)
సంగీతం మినహాయించి ప్రతీ కళా దృశ్య మాధ్యమం ద్వారానే మన దాకా చేరుతుంది. అంతెందుకు, మనమెవరం ఆలోచించేప్పుడు వాక్యాల్తోనూ, శబ్దాల్తోనూ, వాసనల్తోనూ ఆలోచించం; దృశ్యాల్తో ఆలోచిస్తాం. "టమాటా" అనగానే ఒక ఎరుపు రంగు గుండ్రని ఫలం మన మస్తిష్క ఫలకంపై ఎలా ప్రత్యక్షమౌతుందో, "సీతాకోక చిలుక" అనగానే దాని రెక్కలపై రంగుల అల్లిక వెంటనే మనకు ఎలా స్ఫురిస్తుందో అలాగే "ప్రేమ" అనగానే ప్రియురాలి ముఖారవిందమో, అరణ్యాల పచ్చదనమో, గాలివాటుకు ఏటవాలుగా నేలరాల్తున్న గుల్‌మొహర్ పూలజల్లో, కనీసం మనం చూసిన సినిమాలో ప్రేమ సన్నివేశమో, ఇవేమీ కాకపోతే "ప్రే" "మ" అన్న రెండు అక్షరాలో ఇలా ఏదో ఒక దృశ్యం మెదడులోనికి చొచ్చుకు వస్తుంది. టమాటా లాంటి కాంక్రీట్ వస్తువులే కాదు, ప్రేమ లాంటి ఆబ్‌స్ట్రాక్ట్ భావనలు కూడా (వ్యక్తి వక్తికీ విభిన్నంగా) కొన్ని దృశ్యచిత్రాలతో జతకట్టి ఉంటాయి. (అయితే పై ఉదాహరణలు దృశ్య మాధ్యమంపై అధికంగా ఆధారపడే వ్యక్తికి మాత్రమే వర్తిస్తాయి. ఘ్రాణ మాధ్యమం శక్తివంతంగా ఉన్న వ్యక్తికి "ప్రేమ" అనగానే ఏ మొగలిపూల వాసనో, ప్రియురాలి ఒంటి ఫెర్‌ఫ్యూమ్ పరిమళమో అనుభవానికి రావొచ్చు. శ్రవణ మాధ్యమం ప్రధానంగా ఉన్న వ్యక్తికి "ప్రేమ" అనగానే పక్షుల కిలకిలారవాలో, "బొమ్మరిల్లు" సినిమా నేపథ్య సంగీతమో వినిపించవచ్చు. కాని రచన అనేది భాష పై ఆధారపడిన కళ. భాష ద్వారా పాఠకుడికి దృశ్యాన్ని నిర్మించి ఇచ్చినంత ప్రభావవంతంగా, అతనిచే వాసనల్ని ఆఘ్రాణింప జేయలేము; శబ్దాల్ని వినిపింప జేయలేము.) కాబట్టి రచయిత సాధ్యమైనంత వరకూ మానవ మస్తిష్కపు ఈ ఫాకల్టీని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవాలి. ఇది సులభం కాదు; ఇది రచయితలకూ సులభం కాదు, పాఠకులకూ సులభం కాదు. ఆసక్తికరమైన విషయ మేమిటంటే అందరూ ప్రతీ కళకూ దాన్ని అనుభూతించగోరే వారినుండీ కొంత అభినివేశాన్ని ఆశిస్తారు—సంగీతానికి శ్రోతల నుండీ, శిల్ప చిత్ర కళలకు చూపరుల నుండీ కొంత అవగాహనను కోరతారు. పికాసో, వాన్‌గోల చిత్రాలు అందరికీ అర్థమవ్వాలని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయరు; హరిప్రసాద్ చౌరాసియా, బాలమురళీ కృష్ణల సంగీతం అందరికీ సమానంగా ఆనందం పంచుతుందని ఎవరూ ఆశించరు. వారి వారి కళలను అర్థం చేసుకోవాలంటే ఆ విభాగంలో మనం కొంత పరిజ్ఞానం సంపాదించాలి. (ఎందుకు సంపాదించాలి అంటే—కళాకారుడి కళకూ, మన అభినివేశానికీ శృతి కుదిరినపుడు అది మన కందించే ఆనందం అలౌకికం, వర్ణనాతీతం కాబట్టి.) కాని ఎందుకో కేవలం పాఠకుల నుండే ఎవరూ ఎలాంటి పరిజ్ఞానాన్నీ ఆశించరు. రచయిత స్థాయిని పాఠకుడు అందిపుచ్చు కోవడం కాదు, రచయితే పాఠకుడి స్థాయికి దిగిరాయాలని ఆశిస్తారు. సాహిత్యం యొక్క ఈ ప్రజాస్వామికీకరణ సాహిత్యానికి ద్రోహమే చేసిందని నా అభిప్రాయం. ఈ దుష్ట సిద్థాంతపు తొలి బీజాలు "సాహిత్యం యొక్క ఏకైక లక్ష్యం సమాజహితం" అన్న వాదనతో ఏర్పడ్డాయి. సాహిత్యంకానీ, ఏ కళకానీ వాటి లక్ష్యం సమాజహితం కాదు. కళ యొక్క విశాలపరిధి ఈ ఇరుకు చట్రాల్లో ఇమడదు. (అసలు ఇంగ్లీషులోని "లిటరేచర్" అన్న పదాన్ని తెలుగులో "సాహిత్యం" అన్న పదంతో అనువదించడమే ఈ సంకుచితార్థాన్ని సూచిస్తుంది. "వాఙ్మయం" అనేది సముచితమైన పదం నా దృష్టిలో.) ఏ రచనైనా ముందు స్వతస్సిద్దంగా కళాత్మక విలువలు కలిగి ఉండాలి; మిగతావన్నీ సెకండరీ లక్ష్యాలు. శ్రీశ్రీ కూడా "కర్షకవీరుల కాయం నిండా/ కాలువకట్టే ఘర్మజలానికి/ ధర్మజలానికి/ ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!" అంటూ తన "ప్రతిజ్ఞ" రాస్తున్నపుడు ముందు ప్రాస సంగతి ఆలోచించి ఉంటాడు; తర్వాతే కర్షక వీరుల సంగతి.—సరే... నేను మీకు ఇవ్వదల్చుకున్న సమాధానం ఇచ్చి చాలాసేపయింది. There is no point in rambling on like this... వదిలేద్దాం.
పోతే... ఏవిఁటండీ!—నా "పుస్తక పఠనం" పోస్టు మీద మీ వ్యాఖ్య ఇంకా ప్రొసెసింగ్ లోనే ఉందా! అయితే నాకు మీరేదో పెద్ద పనే పెట్టబోయేట్టున్నారు. కొంపదీసి "మైదానం", "అసమర్థుని జీవయాత్ర"ల్ని పునశ్చరణ చేయాల్సిన కష్టం కలిగించరు కదా! అయినా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను.
మీరు మీ "దృశ్యం v ఆలోచన" ని Saturday, August 25, 2007న వ్రాసారు.
దానికి ఆఖరి వాఖ్య నాగరాజు గారు జనవరి 9,2007న ఇచ్చారు.
ఇక రాకేశ్వరరావు గారు జనవరి 13,2007 న ఇచ్చారు.
సెప్టంబరు 9న వాఖ్యానించిన అనిల్ మీ జవాబుని చూడనుకూడాలేదు.
మళ్ళీ ఇన్నాళ్ళకి ఇక్కడ కనపడింది. వాఖ్యానించాలంటే సమయం కుదరాలి. ఏకంగా ఒకొక్కసారి "టపా" అవసరమవుతుంది. ఇదిగో మీరిక్కడ ఇచ్చారే అలా.
మీరు, నాగరాజుగారు పని పెట్టారుగా.:)
@Phani: from your previous comment on your previous post." నేను సాహిత్యాన్ని visual media తో పోల్చి, సాహిత్యపు నూన్యతను నిరూపించదలచానని మీరనుకుంటే అది తప్పు."
No that is not the expression/implied meaning of Anil's comment.
(For the sake of clarity, deleted the previous comment).
అందుకే మరి, టాపా రాసేటప్పుడు ఎంత జాగర్తగా రాస్తామో - వ్యాఖ్య రాసేటప్పుడు అంత కన్నా జాగర్తగా రాయవలసి వుంటుంది, పొరబాటు నాదే. మీరు చెప్పదలచుకొన్న non-cognitive imagery గురించి నాకు బాగానే అర్థమైంది. అందుకే నేనా శ్లోకాన్ని ఉదాహరించిది - మీరు ఇప్పుడు రాసిన వ్యాసం ఆ శ్లోకానికి చక్కటి వ్యాఖ్యానం లా ఉంది.
ఏదైతేనేం, మరో చక్కటి వ్యాసం మీ కలంలోంచి - సంక్రాతి కానుకగా, గొబ్బెమ్మలతో తీర్చిదిద్దిన రంగవల్లిలా ఉంది.
చాలా విషయాల్లో మనిద్దరి తాత్విక దృష్టి ఒక్కలాగే ఉంటుంది - కాబట్టి, మీ రాతలు నాకు బాగానే అర్థమవుతాయి. అయాన్ రాండ్ పుస్తకాలు చదివి సుమారుగా రెండు దశాబ్ధాలు కావొస్తోంది - ఇప్పుడు అంతగా గుర్తుకు లేవు. కాని, రాండ్ గురించి మీరు చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఆబ్జెక్టివిటి కాస్త ఆబ్జెక్టివిజమ్ అయ్యితే అందులో ఆబ్జెక్టివిటీ మరి నేతిబీరకాయలో నెయ్యేకదూ. ఆవిడ ప్రపంచానంతా రెండు వర్గాలుగా విభజించేసి (అందులోనూ - వాల్యూ బేస్డ్ కాటగరైజేషన్) - అందులో absolutes కోసం వెతుకుతుంది - ఎలా దొరికేనూ? ఇంక మీరన్నట్టుగా - ఆవిడ రచనలు చాలావాటిని ఏభై పేజీలలో రాసి ముగించవచ్చుననుకొంటా.
మైదానం, చివరకు మిగిలేది, అసమర్ధుని జీవయాత్ర ల విషయంలో కూడా - మీ అభిప్రాయాలే నావీనూ. మైదానం, చివరకు మిగిలేది పై నేనిప్పటికే సాహిత్యం గుంపులో చాలా పెద్ద టపాలే రాసా - కాబట్టి, ఇక్కడ మళ్ళా రాయనవసరం లేదు.
"ఏ సిధ్థాంతం అయినా మానవాళికి ఉపయోగపడాలంటే అది మొదట మానవ స్వభావాన్ని యథాతథంగా అంగీకరించాలి, మానవాళి వైవిధ్యాన్నంతా తనలో కలుపుకోవాలి; అంతేకాని ముందో సిధ్థాంతపు గిరి గీసేసి అందులో మానవాళిని బలవంతంగా ఇరికిద్దామంటే, ఇలాంటి అపరిపక్వ సిధ్థాంతాలే బయటపడతాయి."
చాలా గొప్పమాట. ఈ సిద్ధాంతాలతో, వాదాలతో ఉన్న గొడవే ఇది. ఇజాల ద్వజాల కింద నిజాల నీడలు వెతుక్కుంటే సత్య దర్శనం ఎలా అవుతుందీ? ఫార్మల్ సిస్టమ్స్ అన్నిటిలో - సెల్ఫ్ రిఫరెన్సింగు కుదరదంటారు, కాని అది లేకుండ ఏ సిస్టమూ పుట్టలేదు. అందుకే - I prefer a cartoonists gentle interpretation of life to a critique's harsh judgment of the world around us.
ఇక సాహిత్యం, లిటరేచర్ గురించి మీరు రాసిందాన్ని, మరికొంచెం విపులీకరిస్తే - మరో మంచి వ్యాసం అవుతుంది. పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అనే నవలకి ఆస్కార్ వైల్డ్ రాసిన ముందు మాట చదివారా?
మీరు డగ్లాస్ హాఫ్ స్టాడర్ పుస్తకాలు చదివారా? ఐ ఆమ్ ఎ స్ట్రేంజ్ లూపు్ అనే పుస్తకం చదవండి తప్పకుండా. అలాగే, మిహాయ్ జిక్సెంట్‌మిహాయ్ - ఆర్ట్ ఆఫ్ సీయింగ్ - ఏన్ ఇంటర్‌ప్రటేషన్ ఆఫ్ ఈస్థటిక్ ఎక్స్ పీరియన్స్ అనే పుస్తకం కూడా.
మీరు రాసిన పుస్తక పఠనం వ్యాసం పై ఏదో వ్యాఖ్య రాయడనికి మొదలు పెట్టాను కాని, ముగించలేదు - ఇంతలో ఏవో డిస్ట్రాక్షన్సు. మీ శైలీ శిల్పాల గురించి ఏవో నాకు తోచినవి రెండు మాటలు రాద్దామనుకొన్నాను. కాని, ఒక్కోసారి మన శక్తి మనకి తెలియకుండనే ఉంటేనే మంచిదేమో కదా. అందుకే నేనా వ్యాఖ్య మీకు పోస్ట్ చెయ్యలేదు.
@anil:
"మీరు, నాగరాజుగారు పని పెట్టారుగా.:)"
ఔరా! ఒక్క అక్షరం వదిలెస్తే - అర్థం ఎంత మారిపోతుంది?
నాగరాజుగారి 'కి' పని పెట్టారా? లేక నాగరాజుగారి పని పట్టారా? ఏ రకంగా చూసినా ఇందులో చమత్కారం బావుంది.
In any case, I am too smart to fall for either of them :-)
what is the style followed in this post ( among the two styles you have discussed with examples ) :-)
Best regards,
sUryuDu :-)
చాలా చక్కగా ఉంది మీ వ్యాసం... మీరు వ్యాసంలో వ్యక్తపరచిన విషయాలతో ఏకీభవిస్తాను... ఐతే అక్కడ "దృశ్యం" అనేకంటే "పదచిత్రం" అంటే సరిగ్గా సరిపోతుంది.. ఎజ్రా పౌండ్ కవితా విప్లవం "ఇమేజిజం" గురించి చదవండి (ఇప్పటికే చదవకపోతే).. జపనీ హైకూలు చదివితే ఈ విషయం మరింత స్పష్టమౌతుంది. నేను ఎప్పుడో రాసిన హైకూల మీద ఒక వ్యాసం లింకు ఇస్తున్నాను. వీలైతే చదవండి..
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=47645page=1
To: anil,
"దృశ్యం Vs ఆలోచన" పోస్టు మీద నాగరాజు పప్పు గారి వ్యాఖ్య చదివిన తర్వాత మీ వ్యాఖ్య మరో సారి నిశితంగా చదివాను. మీ వ్యాఖ్య నా ప్రతిపాదన కు వ్యతిరేకంగా కనిపించలేదు; బహుశా సరిగా అర్థం చేసుకోలేదంతే.
To: Nagaragu Pappu,
"పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే" చదవలేదు. మీరు సూచించిన ఇతర పుస్తకాల వికీ లింకు ఇప్పుడే చూసాను. ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే నాన్‌ఫిక్షన్ అంటే కొంత అసహనం నాకు; అయినా సిఫారసు మీది కదా, తప్పకుండా ప్రయత్నిస్తాను.
ఇక అనిల్‌గారి unintended pun విషయమంటారా, ఆయన అన్నది మీకు పని పెట్టాననే బహుశా. అయితే నాకు పనిపట్టే, పనిపెట్టే ఉద్దేశ్యాలు రెండూ లేవు. మీ వ్యాఖ్యకు నిజంగా అంత వివరణ అవసరమనిపించింది నాకు.
To: sUryuDu,
Styles that I have discussed above are relevant only in the context of fiction. Since the Post is not fiction, the criteria can’t be applied here. Besides, nobody can judge his work with objective clarity; it becomes a blur. It’s for you to judge. For me, it’s a tedious job to read what I have written—even for spelling mistakes.
To: Subrahmanyam Mula,
నిజమే "పద చిత్రం" మంచి ఛాయిస్.
ఎచ్చరికే - ఈ వ్యాఖ్యామత్తేభము దృశ్యాల గురించీ ఆలోచనల గురించీ కాదు... మీ టపా చదువుతుంటే నాకు వచ్చిన ఆలోచనలు అంతే...
ర్యాండ్ నవలల్లో దృశ్య వర్ణణ నాకు చాలా చిరాకు గా అనిపించేది. ఆవిడ సిద్ధాంతాలకూ, ఆ సుధీర్గ వర్ణణలకూ ఏం సంబంధమో అర్థమయ్యేదికాదు. ఆ దృశ్య వర్ణణ ఏవిధంగా చదువరుల అనుభవాన్ని పెంపొందించగలదో నాకు అర్థమవదు.
మీరు రెండు శైలులనూ వర్ణిస్తునప్పుడు రచయిత తో అతడు అని వాడేసరికి నేను కొద్దిగా తికమక పడ్డా. ర్యాండ్ మహిళ కదా అని... మీరు ఇన్ జనరల్లో మాట్లాడుతున్నట్టున్నారు.
ఆవిడ నవలలో అన్నీ తెలుపూ నలుపూ జనాలే వుంటారన్నది నిజం. కానీ అవిడ చెప్పదలచుకున్నది చెప్పడానికి అది ఉపకరిస్తుందేమో. మనుషుళ్లో రెండే వర్ణాలుంటారు అనడం ఎంత నిజమో, ఆమే సిద్ధాంతాలు కూడా అంతే నిజమేమో ;)
ఇక ఎడ్డీ పాత్ర, ఆమె హీరోలను అతిశయించి చూపించడానికి వాడుకున్న ఒక పనిముట్టు. నాలోని కమ్మూనిష్టుకూ, ఇండివిజ్యువలిస్టుకూ కూడా అది నచ్చలేదు :)
నేను గాల్టు స్పీచ్చీ మొత్తం చదివినట్లు గుర్తుకులేదు. ఇఱవై పేజీలు పైనే వుందది. అప్పటికే ఆవిడ ఏం చెప్పదలచుకుందో నాకు బోధపడిపోయింది కాబట్టి దాన్ని చదవలేదు. ర్యాండ్ ఎప్పుడూ రెండే అంశాలు చెబుతుంది. వ్యక్తిత్వవాదం, పెట్టుబడీదారువాదం. అని తెలికగానే అర్థమవుతాయి కాబట్టి అందుకోసం రెండు వేల పేజీలు చదవడం నిజంగా అవసరం అంటారా.
ఇక ఆవిడ చెప్పింది ఫర్వాలేదు గానీ, దాన్ని అమెరికావాళ్లు అర్థంచేసుకుంది మాత్రం అంత మంచిగా తోచలేదు నాకు.
"ఒక కళాత్మక రచన కలకాలం నిలవాలంటే కావాల్సింది సారవంతమైన ఇమేజెస్; ఐడియాస్ కాదు." హూఁ...
ఒక కళని తను నిజమని నమ్మిన సిద్ధాంతాన్ని డొంకతిరుగుడు పద్ధతిలో చెప్పడానికి వాడుకోవడంలో నాకు తప్పు కనిపించట్లేదు. మీ అభిప్రాయం కూడా అదే అయ్యుండవచ్చు కాకపోవచ్చు. కొన్ని ఐడియాలు కలకాలం నిలుస్తాయి, రచనలు కలకాలం నిలవడం కంటే సాధించగల ఇతర గొప్ప కార్యాలు చాలా వున్నాయి కాదా. కలకాలం is overrated :)
"What the hell is the matter with this guy"
I really doubt it if they will ever say that in India. I hope they will not. ఎందుకనే దాని మీద చాలా చెప్పగలను కానీ. ప్రస్తుతానికి ఇంత చెప్పి వూరుకుంటాను :)
సంఘానికి వ్యక్తి మీద హక్కు ఎందుకు ఉంటుందంటే(లేదా ఉందనుకుంటుందంటే) సంఘం ప్రతి వ్యక్తిలో కొంత పెట్టుబడి పెడుతుంది కాబట్టి. (కొంపదీసి నేను ఇప్పుడు పెట్టుబడిదారీతనం వ్యక్తిత్వవాదం పరస్పర విరుద్ధాలని నిరూపించేసానే ఏంటి ;-) )
ఇంకో రకంగా చెప్పాలంటే, మానవులు గుంపుల్లో బ్రతికినవారు బ్రతికేవారు, బెబ్బుల్లులా కాదు. డార్విన్ మీద విజయం సాధించడం కష్టం!
సృష్టికర్త తన సృష్టితో అవిభాజ్యమై ఉంటూనే ఎలా నిమిత్తమాత్రత వహిస్తాడో
Well most Indians seem to think otherwise.. మన దేవుళ్ల పేర్లు ఆపద'మొక్కుల'వాడు, 'వర'లక్షీ వగైరా :)
రచయితలూ వారి రచనల నుండి అదే డిటాచ్‌మెంట్‌తో మెలగాలని నేను కోరుకుంటాను. సృష్టికర్త తన సృజనలో ఎపుడూ వేలు పెట్టడు, చొరబడి వ్యాఖ్యానాలివ్వడు, తన పాత్రలకు తన గొంతు ఇవ్వడు, తన పాత్రలపై తన మొరాలిటీ రుద్దడు.
ఇక్కడ కూడా సిద్ధాంతాలను కళా సృష్టుల ద్వారా చెప్పండ అనే వాదనే వస్తుంది. రామాయణం ఉందనుకోండి, అది బేసికల్లీ 'మంచి'కి ప్రోపగాండా ప్రచారం. వాల్మీకి మంచి నమ్మాడు కాబట్టి తన యొక్క ఆ పెర్సనల్ సిద్ధాంతాన్ని జనాలలో ప్రచారం చేయడానికి రామాయణం వ్రాసాడు..
(అవ్వ అవ్వ అయ్యేం మాటలు .. కళ్లు పోతాయి .. శ్రీరామా మన్నించు సామీ) :D
"అంతెందుకు, మనమెవరం ఆలోచించేప్పుడు వాక్యాల్తోనూ, శబ్దాల్తోనూ, వాసనల్తోనూ ఆలోచించం;"
అభ్యంతరం తమ ఆనర్. అంటే గుడ్డివారు అలోచించలేరనా :)
మనలో మన మాట, నేను ప్రేమించే అమ్మయల ముఖాలు నాకు గుర్తుండవు! అదేంటో గానీ! అంతెందుకు మన బ్లాగర్లమే ఒకరినొకరం కలుసుకోలేదు. కాబట్టి నాకు గుర్తుకువచ్చేది "the way they make me feel" . Sounds mushy I know. :)
"కాని రచన అనేది భాష పై ఆధారపడిన కళ. భాష ద్వారా పాఠకుడికి దృశ్యాన్ని నిర్మించి ఇచ్చినంత ప్రభావవంతంగా, అతనిచే వాసనల్ని ఆఘ్రాణింప జేయలేము; శబ్దాల్ని వినిపింప జేయలేము."
ఇలా అన్నారు బాగుంది.
"వారి వారి కళలను అర్థం చేసుకోవాలంటే ఆ విభాగంలో మనం కొంత పరిజ్ఞానం సంపాదించాలి."
అప్పుడప్పుడూ అవసరం గానీ.. నాకు సంగీత పరిజ్ఞానం లేదు, కానీ కొన్ని పాటులు వింటున్నప్పు, ప్రాణం పోయి తిరిగివచ్చినట్లుంటుంది. శ్రీశ్రీ పద్యాల్లాగా భావం తెలియక పోయినా ప్రాస బాగుండం చేత కొందరికి నచ్చుతుంది. I think పరిజ్ఞానం is slightly over rated anyway :)
ఇప్పటికే ఆకాశం శూన్యం అయిపోయింది, నింగి నీలానికి కారణాలున్నాయి, సూర్యుడు గాలి ముద్దా, చంద్రుడు రాతి ముద్దా అయి కూర్చున్నారు. ఇక చాలీ పరిజ్ఞానం :)
"ప్రతిజ్ఞ" రాస్తున్నపుడు ముందు ప్రాస సంగతి ఆలోచించి ఉంటాడు;
వియ్యం కుదుర్చుతున్నప్పుడు ముందు ఒకరి గురించి తరువాత ఇంకొకరి గురించీ ఆలోచిస్తామా. భావాన్ని ఛందస్సు ద్వారా చెప్పాలి, కాబట్టి 'ముందు' భావమేగా ముడి సరుకు.
టపా చాలా బాగుంది. ఇలాంటి ఆలోచనలు వస్తాయి కానీ నేను వాటిని వ్రాయను. ప్రతీ వాఖ్యం నిజమవడానికి చాలా ఆంక్షలు వుంటాయి. ఇలాంటి క్లిష్ట వ్యాసంలో అవన్నీ చెప్పడం వీలు కాదు. దాన్ని కాస్తా జనాలు దురుపయోగించుకొని, మన వ్యాసాన్ని వాక్యానికి వాక్యం చీల్చి, వాటిని ఇటాలిక్కులలో పెట్టి వాటి క్రింద అవి ఎప్పుడు నిజఁవౌతాయో ఎప్పుడ అవ్వవో రాసి చివరకు ఒక అర్థంలేని కసరత్తుగా మార్చేస్తారు. ఉదాహరణకు ఈ వ్యాఖ్య !
To: రాకేశ్వర రావు.
Your Honor,
By nature, I feel dumb and numb against flippancy. And with all due respect, I feel dumb and numb against your comment.
Don’t put those colon + half-bracketed smiley marks for the statements that your are making in earnest. Because, I don’t know how to take them: Flippant or earnest? (Besides, I hate that punctuation.)
మీరు పోస్టు మొత్తం చదివి, ఆకళింపు చేసుకుని తర్వాత ప్రతిస్పందిస్తే వదిలిపోయేది; అలాకాక, చదివిన వాక్యానికల్లా రియాక్షనిస్తూ పోతే తయారయ్యే ఇలాంటి పరస్పర విరుద్ద (self-contradictory)వ్యాఖ్యానానికి, ఇప్పుడు అనవసరంగా నా బుర్ర బద్దలు గొట్టుకోవాల్సి వస్తుంది. నా పోస్టులో మీ తప్పేదైనా కనిపిస్తే నిర్మాణాత్మక క్రమంలో పెట్టి రాయండి. ఎందుకంటే, నాకు నిజంగా తెలుసుకోవాలన్న కుతూహలం.
మీ వాదనలో, at least మీ వాదన నుండి నేను పిండుకో గలిగిన దాన్లో, నాకు temperamental dissimilarities కనిపిస్తున్నాయి గాని, మీరు "చీల్చి చెండాడిన" హడావిడి ఏం కనిపించట్లేదు. అలాకాక నాది "అర్థంలేని కసరత్తు" అని మీరు నాకేదన్నా సహేతుకంగా నిరూపించి చూపిస్తాను అంటే, మీకిదే నా సాదర ఆహ్వానం.
- రచనలు ఏ గొప్ప కార్యానికి నిర్దేశించ బడ్డాయని మీరనుకుంటున్నారో తెలియ జేస్తే సంతోషిస్తాను. (సమాజహితం అని మీరంటే దాని పై నా అభిప్రాయం క్రిందనే చెప్పాను.)
- నేను నా పోస్టు లో రాండ్‌ని 'అతడు' అని ఎక్కడా సంభోధించలేదు.
- ఐడియాస్ కలకాలం నిలవడం జరగదు. ఎలాగో కూడా నేను చెప్పాను.
- సంఘం విషయంలో మీరు చెప్పినది అర్థం కాలేదు; కొంచెం విశదపరచండి.
- నేను "సృష్టి కర్త" అనే పదాన్ని అంత చెత్త అర్థంలో వాడలేదు.
- రామాయణం మంచికి ప్రోపగాండా అంటే నేను ఒప్పుకోను. ఒక వేళ వాల్మీకి దానికి అలాంటి ప్రోపగాండా ఏదన్నా నిర్దేశించినా, వాల్మీకి ఆ కావ్యంలో తీర్చిదిద్దిన కళాత్మక విలువలే దాన్ని ఇంత కాలం నిలిపి ఉంచాయి కానీ ప్రొపగాండా కాదు. Any way, నేను రామాయణం చదవలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ వ్యాఖ్యానించలేను.
- నాకు తెలిసినంత వరకూ (పుట్టు) గ్రుడ్డి వాళ్ళు తమ ఆలోచనలను రంగుల్తోనూ, వివిధ ఆకృతుల్తోనూ అసోసియేట్ చేసుకుంటారు.
- Art without knowledge (పరిజ్ఞానం) breeds miserable mediocrity. (I quote Nabokov here.)
- ఇప్పటికే ఆకాశం శూన్యం అయిపోయింది, నింగి నీలానికి కారణాలున్నాయి, సూర్యుడు గాలి ముద్దా, చంద్రుడు రాతి ముద్దా అయి కూర్చున్నారు. ఇక చాలీ పరిజ్ఞానం :)
సైన్సు సమర్థించేది సత్యాన్ని. సత్యంలోనే సౌందర్యం ఉంటుంది. సౌందర్యం నుండే కళా సృష్టి జరుగుతుంది. (ఇక్కడ నేను "సౌందర్యం" అనే పదానికి ఉద్దేశించిన విశాలార్థాన్ని విడమరచాలంటే చాలా రాయాలి. మీరు అర్థం చేసుకోగలరనే అనుకుంటున్నాను.)
- I think పరిజ్ఞానం is slightly over rated anyway :)
I think this is ugly generalization anyway.
- నేనింతా రాసింది నాకు రచయితల అపరిపక్వ భావాలు వద్దనే కదా. వాళ్ళు దాన్ని నిర్మాణాత్మకమైన కళతో నాకు చేరవేయగలగాలి. శ్రీ శ్రీ అలా చేయగలిగాడు కాబట్టే "మరో ప్రస్థానం" ఇందాకా నిలబడగలిగింది. లేకపోతే శ్రీ శ్రీ ని అనుకరిస్తూ అవే భావాలతో ఎంతమంది రాయలేదు? వాళ్ళంతా ఏమయ్యారు?
బై ది బై, మీరేదైనా చాలా స్పీడుగా చదువుతారనుకుంటా.
మీ వాక్యాలకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదని పిస్తే క్షమించాలి. నా నైజం ఏంటంటే, ఇంతకు ముందు చెప్పినట్లు, క్లిష్టమైన వాఖ్యాలు నిజమవ్వడానికి చాలా ఆంక్షలు వర్తిస్తాయి, కాబట్టి మామూలుగా నేను అలాంటి చర్చల్లో పాల్గొనను, మీ టపాలో కొన్ని వాక్యాలతో నేను పూర్తిగా అంగీకరించలేకున్నాను, కాబట్టి వాటిని పేర్కొని అవి ఏ సందర్భాలలో తప్పు అవ్వగలవో చెప్పాను. అలా చేయడాన్ని అనవసర కసరత్తని పేర్కొన్నాను అంతే . ఎందుకంటే అంతా అయ్యిన తరువాత ఎవరునమ్మేది వారు నమ్ముతారు(ఉదా - నేను ఆచరణలో వున్న పాశ్చాత్య రీజనింగ్ ప్రకారం మంచిగా వుండడం మంచిదని కూడా నిరూపించలేము). నా వ్యాఖ్య ద్వారా మీ ఆలోచనకు కొంత మేత వేద్దామని నా సదుద్ధేశం. ఇక ఆ స్మైలీలెందుకంటే, నేను చేసిన వాఖ్యాలు నిజమవడానికి కూడా కొన్ని ఆంక్షలు వర్తించాలి, అని అర్థంచేసుకోగలరు. ఇతను చెప్పేవి ఎప్పుడు నిజమవ్వచ్చు అని మీరు తీరికుంటే ఆలోచించండి లేకుంటే ప్రేలాపన అని తీసిపారేయండి. ఈ మధ్య కొంత కాలంగా నేను బ్లాగు రాయడం మానేశాను. నేను రాసే సగం-సీరియస్ శైలి అలవాటు వున్న వారు చెబుతారు నా ఉద్ధేశాలు అతి మంచివని :-)
To: రాకేశ్వర రావు,
I was not trying to attack you or anything. I was just curious about your stance, that’s all.
ప్రతీ సిద్థాంతానికి ప్రమేయాలు ("ఆంక్షలు") ఉంటాయని మీరంటారు. నిజమే, ఒక సిద్థాంతాన్ని సార్వజనీనం చేయడానికి ప్రయత్నించినపుడు ఇలాంటి ప్రమేయాలు తప్పవు. సామూహికంగా చెల్లుబాటు కాగలిగే సిద్థాంతాలుంటాయంటే నాకూ అపనమ్మకమే. వ్యక్తికీ వ్యక్తికీ సిద్థాంతం పరివర్తన చెందుతుందని నేను నమ్ముతాను. నేను నా పోస్టులో ప్రతిపాదించింది—దాన్ని ఎంతగా సార్వజనీనం చేయ ప్రయత్నించినా—చివరకు నా సిద్థాంతంగానే (వ్యక్తిగత అభిప్రాయంగానే) మిగులుతుందని నాకు తెలుసు. కానీ ఈ సిద్థాంతం (ఇది నిజానికి ఎక్స్‌క్లూజివ్‌గా నా సిద్థాంతం కూడా కాదు) కళ యొక్క ఉత్కృష్టతను కాపాడుతుందని నా నమ్మకం; అదే నిరూపించడానికి ప్రయత్నించాను. మీరు నా నిరూపణలో ఏవైనా factual errors చూపించి ఉంటే నేనూ ఆలోచించే వాణ్ణి; కానీ మీరు ఎత్తిచూపించింది, ఇంతకుముందు చెప్పినట్టు, temperamental differences మాత్రమే. బహుశా కళ ఎలా ఉండాలి అనే విషయమై మీరు నమ్మే సిద్థాంతం వేరు కావచ్చు. మీరే చెప్పినట్టు అంతా అయ్యిన తరువాత ఎవరునమ్మేది వారు నమ్ముతారు. Better leave it at that.
బ్లాగురాయడం ఎందుకు మానేసారు; ఏవైనా బిగ్‌బాంగ్ ప్లాన్ చేస్తున్నారా?
@ ఫణీంద్ర కుమార్ గారు
కళ అందంగా వుండాలన్నది నా బడుగు అభిప్రాయం. అది కానీచో కనీసం గొప్పాగవుంటే మంచిది.
ఇక కళాకారులు ప్రథమంగా వారినే సంతృప్తి పరుచుకోవడానికి సృష్టిస్తారు కాబట్టి పాపం వారికి పూర్తి స్వాతంత్రం ఇచ్చేస్తాను (ఇది మీ టపాలో నాకు సమ్మతం గాని ముఖ్యాంశం. ఇంక పాక్చుయల్ తప్పులు ఎంచడానకి ఇది ఒక రకమైన లెక్క కాదు కాబట్టి అభిప్రాయబేధం మాత్రమే తెలుపగలను). సాఫ్టువేరులోలా మాడులార్ గా వుండాలి రీయూసబుల్ గా వుండాలి పోర్టబుల్ గా వుండాలి అనే కొలబద్దలు లేక పోవడమే నాకు కళారంగాల్లో నచ్చుతుంది. కళ నిజాయితీగా వుంటే చాలు నాకు.
కానీ మీరు సూచించినట్లు రచయితలు దృశ్యాన్ని వాడుకోవాలి వంటిసూచనలు రచయితలవ్వాలనుకునేవారికి మంచి పాఠం అవుతుంది. కృతజ్ఞతలు.
తా.క - బ్లాగు మానేసి పదకొండు పేజీల నాటిక ఒకటి వ్రాసా , కానీ అది ఒక్క మగాడు సినిమాలా తుస్సుమన్నట్టుంది. ఇక నవతరంగం.కామ్ లో కొన్ని టపాలు అప్పువున్న. ఆ తరువాత హైదరాబాదులో వేశ్యల గురించీ మంచితనం గురించీ టపాలు వేయాలి.
To: రాకేశ్వర రావు,
కళకు అందం ముఖ్యమన్నదే నా అభిప్రాయం కూడా.
అయితే ఆ అందానికి సత్యం (హేతువు) పునాదిగా ఉండాలని కొందరు ఆశిస్తారు; అందం పునాది అబద్దమైనా పర్వాలేదని కొందరు భావిస్తారు.
మీ మొదటి వ్యాఖ్యలో పరిజ్ఞానం overrated అని చెపుతూ మీరిచ్చిన ప్రకృతి ఉదాహరణనే తీసుకుంటే (ఇప్పటికే ఆకాశం శూన్యం అయిపోయింది, నింగి నీలానికీ కారణాలున్నాయి...)—
ఇంద్రధనుస్సు ఆకాశం నుండి భూమికి వేయబడిన రంగుల నిచ్చెనగా వర్ణింపబడటం కొందరికి అందం. ఓ చిన్ని వర్షపు చినుకు లోంచి చొచ్చుకుపోయిన సూర్య కిరణం సప్త వర్ణాలుగా వికీర్ణమవడంలోని మార్మిక సౌందర్యం మరికొందరికి అందం. రెండూ అందమైన దృక్కోణాలే: ఒకటి అబద్దం, ఒకటి నిజం.
సృష్టిని హేతు దృష్టితో యథాతథంగా స్వీకరించినా అందులో సరిపడినంత మార్మికత ఉంది; మనం దాన్ని ఇంకా మిస్టిఫై చేసుకోవలసిన అవసరం లేదు. కళకు హేతువు/తర్కం/సైన్సు శత్రువులు కాదు.(I am not talking about Applied sciences here.) సృష్టి కళకు ముడిసరుకనుకుంటే, డార్విన్‌ని చదివిన మీకు చెప్పనక్కర్లేదు సైన్సుకూ కళకూ ఎంత అవినాభావ సంబంధం ఉందో. మొన్నో తీరిక రోజు ఆలోచించి చించి ఓ లాజికల్ సీక్వెన్సుకు రాగలిగాను.I think the equation goes something like this:
Universe → Five Senses → Mind → Memory → Imagination → Knowledge → Art & Science
ప్రపంచాన్ని మన పంచేంద్రియాల ద్వారా మెదడులోకి జ్ఞాపకాలుగా స్వీకరిస్తాం. మన కల్పానా శక్తి/ఊహా శక్తితో (ఇక్కడే మనం జంతువులతో వేరుపడేది) జ్ఞాపకాల్ని విశ్లేషించి జ్ఞానాన్ని సంపాదిస్తాం. ప్రంచానికి ప్రతిసృష్టి చేయాలన్నా (కళ), ప్రపంచాన్ని ఆకళింపు చేసుకోవాలన్నా(తర్కం/సైన్సు) ఈ జ్ఞానమే పునాది. ఒకే పునాది నుండి అభివృద్ది చెందిన ఈ రెండూ పరస్పరాధారితాలు అని నా అభిప్రాయం.
నా పోస్టులో నేను ప్రధానంగా వ్యతిరేకించింది రచయితలు తమ రచనల్లో అతిగా చొరబడడాన్ని. ఆ ప్రయత్నంలో ఎక్కడైనా నేను కళకు కొలమానాల్ని విధిస్తునట్టు మీకనిపిస్తే క్షమించాలి. కొలతవున్న రచనలోని అందం chaotic రచనలో ఉండదని చెప్తున్నానంతే. సృజనలో హృదయమే కాదు, మెదడుకూడా కనపడాలన్నది నా అభిప్రాయం. కలకాలం నిలవడమే కళకు కొలమానం అని నేను నమ్మను. "కలకాలం నిలవాలంటే" అని ఉన్న ఆ ఒక్క చోటా "నాకు నచ్చాలంటే" అని తర్జుమా చేసేసుకోండి—మీకూ నాకూ ఏ గొడవా ఉండదు. కానీ రచయితలు తమ రచనలోకి చొచ్చుకు వచ్చి కచ్చాళీ చేసే రచనలకీ, రచయితల్నుండి విడివడి తమదైన స్వతంత్ర అస్థిత్వం కలిగివున్న రచనలకీ తేడా, గుహ గోడలపై ఆదిమ మానవుడు గీసిన చిత్రానికీ, వాన్‌గో కళాఖండానికీ ఉన్న తేడాతో సమానమని నా నమ్మకం.
** ** **
హైదరాబాదులో వేశ్యల గురించీ మంచితనం గురించీ—మీ వస్తువుల్లో చాలా వైవిధ్యం ఉంది! ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను.
ఒకటి అబద్దం, ఒకటి నిజం. నాకు నవ్వొస్తుంది కానీ మీరు స్మైలీలు పెట్టవద్దాన్నారు, అమ్యూసింగ్ గా వుంది, నాకు చాలా విషయాలు అమ్యూసింగా గా అనిపిస్తాయి, పర్సానాలిటీ ట్రెయిట్ అంట!
మీరు చెప్పేది నాకు అర్థమయ్యింది. ఇక కవిగా రూపకాలకోసం మీరు వెతికేవారే కాబట్టి నేనూ మీకు చెప్పేదేం లేదు. మన శత్రువులల్లా నానో కార్లతో, నియాన్ దీపాలతో ప్రపంచాన్ని సౌందర్యరాహిత్యం చేసేవారు!
ఇప్పటికే ఏంటి కలంకలల్లో గోల చేస్తున్నావని అందరూ ఆడిపోసుకుంటున్నారు నన్ను!
బహుశా కథ మౌఖికంగా మొదలవడం కారణం కావచ్చు, పాత కథల, ఇప్పటికీ తెలుగు కథల నిండా రచయిత వాచ్యంగా ధ్వనించడానికి. ఇది పరిణామక్రమమే అనుకుంటే - ఎదుగుదల, లేదా పరిణితి లాంటి పదాలు వదిలేద్దామిక్కడ - ఇంకో దృక్కోణంలో ఈ దృశ్యాలూ పనికిరానివిగా మిగిలిపోయి పాఠకుణ్ణి minimalism వొడ్డుకి చేరుస్తాయి. రచయిత మనకోసం ఆలోచించిపెట్టడం ఎంత దుస్సహంగా తోస్తుందో, మన ఊహల్ని తను అనుకున్నవైపుకి (ఎంత నేర్పుగానయినా) మనకి తెలిసేలాగే మళ్ళించబూనటమూ అంతే చిరాకనిపిస్తుంది. అక్కడిదాకా వెళ్ళినప్పుడు, లేదా వెళ్ళదలిచినప్పుడు Raymond Carver కథలు చదవండి.
మీరు అయాన్ రాండ్ ను స్త్రీ గా పొరబడినట్టున్నారు. అయాన్ రాండ్ పురుషుడు. ఉదాహరణకు "అయాన్‌రాండ్ తన సాహిత్యవ్యాసాల సంకలనం "రొమాంటిక్ మేనిఫెస్టో"లో రచనా శైలి విషయమై తన అభిప్రాయాల్ని వెల్లడి చేస్తూ, ఒక డిటెక్టివ్ నవలా రచయిత Mickey Spillane శైలికీ, మరో సీరియస్ రచయిత Thomas Wolfe శైలికీ పోలిక తెస్తుంది. వారి రచనల్లోంచి న్యూయార్క్ నగర వర్ణనకు సంబంధించిన రెండు వచన భాగాల్ని ఇలా ఉదహరిస్తుంది
క్షమంచండి, నేనే పొరబడ్డాను. ఎక్కడో అలోచిస్తూ ఇలా రాసాను. మీరు చెప్పిందే నిజం.
ఫణి గారు,
నమస్తే. పొద్దు ద్వారా మీ బ్లాగు చూట్టం జరిగింది. మీ భావాలు, ఆలోచనలు బాగున్నాయి. మీరుదహరించిన ఆంగ్ల గ్రంధాలేవీ చదవలేదు కానీ ఈ టపా, దీని ముందుదీ అద్యంతం ఒకటికన్నా ఎక్కువసార్లు చదివాక, ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఆగిపోయా.
"కాని ఎందుకో కేవలం పాఠకుల నుండే ఎవరూ ఎలాంటి పరిజ్ఞానాన్నీ ఆశించరు. రచయిత స్థాయిని పాఠకుడు అందిపుచ్చు కోవడం కాదు, రచయితే పాఠకుడి స్థాయికి దిగిరాయాలని ఆశిస్తారు."
మీరంత ఏకపక్షమయిన అభిప్రాయానికి ఎలా వచ్చారు? నేను ఆదికవి వాల్మీకి నుంచి నేటి రచయితల వరకూ ఆలోచిస్తూ వచ్చా. మీరన్నది నాకెక్కడా సాధ్యమని అనిపించలా.
అసలు రచయితని దిగిరమ్మని ఎవరంటారండీ, పాఠకుడా? కానే కాదు. అయితేగియితే ప్రచురణకర్త అయుంటాడు. మీ అభిరుచిని బట్టి చూస్తే మీకు అలాంటి రచయితలు ఎలాగూ నచ్చేట్టులేరు. పోనీ పాఠకుణ్ణి రచయిత స్థాయికి ఎదగాలి అనుకుంటే, రచనా వ్యాసంగమే వ్యాపకంగా అనంతమైన ఆలోచనల్ని ఏరికూర్చి రచయిత చేసిన రచనల్ని, పఠనం తనకున్న వంద వ్యాపకాల్లో ఒక వ్యాపకంగా గల పాఠకుణ్ణి
ఎల్లవేళలా రచయితతో పాటు ఎదుగుతూ అర్థంచేసుకో అనటం ఎంత వరకూ సమంజసం?
నా అభిప్రాయం ప్రకారం అసలు రచయితే ఒత్తిడికి గురవుతాడు. తన స్థాయికి చెందిన నలుగురికే పరిమితమవాలా, లేక పదిమందికీ చేరగలిగే స్థాయికి వెళ్ళాలా అని. అలా పదిమందిలోకి వెళ్ళాలనుకోవటానికి కారణం కీర్తిప్రతిష్టలో లేక మరో పది మందికి తాను అనుకున్నది చేర్చాలన్న మంచి ఆలోచనో అయుండొచ్చు కదా. (ఇది ఓ మెట్టు దిగటం అని మీరనుకుంటున్నారా?)
ఉదాహరణకి విశ్వనాధ, ఉషశ్రీ మరియు సుందర చైతన్య ముగ్గురూ రామాయణాన్ని వచనంలో రాసారు. ఇవ్వాళ ముగ్గురిలో ఎవరి పేరు ఎక్కువ ప్రజలకు తెలుసు అంటే ఖచ్చితంగా విశ్వనాధ వారు మొదటి స్థానములో ఉండరు. విశ్వనాధ వారు సాహితీ పరులలో మాత్రమే మేటి, కానీ మిగతా ఇరువురు సామాన్యులలో మేటి.
అలానే తనపై గొప్ప భక్తిశ్రద్ధలున్న పాఠకులు అడిగారని రచయిత రాజీ పడి తనది కాని శైలిలోకి దిగి వ్యాసంగం మొదలు పెట్టేస్తాడనీ నేననుకోను.
ఇంత పెద్ద వ్యాఖ్య వద్దనుకుంటూనే, మళ్ళీ మళ్ళీ అటూఇటూ టపాల తిరుగుడు ఎందుకని రాసేసాను. మీ అభిప్రాయం వెనక వాస్తవాలేమిటో ఎదురుచూస్తాను.
To: వికటకవి,
టపాల తిరుగుడు వద్దన్నారు; మళ్ళీ మీకా ఆవశ్యకత కల్పిస్తున్నానంటే క్షమించండి (నిజానికి నేను మీ నుండి తిరుగు టపాలేవీ ఆశించండం లేదు).
మీరు నా నుండి నిజంగా సమాధాన్ని (“వాస్తవాన్ని”) ఆశిస్తే ఇలా రెటోరికల్ ప్రశ్నలతో వ్యాఖ్యను నింపేవారు కాదు. మీకు నా పోస్టులో ఏం అర్థమయ్యిందో క్లుప్తంగా రాసి, అందులో మీకు ఏది అభ్యంతరమో చెపితే పనౌతుంది గాని, ఇలా ఒద్దికగా ఒక context లో ఒదిగిపోయిన వాక్యాన్ని రెక్క పట్టుకు బయటకీడ్చి చిత్రవధ చేస్తే, దానికి నేను ప్రతిస్పందిస్తే, అర్థరహితమైన వాదనే మిగిలుతుంది గానీ ఏ పర్యవసానమూ తేలదు (చూ: ఇదే పోస్టులో నాకూ రాకేశ్వరరావుకూ మధ్య జరిగిన వాదన).
నా ఈ పోస్టు ఉద్దేశ్యాన్ని మీ సౌలభ్యం కోసం క్లుప్తంగా చెప్తున్నాను: నేను నా గత పోస్టు “దృశ్యం Vs ఆలోచన” ద్వారా రచయితే చొరబడి అంతా చెప్పేసే రచనల కన్నా దృశ్యచిత్రాలతో అల్లిన రచనలు పాఠకుడిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పదల్చుకున్నాను. కాని అది చాలామందికి రచనలో రచయిత అసలేం చెప్పనవసరంలేదని, దృశ్యపరమైన వర్ణనలే శాశ్వతంగా మిగులుతాయని చెప్పినట్టు అర్థమైంది. అది అలాంటి అర్థాన్నిస్తుందని నాకు నాగరాజు పప్పుగారి వ్యాఖ్య చదివాక గాని తెలియలేదు. కాబట్టి ఆ పోస్టుకి కొనసాగింపుగా మరింత వివరణాత్మకంగా నాగరాజు పప్పుగారికి మాత్రమే ఉద్దేశించిన ఈ వ్యాఖ్యను విడి పోస్టుగా రాసాను. ఇందులో, రచయిత తన కథను nebulous abstractions లో చెప్పడం కన్నా వాటికి ప్రతినిధిత్వం వహించే దృక్చిత్రాలలో చెప్పడం ఎలా ప్రభావవంతమో వివరిస్తూ, ఇలాంటి రచనలు పాఠకుడు నుండీ కొంత జాగరూకతనూ, శ్రద్దనూ, పరిజ్ఞానాన్ని ఆశిస్తాయని చెప్తున్న సందర్భంలో మీరు కోట్ చేసిన వాక్యాన్ని రాసాను:
“కాని ఎందుకో కేవలం పాఠకుల నుండే ఎవరూ ఎలాంటి పరిజ్ఞానాన్నీ ఆశించరు. రచయిత స్థాయిని పాఠకుడు అందిపుచ్చు కోవడం కాదు, రచయితే పాఠకుడి స్థాయికి దిగిరాయాలని ఆశిస్తారు.”
ఇది నా అభిప్రాయం కాదు. నేను సర్వత్రా పరిశీలించినది మాత్రమే. ఇది నిజం కాకపోతే సంతోషమే కదా. “రచనా వ్యాసంగమే వ్యాపకంగా అనంతమైన ఆలోచనల్ని ఏరి కూర్చి రచయిత చేసిన” ఓ రచనని రైల్వే కేటలాగ్‌లా చదివేస్తూ పోయే సోమరి పాఠకుల కన్నా, శ్రమించి, రచయిత వేవ్ లెంగ్త్‌తో తమ వేవ్ లెంగ్త్‌ని శృతి కుదుర్చుకుని చదివే పాఠకులే రచన ద్వారా ఎక్కువ ఆనందం పొందుతారని నేను చెప్పదల్చుకున్నాను (ఒక్కో తెరనీ తొలగించుకుంటూ, ఒక్కో మెట్టూ ఎక్కుతూ రచయిత దాకా చేరే శ్రమలోని ఆనందం — అవి నాకు తెలుసు).
మీ మిగతా వ్యాఖ్య ఉద్దేశ్యమంతా రచయితే పాఠకుడి స్థాయికి దిగి రావాలన్నది నిరూపించడమే అయితే మీతో నాకే గొడవా లేదు — మీరు నాకు చాలా దూరంలో ఉన్నారు; ముందా వెనుకా అనేది నేను చెప్పలేను.
ఇక మీరిచ్చిన ఉదాహరణలు irrelvent; వ్యతిరేఖంగా నేనూ ఉదాహరణలు చూపించగలను. కాని ఎపుడైతే మనం వాదనని ఉదాహరణల్లోకి తర్జుమా చేసి వాటితో వాదించుకోవడం మొదలు పెడతామో, అపుడు మనకు వాదాలూ ఉదాహరణలూ మాత్రమే మిగుల్తాయి; నిజం మరుగునే ఉండిపోతుంది.
అభిప్రాయంలో తప్పు ఎత్తి చూపడానికీ, అభిప్రాయంతో విభేదించడానికి చాలా తేడా ఉంది. నా అభిప్రాయంతో విభేధించే సర్వహక్కులూ మీకున్నాయి. కానీ ఏదో తప్పు ఎత్తి చూపానని పొరబడవద్దని నా మనవి.
(మీ వ్యాఖ్యలో మొదటి భాగం రెండో భాగంతో విభేదిస్తుంది. కాసేపు మీ stance ఎటో తెలియక తికమక పడ్డాను.)
@ఫణి గారు,
ముందుగా ఒక విషయాన్ని చదివాక మన మనసుకు తాకినవి అలా వదిలేయకుండా తెలుసుకోవాలన్న ఆరాటం నాది. ఆ రాసిన వ్యక్తి అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటాను. ఏదో తప్పు ఎత్తి చూపాలని కాదు. అధమం రేప్పొద్దున మరొకరు నన్నూ అదే పని చేస్తారన్న భీతి అయినా ఉంటుంది కదా మరో సంకుచిత ఉద్ధేశంతో అడిగేవాడినయితే. నా రాతలతో సంబంధం లేకుండా అడిగే ప్రశ్నలు ఇవి.
ఇకపోతే, వాస్తవం అన్నది నేను కోట్స్లో పెట్టలేదు. అయినా అటువంటి అర్ధాన్ని ఇచ్చిందంటే అసలు ఆ పదప్రయోగం అక్కడ పొరపాటేమో. అర్ధాలు మారుతున్నాయి కనుక క్షమించాలి.
విషయం అంతా రచయిత, భావాలు, పలికించే తీరు మీదే సాగుతూ ఉంది కాబట్టి నేను ఆ వ్యాఖ్యని పూర్తి వ్యాసానికి అన్వయించి చూశాను తప్ప రంధ్రాన్వేషణ కాదు. నేను ముందు చెప్పినట్లు రెండు టపాలు చదివాకే రాసాను. ఇకపోతే, ఉదాహరణ కేవలం ఒకే విషయాన్ని వేరు వేరు రచయితలు వారి పాండిత్యం, ఆలోచనల్ని బట్టి ఎలా రచనలు చేస్తారు అన్న దాన్ని చెబుతూ చెప్పాను.
సాహిత్యం శ్లోకం నుంచి పద్యం, పద్యం నుంచి గద్యం, ఆపై వచనం ఇలా కాల ప్రవాహంలో మారుతూ వచ్చింది. ఎందుకిలా అయ్యింది అని నేనాలోచించినప్పుడు నేను గతంలో అన్నట్లు రచయితే ఒత్తిడికి గురయుండొచ్చు అనిపించింది. రచనల పరమార్ధం పాఠకుల కోసమే కదా. అదే ఇక్కడ చెప్పాను.
దూరాలు, ఎత్తులు ఎందుకండీ. ఇవేమన్న పోటీలా? ఏమాటకామాటే, నేను పోటీలు పడలేను. ఇక టపాల తిరుగుడు తగ్గించటంలో ఉద్దేశ్యం పది చిన్న టపాలు రాస్తే పేజీ లోడు త్వరగా అవదని అంతే. చివరగా, నా స్టాన్స్ అల్లా, షరతుల్లేకుండా ఏ రచనయినా చదవటమే. ఇష్టపడితే ఓ నాలుగు మాటలు రాస్తాను, లేకపోతే ఎక్కువ శాతం ఏమీ రాయను. మౌనం అర్ధాంగీకారం కదా.