Friday, March 14, 2008

What we talk about really when talk about reality

రియాలిటీ. వాస్తవికత. ఈ పదం చాలామంది సాహిత్య విమర్శకుల చేతిలో నమ్మకమైన కొలత బద్ద; దీంతో ఏ రచననైనా కొలిచి విలువ కట్టొచ్చని వారు విశ్వసిస్తారు. ఎంతటి రచయితలూ ఈ అస్త్రం తమపై ఎక్కుపెట్టబడేసరికి నిరుత్తరులై తలవంచుతారు. మరి నిజంగా రచనలకు ఇది అంత ప్రామాణికమైన కొలతా? తిరుగులేని అస్త్రమా? ఫలానా రచనలో వాస్తవికత లోపించిందీ లేదా ఫలానా రచన వాస్తవానికి అద్దం పట్టింది అని తీర్మానించి, దాని పరంగా రచన విలువను తూకం కడుతున్నపుడు, ఈ విమర్శకులు ఏ “వాస్తవికత” గురించి మాట్లాడుతున్నారు? కాస్త నిశితంగా ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు తట్టే సమాధానం ఇది: వారు కేవలం ఆ రచన తమ స్వీయ వాస్తవికత (Subjective reality)కు దగ్గిరగా వచ్చిందీ లేనిదీ, లేదా సామూహికంగా ఏది వాస్తవికతగా అంగీకరింప బడిందో దాన్ని ప్రతిబింబించిందీ లేనిదీ మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే, వస్తుగత వాస్తవికత (Objective reality)ను ఎవరూ గ్రహించలేరు. ఉండటమైతే దాని ఉనికి ఉంది; కాని స్వీయ చేతనా పరిధుల్ని ఛేదించి దాన్నెవరూ దర్శించలేరు. ఎందుకనేది — కాసేపీ పడికట్టు పదాల్ని వదిలేసి — ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం:

ఒక అరణ్య మార్గం గూండా ముగ్గురు వ్యక్తులు నడుస్తున్న సందర్భాన్ని ఊహిద్దాం. మొదటివాడు పట్టణం నుండి వచ్చిన యాత్రికుడు. రెండవాడు వృక్షశాస్త్రజ్ఞుడు. మూడవవాడు స్థానిక గ్రామపు రైతు. మొదటివాడైన పట్టణ యాత్రికుడి దృష్టంతా తన గమ్యం మీద ఉంటుంది. అక్కడ తనకు సరైన విడిది సౌకర్యం లభిస్తుందో లేదో, అక్కడ సరైన హోటళ్ళున్నాయో లేవోనన్న విచికిత్సతో నిండివున్న అతని మస్తిష్కంలో, చుట్టూ దారి కిరువైపులా బారులు తీరి వున్న వృక్ష సౌందర్యం ఎలాంటి కదలికా కలిగించదు. అతనికి సంబంధించినంత వరకూ చెట్లు చెట్లే, మొక్కలు మొక్కలే; అంతకన్నా వాటికి ఏ విలువా ఉండదు. రెండోవాడైన వృక్షశాస్త్రజ్ఞుడికి ఈ అరణ్యమంతా మిక్కిలి ఆసక్తిని కలిగిస్తుంది. నడిచేటపుడు అటూ ఇటూ చూసుకుంటూ, అవ్యవధానంగా ఫలానా ఫలానా వృక్షాల శాస్త్రీయనామాల్ని మనసులో మననం చేసుకుంటూ నడుస్తాడు. అతనికి సంబంధించినంత వరకూ ఆ అరణ్యపు పరిసరాలన్నీ వృక్షాలుగా, మొక్కలుగా, పొదలుగా, పాదులుగా ఖచ్చితమైన విభజనతో ఉంటాయి; నియమిత జాతులుగా ఉపజాతులుగా వర్గీకరించబడి ఉంటాయి. మర్రిచెట్టుకూ రావిచెట్టుకూ తేడా తెలియని యాత్రికుని వాస్తవికత అతనికి అర్థం కాదు. అలాంటి ఉదాసీనత అతనికి సంబంధించినంత వరకూ అనూహ్యం, విచిత్రం, అసంగతం. చివరిగా, మూడోవాడైన రైతు యొక్క మానసిక ప్రపంచం పై ఇరువురికన్నా భిన్నమై ఉంటుంది. అతడిక్కడే పుట్టి పెరిగినవాడు. అతనికి ఇక్కడ ప్రతీ చెట్టూ, ప్రతీ తొర్రా, ప్రతీ కొమ్మా, ప్రతీ ఊడా సుపరిచితమే. ఆ అరణ్యం అతనిలో యాత్రికునికి మల్లే ఉదాసీనతా కలిగించదు, వృక్షశాస్త్రజ్ఞుడికి మల్లే శాస్త్రీయపరమైన ఆసక్తీ రేకెత్తించదు. ఆ అరణ్యం అతని వ్యక్తిగత అనుభూతులతో ముడిపడి ఉంటుంది; అతన్ని బాల్య స్మృతులలో ఓలలాడిస్తుంది. ఆ అరణ్యం అతనిలో ఉద్దీపింపజేసే సున్నితమైన భావోద్వేగాల్ని పట్టణ యాత్రికుడూ, వృక్షశాస్త్రజ్ఞుడూ ఎన్నటికీ అర్థం చేసుకోలేరు.

అక్కడ ఉన్నవీ, ముగ్గురికీ కనపడుతున్నవీ ఒకే రకమైన చెట్లు, ఒకే రకమైన మొక్కలు — ఒకే రకమైన వస్తుగత వాస్తవికత; కానీ దానిని ముగ్గురిలో ఏ ఒక్కరూ యథాతథంగా స్వీకరించ లేకపోతున్నారు. చెట్టు, పొద, మొక్క లాంటి పూర్తి objective పదార్థాలు కూడా ముగ్గురిలో విభిన్నమైన స్వకీయ ప్రతిస్పందనల్ని రేకెత్తిస్తున్నాయి; స్వీయ వాస్తవికతను కల్పిస్తున్నాయి. ఇక్కడ మనం మూడు వేర్వేరు ప్రపంచాల్ని చూస్తున్నాం; మూడు వేర్వేరు వాస్తవికతల్ని చూస్తున్నాం: ఒకటి ప్రకృతిని ప్రకృతిగానే చూసేది; మరొకటి ప్రకృతిని శాస్త్రీయ దృక్కోణంలో చూసేది; ఇంకొకటి ప్రకృతిని వ్యక్తిగత అనుభూతుల, జ్ఞాపకాల కటకం ద్వారా దర్శించేది. వీటికి మనం ఇంకొన్ని ఉదాహరణల్ని కూడా జత చేయవచ్చు: ఓ కుక్కతో నడుస్తున్న గుడ్డివాడు, తన యజమానితో నడుస్తున్న కుక్క, హృద్యమైన అస్తమయ దృశ్యం కోసం అన్వేషిస్తున్న చిత్రకారుడు, పెట్రోలయిపోయిన కారుతో నిలబడి ఉన్న అమ్మాయి... ఇలా ప్రతీ వ్యక్తిలోనూ ఇవే పరిసరాలు వేర్వేరు స్వీయ వాస్తవికతలుగా వక్రీభవించి ప్రతిఫలిస్తాయి. మరి మనం వస్తుగత వాస్తవికతను గ్రహించే మార్గమే లేదా? — అంటే లేదు (ఇందాకా చెప్పినట్టు మనం మన మస్తిష్కమనే చెరసాలలో జీవిత ఖైదీలం); కాని దానికి కాస్త దగ్గిరగా వచ్చే మార్గం ఉంది. ఎలా అంటే — నవ్వకండి — ఇపుడు పైన వివరించిన వేర్వేరు వ్యక్తుల స్వీయ వాస్తవికతల్ని స్వీకరించి, ఒక పరీక్షనాళికలో వేసి, బాగా గిలక్కొడితే వచ్చే మిశ్రమం సోకాల్డ్ వస్తుగత వాస్తవికతకు కాస్త దగ్గిరగా రావొచ్చు. దీన్ని సామూహిక వాస్తవికత (Collective reality) అందాం. అయితే ఈ సామూహిక వాస్తవికత యొక్క గుణం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇపుడు పైన ఉదహరించిన పరిసరాల్లోంచి ఒక పిచ్చివాడు కూడా నడుస్తూ వెళ్ళాడనుకోండి; మనకు లభించే మిశ్రమంలో కాస్త పిచ్చితనం కూడా వచ్చి చేరుతుంది. మరి విమర్శకులు “వాస్తవికత” అన్న పదాన్ని వాడుతున్నపుడు ఈ అస్థిరమైన, అమూర్తమైన “సామూహిక వాస్తవికత” అనే అర్థంలో వాడుతున్నారా? అసలు రచయితలు ఈ సామూహిక వాస్తవికతపై ఆధారపడి తమ రచనలు చేయాలా?

ఒక్కసారి ఊహించండి: రద్దీ రహదారి పై నడుస్తున్నపుడో, క్రిక్కిరిసిన థియేటర్లో కూర్చున్నపుడో... మీ చుట్టూ తలలు! కొన్ని హెల్మెట్లలోనూ, కొన్ని టోపీల క్రిందా, కొన్ని బట్టతలలతోనూ, కొన్ని బారెడు జడలతోనూ... వేల వేల తలలు! వీటన్నింటిలోనూ వేల వేల ప్రపంచాలు! అంటే, ఒక్క ప్రపంచానికి వేల వేల వెర్షన్లు. ఒక ప్రపంచపు వాస్తవికత మరో ప్రపంచపు వాస్తవికత కాదు. ఈ విషయం తెలిసి కూడా కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో కుర్రాడొకడు తెగ మథన పడిపోతుంటాడు. విషయమేవిటంటే — వాడు అదే హౌసింగ్‌బోర్డులో రెండు వీథుల కవతల, ముంగిట నిత్యమల్లె చెట్టు ఉండే ఓ ఇంట్లోని అమ్మాయితో నిండా ప్రేమలో మునిగిపోయాడు. (నిజానికి ఆ అమ్మాయి కోసమే అక్కడ మకాం పెట్టాడు.) ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి తన జీవితం తను జీవించేస్తుంటుంది. ఆ పిల్ల లోకల్‌ట్రైన్ దిగి హడావిడిగా తన ఉద్యోగానికి నడిచిపోతుంటే మనవాడు ఇవతలి ప్లాట్‌ఫాం మీద నిల్చొని తెగ ఆశ్చర్యపడిపోతుంటాడు. ఆశ్చర్యం ఎందుకంటే — ఆ అమ్మాయి నడుస్తుంటే ప్లాట్‌ఫాం పై ఎవ్వరి తలలూ ఆమె వైపు తిరగవు; ఎవరూ తమ పనులు మాని ఆమె వంకే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోరు. ఆశ్చర్యమే కాదు; ఆమె వెళిపోయాక, ఆమె నవ్వులన్నీ తన గైర్హాజరీలో అర్హత లేని మొహాల ముందు వ్యర్థంగా ఖర్చయిపోతున్నాయని తెగ ఇదయిపోతుంటాడు కూడా. ఆమె బేరం అడుతుంటే విసుగ్గా బదులిచ్చే షాపువాడ్నీ, సాక్షాత్తూ ఆమె టికెట్‌కౌంటర్ దగ్గర నిలబడితే కనీసం తల కూడా ఎత్తకుండా టికెట్ కొట్టిచ్చేసే రైల్వే ఉద్యోగినీ చూసి వాడు విస్తుపోతుంటాడు. “Why can’t they see.... The most adorable woman on earth! Before their very eyes!! Why can’t they see!!!” — అనుకొని కుమిలిపోతుంటాడు కూడా. కాని ఇలాంటపుడే, వాడి భావుకత్వపు డిప్ప మీద హేతువు ఒక్క పీకు పీకి, “రేయ్! ఆ అమ్మాయి నీక్కనిపించినంత వాస్తవంగా వేరెవరికీ కనిపించదురా. ఆ అమ్మాయి నవ్వితే ఇక్కడ నీ మనసులా ఇంకెవ్వరి మనసులూ మతాబా రవ్వలై రాలి పడవురా” అంటూ ఓ నిష్ఠుర నిజాన్ని వాడి ముందు పడేస్తుంది. అప్పుడు చూడాలి వాడి మొహం! — హేతువే గనక మూర్తీభవించి వాడి ముందుకొస్తే “నీకు పనేంటే అసలిక్కడా” అంటూ మీద పడి రక్కేస్తాడు. కాని హేతువు హేతువే; నిజం నిజమే. వాడి వాస్తవిక ప్రపంచానికి ఆ అమ్మాయి అధిదేవత; మిగతా ప్రపంచానికి ఆమె ఒక అమ్మాయి, అంతే.

సరే వాడి సంగతి వదిలేద్దాం. ఇందాక మన చుట్టూ ఉన్న వేల వేల తలల గురించీ వాటిలో వసించే వేల వేల ప్రపంచాల గురించీ చెప్పుకుంటున్నాం కదా. వీళ్ళందరిలో తన ప్రపంచానికి tangible రూపం ఇయ్యగలిగేవాడు కళాకారుడొక్కడే. మిగతా ప్రపంచాలన్నీ ఆయా వ్యక్తులతో పాటూ మృతి చెంది మృత్తిక పొరల్లో లీనమై పోవాల్సిందే. కేవలం కళాకారుడొక్కడే తన ప్రపంచానికి అమరత్వాన్ని ఆపాదించగలడు (I am thinking about the ultimate range of Valmiki and Shakespeare now). మరి ఈ ఉత్కృష్టమైన వరాన్ని పొందిన రచయిత కేవలం సోకాల్డ్ సామూహిక వాస్తవికత యొక్క ఆమోదం పొందే ప్రయత్నంలో, తన సృజన దానిని ప్రతిబింబించి తీరాలన్న బాహ్య ఒత్తిడికి లొంగి తనదైన ప్రపంచపు వైవిధ్యాన్ని, అద్వితీయతనూ డైల్యూట్ చేసి బయట పెట్టాలా? ఉదాహరణకి నేను ఇంతకుముందు ప్రస్తావించిన పాగల్‌గాడి సంగతే తీసుకుందాం. వాడే ఓ ప్రేమ కథ రచించాడనుకుందాం. ప్రేమ పై వాడి దృక్కోణం వేరు. ప్రేమకు సంబంధించినంత వరకూ వాడి వాస్తవికత వేరు. అతడు తన ప్రేమను కేవలం ఆమెకూ తనకూ నడుమ వ్యవహారంగా సరిపుచ్చడు; మధ్యలో మొత్తం సృష్టి యంత్రాంగాన్నే ఇరికిస్తాడు. సృష్టిలో ప్రతీ మామూలు ఉదంతం, ప్రతీ యాదృఛ్చిక ఘటనా తామిరువుర్నీ చేరువ చేయడానికే (లేదా దూరం చేయడానికే) సంభవిస్తున్నాయని నమ్ముతాడు. అకాలంగా వాన కురిసినా, పూర్ణ చంద్రుడు వెన్నెల గుడి కట్టినా, సూర్యుడు ఆకాశానికి అందమైన రంగులు పులిమి అస్తమిస్తున్నా, చుక్క రాలినా, పూలు రాలినా అన్నీ తన ప్రేమకు అందమైన నేపథ్యాన్నివ్వడానికే జరుగుతున్నాయని నమ్ముతాడు. విశ్వపు ఆలనా పాలనా చూసే హస్తమేదో తమ ఇద్దర్నీ జతగా ముందే రాత రాసి పెట్టిందని విశ్వసిస్తాడు. అతడీ ప్రపంచాన్ని యథాతథంగా స్వీకరించడు; తన ప్రేమ మాధ్యమం ద్వారా వడగట్టి ఆ వక్రీభవించిన వెర్షన్‌నే స్వీకరిస్తాడు. అది వాడి వాస్తవికత. ఇపుడు వాడు సృజించే ప్రేమకథ ఈ రియాలిటీతోనే ఉంటుంది; సృష్టిని ఈ mystic view తోనే మన ముందుంచుతుంది. ఇపుడిందులో వాస్తవికత లేదని ఎవరైనా అంటే.... ఏ వాస్తవికత? ఎవడి వాస్తవికత?

నేనిక్కడ రచయిత తనదైన వాస్తవికతనే ప్రతిబింబిస్తూ రచనలు చేయాలన్న అపూర్వమైన విషయాన్నేం ప్రతిపాదించడం లేదు; ఎందుకంటే ప్రతీ రచయితా ప్రత్యేక ప్రయత్నమేమీ లేకుండానే తన వాస్తవికతనే చిత్రిస్తాడు. అయితే తన ఈ వాస్తవికత అందరికీ ఆమోదయోగ్యం కాదు కదా అన్న అదృశ్య ఒత్తిడికి లొంగి తన రచన యొక్క గాఢతను పలచబరచుకో కూడదని చెప్తున్నాను. తను చూసినట్టు అందరూ ఈ ప్రపంచాన్ని చూడరేమోనన్న సంశయంతో తన దృక్కోణాన్ని మసకబార్చుకో కూడదని చెప్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది అతని ప్రత్యేకమైన వాస్తవికతే; అతని ప్రత్యేకమైన దృక్కోణమే. మనకు కావాల్సింది — తనదైన ప్రపంచానికి కల్పన జోడించి అతను అందించగలిగే స్వయం సమృద్ధ ప్రపంచమే (Self-contained World). అతని రచనలు రియాలిటీని ప్రతిబింబించనక్కర్లేదు; తన subjective realityని ప్రతిబింబిస్తే చాలు. వాటిలో లాజిక్ ఉండనవసరం లేదు; తమదైన internal logic చూపించగలిగితే చాలు. A writer has no obligation to any reality except his own.

** ** **

ఈ వ్యాసంలోని ముగ్గురు వ్యక్తుల ఉదాహరణ, కార్నెల్ విశ్వవిద్యాలయంలో కాఫ్కా "మెటమార్ఫసిస్"ను విశ్లేషిస్తూ, వ్లదీమర్ నబొకొవ్ ఇచ్చిన
ఉపన్యాసం నుండి స్వీకరించబడింది.

41 comments:

kalhara said...

నిజమే కదా! ఒకసారి ఏదో సినిమా అసలు బాగుండలేదు అంటే ఒకతను డైరెక్టర్ కళ్ళలోంచి చూడమన్నాడు.ప్రపంచం పట్ల, వ్యక్తుల పట్ల, విషయాలు, విలువల పట్ల ఎవరి perception వారికి ఉంటుంది. అది కళాకారుడి perception తో పూర్తిగా ఎప్పుడూ match అవదు. ఏందుకంటే afterall కళాజారుడు కూడా తనదైన ప్రత్యేక దృక్పధం కల మిగతా వాళ్ళ లాంటి మనిషే గనక.

అసక్తికరమైన వ్యాసం.

Subrahmanyam Mula said...

దాదాపు ఇదే భావాన్ని నేను

"నాతో పాటు కళ్ళు తెరిచి
నాతో పాటు కళ్ళు మూసే లోకం" అని రాసాను.

great feeling to read ur works.keep writing!

వింజమూరి విజయకుమార్ said...

ఫణి గారూ,

నిజమే. నేను మొదటి నుండీ ఈ వాస్తవికత అనే పదానికి చాలా దూరం. దారిద్ర్యం, దుర్భిక్షం వీటిని యధాతథంగా రాస్తే, మనం నిజం జీవితంలో చూసేది చాలక ఈ కథలో కూడా చదవాలా అనే భావన కలిగి తీరుతుంది. అందుకే ఏది రాసినా దానికి కొంత కశాత్మకత, అతిశయోక్తి జోడించి చెప్పడం యిష్టపడతాను. అలాగని నాకు స్ఫురించిన మాటలు స్ఫురించినట్టుగా రాసినా నాపైన వున్న పూర్వ రచయితల ప్రభావమూ కన్పిస్తోంది. కనుక, ఆ ప్రభావాన్ని తప్పించుకుంటూ కళాత్మకంగా రాయడం తప్పనిసరైంది.

రానారె said...

ఈ టపా మొదటి పేరా చదవగానే చివరి పేరాలో మీరేం చెబుతారో ఊహించాను. రచనలపై స్పందన ఎలా వుంటుందోననే ఒత్తిడికి దాదాపు ప్రతి రచయితా కొంతైనా తలవంచుతాడనుకొంటాను. ఆమాటకొస్తే రచనలు అనేకాదు, మాట్లాడే మాటలు, చేసే చేష్టలకు కూడా ప్రతిస్పందన ఎలా వుంటుందోననే ఒత్తిడికి సంఘజీవియైన వా డెవ్వడైనా కొంతైనా తలవంచక తప్పదనిపిస్తుంది. ఆ 'కొంతైనా' అనేది ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగా వుండేలా ప్రయత్నిస్తాడు. ఒత్తిళ్లకు యేమాత్రమూ తలవంచకుండా స్వీయవాస్తవితకతను బహిరంగంగా ప్రకటించేవాళ్లకు గాంధీ, గెలీలియో, క్తీస్తు, సోక్రటీసు, ఒషోలాంటివాళ్లకు వచ్చిన యిబ్బందులు వస్తాయని నా అభిప్రాయం. సామూహికవాస్తవికత స్వీయవాస్తవికతను హత్యచేసేందుకు ప్రయత్నిస్తుందని నా అవగాహన.

ఫణి said...

To: రానారె,

ఇక్కడ సంఘం, వ్యక్తుల మధ్య సంఘర్షణ గురించి నేను మాట్లాడటం లేదు. నేను “స్వీయ వాస్తవికత” అన్నది మీరు “స్వీయ సిధ్ధాంతాలు” అని పొరబడినట్టున్నారు (“గాంధీ, గెలీలియో, క్రీస్తు, సోక్రటీసు, ఒషో”—they don't belong here).

What I am saying here is that every one has a unique way of seeing things and interpreting them. And when in this every one some one is a writer, he doesn’t need to dilute his unique vision and interpretation just because of some so-called Reality, which, after all, don’t mean shit.

“రచనలపై స్పందన ఎలా వుంటుందోననే ఒత్తిడికి దాదాపు ప్రతి రచయితా కొంతైనా తలవంచుతాడనుకొంటాను.”

తలవంచద్దనే నేను చెప్పేది. నా ఉద్దేశ్యంలో ఏ genuine రచయితా రాసేటప్పుడే స్పందన గురించి ఆలోచించడు; తన మెదడులో రూపుదిద్దుకున్న ప్రపంచానికి ఎంత దగ్గిరగా, ఎంత నమ్మకంగా అక్షర రూపం ఇవ్వగలిగానన్నదే ఆలోచిస్తాడు. మిగతాదంతా పర్యవసానం అంతే. ప్రయత్నించేటప్పుడే పర్యసానం గురించి ఆలోచించేవాళ్ళ గురించి మనం ఆలోచించనక్కర్లేదు. I am not talking about them.

రానారె said...

ఫణిగారూ,

నేను సరిగా అర్థం చేసుకోలేదేమో. మీతో విభేదించనూలేదు.

"ఎందుకంటే మనకు కావాల్సింది అతని ప్రత్యేకమైన వాస్తవికతే; అతని ప్రత్యేకమైన దృక్కోణమే. మనకు కావాల్సింది — తనదైన ప్రపంచానికి కల్పన జోడించి అతను అందించగలిగే స్వయం సమృద్ధ ప్రపంచమే (Self-contained World). అతని రచనలు రియాలిటీని ప్రతిబింబించనక్కర్లేదు; తన subjective realityని ప్రతిబింబిస్తే చాలు." అన్నారు కదా, ఈ మాటలు చదివాక నాకొక సపోర్టు దొరికినట్టనిపించింది. ఎందుకంటే నేనూ ఇలాగే ఆలోచించాను. అందుకే అన్నాను, మొదటిపేరా చదవగానే మీరేం చెప్పదలచుకున్నారో ఊహించానని.

నాదో సందేహం...

" ప్రయత్నించేటప్పుడే పర్యసానం గురించి ఆలోచించేవాళ్ళ గురించి మనం ఆలోచించనక్కర్లేదు." అన్నారు బాగుంది.

"తను చూసినట్టు అందరూ ఈ ప్రపంచాన్ని చూడరేమోనన్న సంశయంతో తన దృక్కోణాన్ని మసకబార్చుకో కూడదని చెప్తున్నాను." అనికూడా అన్నారు. మనమిక్కడ ఆలోచించింది ఎవరి గురించి?

ఇంకో సందేహం...

"ఇక్కడ సంఘం, వ్యక్తుల మధ్య సంఘర్షణ గురించి నేను మాట్లాడటం లేదు." అన్నారు బాగుంది.

"వారు కేవలం ఆ రచన తమ స్వీయ వాస్తవికత (Subjective reality)కు దగ్గిరగా వచ్చిందీ లేనిదీ, లేదా సామూహికంగా ఏది వాస్తవికతగా అంగీకరింప బడిందో దాన్ని ప్రతిబింబించిందీ లేనిదీ మాత్రమే చెప్తున్నారు."

సంఘం, వ్యక్తులమధ్య ఘర్షణ కాకుండా పోయిందా ఇది! నేను మిమ్మల్ని సవాలు చేయడం లేదు. ఈ వ్యాసాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో నా సందేహాలను మీ ముందుంచుతున్నాను.

రాకేశ్వర రావు said...

@ ఫణి,
బాగా వ్రాసారు.. మీ దగ్గర ఏకలవ్య శిష్యరికం చేసేవారికి బాగా ఉపకరిస్తుంది. ఇలానే కొనసాగించగలరు.

@ మూలా సుబ్రహ్మణ్యం గారు,
మీ కవిత చదివాను అప్పుడా వాఖ్యాల అర్థం అంతగా బోధపడలేదు. ఇప్పుడు అర్థమయ్యింది.

@ రానారె,
మీరేమి చెప్పదలచుకున్నారో నాకు అర్థమయ్యింది. కానీ నా దగ్గర మీకు చెప్పడానికి ఏం లేదు. కానీ అది ఆలోచించదగ్గ విషయమే.

ఫణి said...

To: రానారె,

'నాదో సందేహం...

" ప్రయత్నించేటప్పుడే పర్యసానం గురించి ఆలోచించేవాళ్ళ గురించి మనం ఆలోచించనక్కర్లేదు." అన్నారు బాగుంది.

"తను చూసినట్టు అందరూ ఈ ప్రపంచాన్ని చూడరేమోనన్న సంశయంతో తన దృక్కోణాన్ని మసకబార్చుకో కూడదని చెప్తున్నాను." అనికూడా అన్నారు. మనమిక్కడ ఆలోచించింది ఎవరి గురించి?'


— నా పోస్టులొంచి మీరు ఉదహరించిన ఈ రెండు వ్యాక్యాల్నీ, మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చదివినా, నేను ఒకే అర్థంతో రాసాననిపిస్తుంది. రెండింటి అర్థం ఒకటే కదా. రచయిత సృజన చేసేటప్పుడే స్పందన గురించి ఆలోచించి తన దృక్కోణాన్ని మసకబార్చుకోకూడదన్న అర్థమే రెండింటిలోనూ కనిపిస్తుంది. (కాదా?)

** ** **

నా వ్యాఖ్యలో "నేనిక్కడ సంఘం, వ్యక్తుల మధ్య సంఘర్షణ గురించి మాట్లాడటంలేదు" అని నేనన్నది మీరిచ్చిన ఉదాహరణల్ని చూసి.

Gandhi is an activist, Galileo is a scientist, Christ is a divine messenger, and Socrates, Osho are philosophers. They are not artists; I am talking here about artists.

'ఒత్తిళ్లకు యేమాత్రమూ తలవంచకుండా స్వీయవాస్తవితకతను బహిరంగంగా ప్రకటించేవాళ్లకు గాంధీ, గెలీలియో, క్తీస్తు, సోక్రటీసు, ఒషోలాంటివాళ్లకు వచ్చిన యిబ్బందులు వస్తాయని నా అభిప్రాయం.'

వీళ్ళకూ (వీళ్ళలో నాకు తెలిసిన వాళ్ళకూ), వీళ్ళ చుట్టూ ఉన్న సమాజానికి సంఘర్షణ వీళ్ళు తమ స్వీయ వాస్తవికతను ప్రకటించడం వల్ల వచ్చింది కాదు; నిజాలు ప్రకటించడం వల్ల వచ్చింది. Reality may have subjective and objective versions for it; but truth is truth everywhere. There won’t be any Subjective truths and Objective truths. A truth is truth for me, for you and for everybody.

** ** **

నేనిక్కడ వ్యక్తికీ సంఘానికీ మధ్య సంఘర్షణ గురించి మాట్లాడటం లేదు; రచయితకూ విమర్శకుడికీ మధ్య సంఘర్షణ గురించి మాట్లాడుతున్నాను.

మీరు పైన ఉదహరించిన context ను అనుసరించి ఒక రచయితకు సంబంధించినంత వరకూ పాఠకవర్గమే "సంఘం" అనుకుంటే, వాళ్ళెప్పుడూ రచయిత తమకందించే his unique version of self-contained worlds నే ఆదరిస్తారు. (ఈ విషయమై నేను చాలా ఉదాహరణలివ్వగలను; మీరూ చాలా గమనించగలరు.) పాఠకులకీ రచయితకీ ఈ విషయంలో ఏ సంఘర్షణా ఉండదు. కాని మధ్యలో విమర్శకులే "వాస్తవికత" అంటూ గగ్గోలు పెడతారు. వాళ్ళను పట్టించుకోనక్కర్లేదూ అని నేను నా వ్యాసంలో చెప్పాను.

To: రాకేశ్వర రావు,

నేను ఇక్కడ రాసేవి కొన్ని ముఖతః ఎవ్వరికో ఏవో ఉద్భోదించడానికి రాస్తున్నట్టు కనిపించినా, నిజానికి ఇవి నాకు నేను చెప్పుకుంటున్న పాఠాలు. కొన్ని విషయాలకు సంబంధించి నాకు నేను స్పష్టత తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు. నన్నడిగితే నాకు శిష్యరికం చేయడం చాలా ప్రమాదకరమని మాత్రం చెప్పగలను. (ఇలా ఓ "చట్టబద్దమైన హెచ్చరిక" లాంటిది నా బ్లాగుకు తగిలించడం అవసరమేమో కూడా.) ఎందుకంటే నేనే దారి వెతుక్కుంటున్నాను; ఇంకొకరికి దారి చూపే సత్తా నాలో లేదు. అల్బెర్ట్ కామూ సూక్తి ఒకటి ఉంది:

Don't walk in front of me, I may not follow.
Don't walk behind me, I may not lead.
Just walk beside me and be my friend.

"స్నేహితుడిగా మాత్రం నా ప్రక్కన ఉండండి; కలసి నడుద్దాం."

ప్రవీణ్ గార్లపాటి said...

చాలా బాగా రాసారు.

కానీ మీరు చెప్పింది కేవలం స్వాభావిక రచనలు చేసేవారికే వర్తిస్తుంది. ఫిక్షన్ రాసే వారికి నిజానికి దగ్గరగా రాయడమంటే ??
వారి ఊహలే వారికి నిజాలు. అంటే వారి ఊహ ఎంతా బాగుంటే వారి రచన అంత బాగున్నట్టా ?

అలాగే మీరన్నట్టు అందరూ ఇలాంటి రచనలు చేయలేరు.
ఎందుకంటే టార్గెటు ఆడియన్సు ని బట్టి మారుతుంది. ఒక వేళ మంచి రచనలు చేసి అమ్ముకుని మార్కెటు చేసుకుందామనుకునే రచయితకి నిజానికి దగ్గరలోనే రాయాలి అనే ధృక్కోణం పనికి రాకపోవచ్చు. అప్పుడు అతడి ఆలోచనంతా ఇతరులని ఎలా మెప్పించాలా అనే దాని మీదే ఉంటుంది.

అలా ఎవరినీ ఉద్దేశించి కాక, ఎవరికోసమూ గాక తన కోసం రచనలు చేసుకునే వారికే ఇది సాధ్యమేమో ?

ఫణి said...

To: ప్రవీణ్ గార్లపాటి,

I am not talking about Sidney Sheldons and John Grishams here.

I am talking about Kafkas, Nabokovs.

Anonymous said...

వ్యక్తిగత వాస్తవికతలటు పెట్టి, "వాస్తవికత" అనే పదానికే వ్యక్తిగత అర్థాలు ఉంటాయన్నది ఈ వ్యాఖ్యల ద్వారా తిరిగి తెలియడం గమ్మత్తుగా ఉంది.

ఫణి said...

To: Anonymous,

మీకు గమ్మత్తుగా అనిపించింది; నేనైతే విస్తుపోయాను.

Giri said...

ఫణిగారు, బావుందండీ.
(నిజానికి మీ వ్యాసం చదివిన తర్వాత వ్యాఖ్య రాయకుండా ఉండలేకపోయానంటే నమ్మండి. కానీ బావుందని చెప్పడం కన్నా ఇంకేమీ కూడా రాయలేకపోతున్నాను నమ్మండి)

సిరి said...

వ్యాసం బాగుంది.

నేనా మధ్యన ఒక కథ చదివాను (పేరు గుర్తు లేదు.ఎక్కడో కూడా గుర్తు రావడం లేదు).

ఆ కథలో ప్రధాన పాత్ర ఉద్యోగం పోతుందొక రోజు. ఆ సాయంత్రమే అతడు డబ్బు దాచుకున్న బేంకు దివాలా తీస్తుంది. దాచుకున్న డబ్బంతా గోవింద! అదేరోజు సాయంత్రమో, మర్నాడో షేర్ మార్కెట్ కుప్ప కూలుతుంది. అక్కడ కూడా అతడి investments గోవిందో గోవిందా!
కానీ, ఎప్పుడైతే ఉద్యోగం పోయిన రోజునే బేంకు దివాలా - షేర్ మార్కెట్ కూలడం - చదివానో, అప్పుడే ఆ కథ గాల్లో తేలుతున్నట్లనిపించింది. మిగిలిన కథ నాకు చదవాలనిపించలేదు!
అప్పట్లో (ఇప్పుడూ) ఆ కథ అవాస్తవంగా అనిపించింది.
'ఆ సంఘటనలన్నీ ఒకరి జీవితంలో ఒకే రోజు జరక్కూడదా? జరగవా?'అంటే జరగొచ్చు అనిపిస్తుంది. కానీ ఎందుకో ఆ కథలో వాటిని నమ్మ బుద్దేయలేదు.
కొసమెరుపు ఏమిటంటే - వ్యాఖ్యల బట్టి, ఆ కథ అప్పుడు చాలా మందికి నచ్చింది :-)

TV Digital said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the TV Digital, I hope you enjoy. The address is http://tv-digital-brasil.blogspot.com. A hug.

bolloju ahmad ali baba said...

బుర్ర చెదర గొట్టేసారు.
థాంక్స్
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/

rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

ప్రసాద్ said...

ఇన్ని రోజులూ మీ బ్లాగు చూడక చాలా కోల్పోయాను.

కొత్త కొత్త దృక్కోణాలు, కొత్త కొత్త ఆలోచనలకి భీజాలు పడుతున్నాయి.

భెషో బేష్.

--ప్రసాద్
http://blog.charasala.com

కత్తి మహేష్ కుమార్ said...

WOW!!!! Its real Education. Thank you.

రవి said...

మీరు మాత్రమే రాయగలరు అనిపించేట్లుగా రాసారు!

కొన్ని ప్రశ్నలు:

రానారె గారి ప్రశ్న కు మీరు (నేను అర్థం చేసుకున్నంత వరకు) improper context అన్నట్టు చెప్పారు.

"నేనిక్కడ వ్యక్తికీ సంఘానికీ మధ్య సంఘర్షణ గురించి మాట్లాడటం లేదు; రచయితకూ విమర్శకుడికీ మధ్య సంఘర్షణ గురించి మాట్లాడుతున్నాను."

నా ఉద్దేశ్యం ప్రకారం ఏదైనా అపురూపమయిన వ్యక్తీకరణకు అంతిమ రూపం (చిట్ట చివరి స్థాయి) మార్మికత. ఉదాహరణకు కబీర్, రవీంద్ర నాథ్ ఠాగూర్ వగైరా...వీళ్ళు రచయితలే. అలాంటి మార్మికులే ఓషో, సోక్రటీస్ వగైరా..(రచనలు చేయకపోయినా)

"రానారె: ఒత్తిళ్లకు యేమాత్రమూ తలవంచకుండా స్వీయవాస్తవితకతను బహిరంగంగా ప్రకటించేవాళ్లకు గాంధీ, గెలీలియో, క్తీస్తు, సోక్రటీసు, ఒషోలాంటివాళ్లకు వచ్చిన యిబ్బందులు వస్తాయని నా అభిప్రాయం."

ప్రకటన అన్నారాయన. కాబట్టి, ఓ వ్యక్తి రాసినా, రాయకపోయినా భావాలను ప్రకటిస్తాడు కాబట్టి, ప్రతీ వ్యక్తీ రచయితే కదా! తన మానసిక సంఘర్షణ పరిధి ని చేదించి, స్వీయ వాస్తవికత ను వెల్లడించ గలగడం ఓ సగటు రచయితకు సాధ్యపడుతుందా? తను స్వీయ వాస్తవికత అనుకున్నది నిజంగా ’స్వీయ’వాస్తవికతేనా?

రానారె గారి వాదన ఏ రకంగా improper context?

సవాలు చేయట్లేదు :-). అర్థం చేసుకోడానికి తంటాలు పడుతున్నాను.:-) అర్థం చేసుకోగలరు.

ఫణీంద్ర said...

"ప్రకటన అన్నారాయన. కాబట్టి, ఓ వ్యక్తి రాసినా, రాయకపోయినా భావాలను ప్రకటిస్తాడు కాబట్టి, ప్రతీ వ్యక్తీ రచయితే కదా!"

రవీ,

మొదటిది, భావాలు ప్రకటించే ప్రతీ వాడు ప్రతీవాడు రచయిత కాడు.

రెండోది, రానారె లాగే మీరూ "స్వీయ వాస్తవికత" అన్న పదాన్ని తప్పుగా అర్థం చేస్తుకున్నారు.

మీ ముఖ్యోద్దేశ్యం సవాలు కాదు, అర్థం చేసుకోవడమే అన్నారు కాబట్టి, తంటాలు పడడానికీ సిద్దమే కాబట్టి, మీకు మరికాస్త కష్టం కలిగిస్తున్నాను.

ఇక్కడ నేను రాసేవేవీ altimate truths కాదు, నా అభిప్రాయాలు మాత్రమే. మీకు నా అభిప్రాయం (లేదా సమాధానం) కావాలంటే ముందు మీ ప్రశ్న నాకు అర్థం అవ్వటం అవసరం. ఈ క్రింది పోస్టులు చదవండి. నేనిక్కడ "రచయిత" అని ఎవరిని అంటున్నానో అర్థమవుతుంది. తరవాత మీ ప్రశ్నను మరింత పాలిష్ చేసి అడగండి. (కంగారేం లేదు, ఓ నాల్రోజుల దాకా మీ నుంచి ప్రశ్నను ఆశించను.):

దృశ్యం Vs. ఆలోచన: http://naagodava.blogspot.com/2007/08/vs.html

To: నాగరాజు పప్పు: http://naagodava.blogspot.com/2008/01/to.html

పుస్తక పఠనం – 2007:http://naagodava.blogspot.com/2007/12/2007.html

నేను సాహిత్యాన్ని: http://naagodava.blogspot.com/2007/09/blog-post_02.html

ఇదేం ఎక్సర్‌సైజు కాదు. అర్థంచేసుకోవాలనుంది అన్నారు కాబట్టే ఇదంతా. నేను బాగానే రాస్తానంటారు కాబట్టి మీకిది మరీ అంత టిడియస్ కార్యక్రమంలాగానూ అనిపించదు. Seee you again.

భైరవభట్ల కామేశ్వర రావు said...

ఈ టపా నాకు కాస్త గందరగోళంగానే ఉంది. మీరిచ్చిన ఉదాహరణబట్టి చూస్తే మీరక్కడ చెప్పినవి వేరువేరు దృక్కోణాలు (perspectives). అవెప్పుడూ చూసేవాళ్ళమీదే ఆధారపడి ఉంటాయి (Perspectives are always Subjective by definition). వాటిని "స్వీయ వాస్తవికత" అనడం ఎందుకో అర్థం కాలేదు.
రచయితలూ విమర్శకులగురించీ చెప్పడం ముఖ్యోద్దేశమైతే, వాళ్ళకి సంబంధించిన ఉదాహరణలిచ్చి ఉంటే మరి కొంత స్పష్టంగా ఉండేదేమో.

ఫణీంద్ర said...

To: Kameshwara Rao,

"Subjective Reality" or "Subjective perspective", whatever the name you give it, that doesn't change a thing. I called it "Subjective Reality" because there is a thing called "Objective Reality" that most of the critics consciously or unconsciously follow as a standard for criticism. I wanted to say that it doesn't exist.

"మీరక్కడ చెప్పినవి వేరువేరు దృక్కోణాలు (perspectives)."

ఈ ప్రపంచంలో దృక్కోణాలే తప్పించి వేరే ఏవన్నా ఉంటాయని మీరనుకుంటున్నారా?

In this post I wanted to say that there is nothing called "reality", and critics who use words like "lack of reality" against a work of art are not proving anything.

Yeah... may be I should have given more examples. But I have given one. I thought it would suffice.

భైరవభట్ల కామేశ్వర రావు said...

Hmm...Let me try to explain what (objective) reality means to me, pardon me if I sound like Plato here.
Infact, your example itself is a very good example of objective reality, not subjective one. Let's take the botanist. Do any two botanists look at the landscape exactly the same way? The answer is obvious, No! But why are we giving it as an example that a botanist would think that way? Because there is a high probability that a typical botanist would think in similar lines. In other words, there is a certain commonality of how different botanists would think about the same landscape. And we are using that to easily communicate what we want to communicate.
Now, let us extend this to all the human beings. There is a certain commonolity in the perception among majority of humans towards objects, for example when people see a tree or think about a tree. That is what I think is called reality. So it is not a union(like what the article suggests) but an intersection of the understanding/perspective of majority of the humans. In addition to this, we also give more importance to the sceintific understanding, though is limited to a minority, and make it as part of reality.

I never came across a serious critisism that undermines a literary work just because it is a fiction or fantasy or away from reality.

ఫణీంద్ర said...

To: భైరవభట్ల కామేశ్వర రావు,

ఆబ్జెక్టివ్ రియాలిటీ అన్న పదాన్ని నిఘంటువులో ఒకసారి తరచి చూడండి. మీరు ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటున్నది ఆ అర్థానికి తగదు. This vague term "Certain commonality" can never be objective reality. ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటున్న దానికే నేనో పేరు ఇచ్చాను: Collective reality (సామూహిక వాస్తవికత), లేదా Mixed reality (మిశ్రమ వాస్తవికత). ఆబ్జెక్టివ్ రియాలిటీ అన్నది ఎప్పుడూ మన దృక్కోణానికి అతీతంగానే ఉంటుంది. You cannot perceive it.

"There is a certain commonality in the perception among majority of humans towards objects, for example when people see a tree or think about a tree. That is what I think is called reality."

This is what I call "Common reality". This can never substitute "Reality".

"I never came across a serious criticism that undermines a literary work just because it is a fiction or fantasy or away from reality."

Common! You must be complete alien to criticism then. I see it everywhere. Juks of it actually.

ఒక వేళ లా ఆర్టికల్ ఈ sense రప్పించలేక పోయిందంటే, మీరొకసారి నేను దీనికి జత చేసిన లింకు చూడండి. అదింకా విశదీకరిస్తుంది.

భైరవభట్ల కామేశ్వర రావు said...

Now, we are getting into 'real' philosophy, a discussion on definition of words :-)
Are you talking about the definition "Objective reality refers to anything that exists as it is, independent of any conscious awareness of it".
Here if the meaning of the word 'independent' is taken as something "outside of" conscious awareness, something that consious awareness does not and cannot know, then I agree with what you say. There is no such thing as "Objective reality". Infact I say it is meaningless, more appropriately useless. So it cannot be a correct/useful definition.
If we take the meaning of 'independent' as something that does not vary with consious awareness then we get to the definition what I have given, something that is constant/common for all(/majority) humans.
I don't undestand why you call "certain commonolity" as vague, because that is the very basis for the success of human communication.
I have already stated the difference between the "Collective" or "Mixed" reality that you talked about and my definition of objective reality. Your definition talks about "union", mine talks about "intersection".

ఫణీంద్ర said...

కామేశ్వరరావు గారూ,

"Certain commonality" అన్న పదాన్ని అస్పష్టం అని ఎందుకంటున్నానంటే ఈ commonality అనేది ఎప్పుడూ certain గా ఉండదు. పైన ఇచ్చిన ఉదాహరణలో పరిసరాల్లోంచి ఒక పిచ్చివాడు నడుస్తూ పోతే మీరన్న "కామనాలిటీ'' ఎలా మారుతుందో నేను చెప్పాను. మీరు "union" కాదు, "intersection" అనడం నాకంతగా అర్థం కాలేదు. మీ నుంచి మరింత వివరణ కావాలి (తెలుగులో అయితే బావుంటుంది).

"I don't understand why you call "certain commonality" as vague, because that is the very basis for the success of human communication. "

మనుషుల మధ్య కమ్యూనికేషన్‌ విజయవంతం అని మీరనడం మీ ఆశావాదాన్ని సూచిస్తోంది. కాని నేను నమ్మను. ఇప్పుడే కాదు మానవ జాతి అంతరించిపోయే వరకూ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య పూర్తి స్థాయి కమ్యూనికేషన్‌ సాధ్యం కాదు. అది కూడా నేను చెప్పిన సబ్జెక్టివ్‌ రియాలిటీ కారణంగానే. (హెరాల్డ్‌ పింటర్‌ని చదవండి; you will know how futile human communication really is.)

ఐన్‌స్టీన్‌ తన సాపేక్ష సిద్ధాంత నిరూపణకు చాలా విపరీతమైన ఉదాహరణలిచ్చాడంటారు (శూన్యంలో అనంతంగా జారిపోయే ఎస్కలేటర్‌ వగైరా). అలాగే నేనూ ఓ విపరీతమైన ఉదాహరణ ఇస్తున్నాను. ఇది నేను పై వ్యాసంలో ఇచ్చిన ఉదాహరణకే ఓ కొనసాగింపనుకోండి:

ఒక అడవిలో ఓ చెట్టుంది. పెద్ద పెద్ద కొమ్మలతో, ఊడలతో చాలా రూరం విస్తరించి ఉంటుంది. ఆ ప్రక్కనే పల్లెటూళ్ళో ఓ పిల్లాడున్నాడు. ఆ పిల్లాడి తల్లి పురుట్లోనే చచ్చిపోయింది. నాన్నకి తాగొచ్చి వీణ్ణి తన్నడం సరదా. నాన్న కల్లు దుకాణంలో కనపడ్డాడంటే పిల్లాడికి అర్థమైపోయేది, ఆ రాత్రి తన వీపు మీద బాజా మోగుతుందని. భయపడి అడవిలోకి పారిపోయేవాడు. ఆ రాత్రి అడవిలో ఆ చెట్టు కొమ్మల్లోనే పడుకొనేవాడు. ఆకుల మధ్య కనిపించే చుక్కల్ని చూస్తూ, గాలికి అవి చేసే వింత సవ్వడి వింటూ రాత్రి గడిపేవాడు. నిశ్చింతగా నిద్రపోయేవాడు. అక్కడ అతనికి చాలా భద్రంగా ఉన్న భావన కలిగేది. అతని మనస్సులో, అతనికే తెలియకుండా, అమ్మ ఉంటే ఆ చెట్టులానే ఉండేదన్న నమ్మకం స్థిరపడిపోయింది. తెల్లారి లేచి వెళ్ళలేక వెళ్ళలేక అడవి వదిలి ఊరికి వెళ్ళేవాడు.

ఆ అడవి పల్లెటూరిని మిగతా ప్రపంచంతో వేరు చేస్తుంది. ఆ అడవి వల్ల పల్లె ప్రజలందరూ డాక్టరు లాంటి అత్యవసర సదుపాయాలక్కూడా చుట్టు తిరిగి చాలా దూరం వెళ్ళాలి. అయినా ఎలాగో నెట్టుకొచ్చేవారు. చాలా సంవత్సరాల తరవాత, అడవి లోంచి రోడ్డు తొలిస్తే పల్లెటూరిని మిగతా ప్రపంచంతో సులభంగా కలపవచ్చని ఒక ఇంజనీరుకి తోచింది. అడవిలో రోడ్డు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నచోట ఒకే ఒక్క అడ్డు ఆ పెద్ద చెట్టు. పల్లెటూరి నుంచి కొంతమంది యువకులను పిలిచాడు చెట్టు కొట్టించడానికి. వాళ్ళల్లో ఆ పిల్లవాడు కూడా ఉన్నాడు. అతనిప్పుడు మీసాలొచ్చిన యువకుడు. తను కొట్టాల్సింది ఈ చెట్టునని తెలిసి కొట్టనన్నాడు. అంతేకాదు, ఎవర్నీ కొట్టానివ్వనన్నాడు. ఇంజనీరుకీ అతనికీ మధ్య వాదన పెరిగింది.

ఇప్పుడు ఏ సక్సెస్‌ఫుల్‌ హ్యూమన్‌ కమ్యూనికేషన్‌ చెట్టుకు సంబంధించినంతవరకూ యువకుడి దృక్కోణాన్ని ఆ ఇంజనీరు వరకూ బదిలీ చేయగలదు; వాళ్ళ రియాలిటీ లు ఏరకంగా intersect కాగలవు? ఆ యువకుడికే తెలియదు ఆ చెట్టును తాను అమ్మ అనుకుంటున్నాడని. (ఇది నేను స్వీయవాస్తవికతకు ఉదాహరణగా చెప్పటంలేదు. కమ్యూనికేషన్‌ ద్వారా మన దృక్కోణాని అవతలి వారికి బదిలీ చేయగలమన్న మీ అనుకోలుకు సమాధానంగా రాస్తున్నాను.) You can never truly communicate with anybody in this world; because subjective reality gets into your way.

చెట్టు అనగానే "మెజారిటీ'' జనం లాగానే, మీ లాగానే, నా క్కూడా ఒక కాండం, కొన్ని శాఖలు, ఆకులు కలిగిన ఒక ఆకారం స్ఫురణకు రావచ్చు. ఇది మీ లాగానే, నాలాగానే "టిపికల్‌''గా చాలామంది మనుషులకు ఒకే "సెర్టెయిన్‌ కామన్‌'' రియాలిటీ కావచ్చు. కాని మా పక్కింటి వాళ్ళ పెరడులో వేపచెట్టొకటుండేది. వేప పళ్ళు బాగా పండిపోయి రాలిపోయాక, మేం వాటి ని నోట్లో పెట్టుకుని లోపల కాస్త కమ్మగా, కాస్త చేదుగా ఉండే గుజ్జును జుర్రుకనే వాళ్ళం. ఇది వేసవి కాలంలో ఇది మాకు ఖర్చులేని చిరుతిండి. మా దాకా రానీయకుండా పైనే కాకులు లాగించేసిన వేప కాయలు పెరడంతా రాలిపడేవి. ఇప్పుడు కూడా వేప చెట్టుని చూస్తే చాలా సార్లు నా కదే గుర్తుకు వస్తుంది. మీరంతా వేప చెట్టుకు చెప్పే లక్షణాలేవీ నాకు వాస్తవం కాదు. నాకు సంబంధించినంతవరకూ వేప చెట్టు వాస్తవికత వేరే. అది మీరెప్పటికి తెలుసుకోలేరు. నేనూ కమ్యూనికేట్‌ చేయలేను.

ఈ "certain commonality" మాత్రమే కాదు. మీరు వాడిన "high probability", "typical", "majority" ఇవన్నీ అస్పష్టమైన పదాలే.

మీరు నా మొదటి "తాత్త్విక మీమాంస'' పోస్టుకి ఇలా వ్యాఖ్యానించారు: "మన ఆలోచనలు, మన విశ్లేషణలూ అన్నీ మేథకి అనుగుణంగానే జరిగినప్పుడు మనం అనుకుంటున్న సత్యాలు "పరమ'' సత్యాలనుకోవడం హాస్యాస్పదమనిపిస్తోంది.''

మీరు ''There is no such thing as 'Objective reality' " అన్నప్పుడూ నాక లాగే అనిపించింది. మన మేథకు అందనంత మాత్రాన అక్కడ వస్తుగతంగా ఒక వాస్తవికత లేదనలేం కదా. ఉదాహరణకి హిమోఫీలియా (వర్ణాంధత్వం) ఉన్న వాడిని ఇంద్రధనుస్సు ఎలా ఉంటుందని అడిగితే నలుపు తెలుపులుగా ఉంటుందని చెప్పొచ్చు. వాడి మేధస్సు ఇంద్రధనుస్సును గురించి అంతే తెలుసుకోగలుగుతుంది. ప్రక్కన ఉన్నవాడికి అది ఏడురంగుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వీడు మొదటి వాడి కన్నా ఇంద్ర ధనుస్సు యొక్క ఆబ్జెక్టివ్‌ రియాలిటీకు ఒక అడుగు దగ్గరగా వెళ్ళినట్టే కదా. (ఇది శారీరక అవకరం ప్రభావం, అని మీరనవచ్చు. ఇలాంటివే మానసిక అవకరాలు, లేదా ప్రభావాలు మన దృక్కోణాన్ని మలుస్తాయి.) నా ఉద్దేశ్యంలో రియాలిటీ ఎప్పుడూ అనంతమైన పొరలు కలిగి ఉంటుంది. ఒక్కో పొరా తొలగించుకుంటూ దానికి దగ్గరగా వెళ్ళగలమే తప్ప కేంద్రకాన్ని (పూర్తి ఆబ్జెక్టివ్‌ రియాలిటీని) ఎప్పుడూ చేరుకోలేం. ఆబ్జెక్టివ్‌ రియాలిటీ మీరన్నట్టు ''useless" కావచ్చు; కాని దాని ఉనికిని మాత్రం కాదనలేం.

ఫణీంద్ర said...

కామేశ్వరరావు గారు,

నేను ముందు వ్యాఖ్యలో రాసిన ఈ వాక్యం వళ్ళు దగ్గరపెట్టుకోకుండా రాసిందిగా మన్నించేయగలరు.

[...] there is a thing called "Objective Reality" that most of the critics consciously or unconsciously follow as a standard for criticism. I wanted to say that it doesn't exist.

ప్రసాద్ said...

ఫణీంద్ర గారూ,
మీ అన్ని వుదాహరణలూ చూశాక మీరేమంటున్నారో నాకర్థమయ్యింది ఇది. మీరంటున్నదిదేనేమొ (ఈ వాదన ప్రకారం పూర్తిగా సాద్యం కాదనుకోండి) లేక దగ్గరగా వచ్చానేమొ చెప్పండి.

నాకు చిన్నప్పుడు రంగులను చూస్తున్నప్పుడు ఈ అనుమానమొచ్చేది.
"నేను ఎరుపు రంగు అని దేన్ని అనుకుంటున్నానో అది ఇతరులకు కూడా నాకు కనిపించినట్లే కనిపిస్తున్నదని నమ్మకమేమిటి?" అని. ఏది ఎరుపు అని నేననుకుంటున్నానో దాన్నే ఇతరులూ ఎరుపు అంటున్నారు అయితే నాకు కనిపిస్తున్నదే వాళ్ళకు కనిపిస్తున్నదని ఎలా నమ్మడం? ఎవరికి వారికి వాళ్ళ వాళ్ళ కంటి కణజాలాల అమరికను బట్టో, మరో వివిధ రసాయనాల మిశ్రమం వల్లో, లేక బుర్రలో మెదడు క్రమం వల్లో (ఏ ఇద్దరిదీ ఒకటిగా వుండదు కదా?) నాకు కనిపిస్తున్నట్లే ఎరుపు ఇతరులకు కనిపించక పోవచ్చు! (కనిపించదనే నా నమ్మకం)

అంటే "సామూహిక వాస్తవికత" కూడా భ్రమే! నాకు ఎరుపుగా కనిపిస్తున్నదీ, పక్కవాడికి నలుపుగా (నాకేది నలుపుగా కనిపిస్తుందో అది), వాడికి నలుపుగా కనిపిస్తున్నది నాకు ఎరుపుగా కనిపిస్తూ వుండొచ్చు. అయితే జీవితాంతం మేము ఒక "object"నే చూపించి "ఇది ఎరుపు" అనే అంగీకారానికి వస్తున్నామే తప్ప అది నిజంగా మాకిద్దరికీ ఒకేలా కనిపిస్తున్నదా అని తెలుసుకోవడం అసంభవం.

"నా ఉద్దేశ్యంలో రియాలిటీ ఎప్పుడూ అనంతమైన పొరలు కలిగి ఉంటుంది. ఒక్కో పొరా తొలగించుకుంటూ దానికి దగ్గరగా వెళ్ళగలమే తప్ప కేంద్రకాన్ని (పూర్తి ఆబ్జెక్టివ్‌ రియాలిటీని) ఎప్పుడూ చేరుకోలేం."

హమ్మయ్య! నా చిన్నప్పటి ఈ రంగుల ప్రశ్నకు ఇప్పటికి సంతృప్తికర సమాధానం దొరికింది.

మీనుంచి ఇలాంటి మరిన్ని వ్యాసాలు రావాలని ఆశిస్తూ...

--ప్రసాద్
http://blog.charasala.com

independent said...

ప్రసాద్ గారూ..ఇంత రాత్రి నేను ఎక్కువ రాయలేను కాని..ప్రపంచమూ,విశ్వమూ,దాంట్లో ఉన్న సకల స్వభావాలూ, విషయాలూ ఒక్క థియరీ లో, ఒక్క ఉదాహరణలో ఇమడవేమోనండి. అలా అయితే సైన్స్ ఇలా ఎవాల్వ్ అవుతూ వస్తూ ఉండేది కాదు. లోకంలో ఇన్ని రకాల ఫిలాసఫీస్ వచ్చి ఉండేవి కాదు. దేనికది ఇండివిడ్యువల్ గా వాలిడ్ గానే ఉండొచ్చేమో, కాని అందులో కొన్ని పరస్పర విరుద్దంగా ఉండే థియరీస్, ఫిలసాఫికల్ వర్ల్డ్ లోనే కాదు, సైంటిఫిక్ వర్ల్డ్ లో కూడా మనం గమనించవొచ్చు.

అంతెందుకు.. మీ ఉదాహరణ తో మీరు "nucleus of objective reality" కి మనం ఎప్పటికీ వెళ్ళలేము అనె థియరీ ప్రపోజ్ చేయొచ్చు ఏమో కాని...
కళ్ళు మూసుకొని నాలుగడుగులు వేస్తే తెలిసి పోతుంది, ఎంత తొందరగా objective reality ని హిట్ చేస్తామనేది. అంతెందుకు.. ఒక పిన్ను తీసుకొని మనల్ని మనం పించ్ చేసుకున్నా తెలుస్తుంది..

Perception is defined as the subjective expression of an objective thing. ఒక ఆబ్జక్ట్ కి సంబంధించి, 6 billion perceptions ఉండొచ్చు..అంత మాత్రాన అంతా subjective world ఏమీ కాదు కదా. There are certain objective things which are tangible. నేను మిమ్మల్ని ఎదురించట్లేదండి. ఒక్క ఉదాహరణలో విశ్వం ఇమడదంటున్నా.

అయితే ఈ విశ్వం అంతా కూడా ఒక computer-simulated-game(or a video-game) లాగా అయ్యిండొచ్చు.. wherein అందులో పాత్రలకి కూడా objective reality అనేది ఉంటుంది, but it is limited by the "design" of the game, కాబట్టి మనకు "అసలు" విషయం ఎప్పటికీ తెలీదు అనే ఒక థియరీ ఉంది....దీంట్లొంచే free-will,determinism అనే ఆర్గ్యుమెంట్స్ పుట్టుకొచ్చాయి. విలియం జేమ్స్ చాలా పుస్తకాల్లో free-will కి supporting cases చాలా చూపిస్తాడు.

ఫణీంద్ర said...

To: independent,

I agree with your first paragraph. For the rest, that's your opinion. Subjective Realilty is not a theory; it's truth. I am not talking about "tangibility" here. Tangible and sensible (wall, pin) reality is not Objective reality. This is the problem with examples. They lead you away.

"Perception is defined as the subjective expression of an objective thing. ఒక ఆబ్జక్ట్ కి సంబంధించి, 6 billion perceptions ఉండొచ్చు..అంత మాత్రాన అంతా subjective world ఏమీ కాదు కదా.

In itself, it is a contradictory statement. I do believe that there are existing 6 billion different worlds simultaeniously.

ఇకపోతే విశ్వం అంతా ఒక ఉదాహరణలో ఇమడదన్నదే నా భావనా.

భైరవభట్ల కామేశ్వర రావు said...

ఫణిగారు,
ఓపికతో మీరు మీ ఆలోచనల్ని వివరించడం నాకు నచ్చింది. తెలుగులోనే నన్ను వివరణ అడిగారే అది మరీ నచ్చింది. నాకూ తెలుగులోనే సౌలభ్యమెక్కువ.
మీరంటున్నది నాకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. మీరు చెపుతున్నదానికీ నేను చెపుతున్నదానికీ వైరుధ్యమేమీ లేదు. ఒకే విషయాన్ని మనం రెండురకాలుగా దర్శిస్తున్నాం. నా అవగాహనని మరింత స్పష్టంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. మనమిక్కడ నాలుగురకాల వాస్తవికతల గురించి మాట్లాడుతున్నాం:
1. Objective Reality - మానవ మేధకి అతీతమైన వస్తుగతమైన వాస్తవికత. దీనికి ఉనికి ఉన్నదా లేదా? ఏమో నాకు తెలీదు. ఎవ్వరికీ తెలీదు. తెలియడం సాధ్యపడదు. మానవ జాతి అంటూ లేకపోతే, భూమి ఉంటుందా? మానవుడు అవతరించకముందు కూడా భూమి ఉందని విజ్ఞానశాస్త్రం చెబుతోంది (నిరూపిస్తోంది!). కానీ విజ్ఞాన శాస్త్రం కూడా మానవ మేధకి పరిమితమే కదా. అంచేత అది చెబుతున్న భూమి ఉనికి మానవమేధకి అతీతం కాదు. అంచేత దాన్నీ Objective reality అనలేం. "మన ఆలోచనలు, మన విశ్లేషణలూ అన్నీ మేథకి అనుగుణంగానే జరిగినప్పుడు మనం అనుకుంటున్న సత్యాలు పరమ సత్యాలనుకోవడం హాస్యాస్పదమనిపిస్తోంది." అని నేనన్నప్పుడు ఇక్కడ "పరమ" సత్యాలంటూ ఏవో ఉంటాయని నా ఉద్దేశం కాదు. అసలలాంటివి ఉన్నాయో లేవో కూడా మనం తెలుసుకోలేమని నా భావం.

2. Subjective Reality, వ్యక్తిగత వాస్తవికత - దీనికి మీరు చాలానే ఉదాహరణలిచ్చారు. అడవిలో వెళ్ళే వాళ్ళు, మీకు తెలిసిన వేపచెట్టు ఇవన్నీ మీరంటున్న Subjective Realityకి ఉదాహరణలే. ఇది ఒకరు మరొకరికి అచ్చంగా, సంపూర్ణంగా communicate చెయ్యడం అసంభవమని నేనూ ఒప్పుకుంటున్నాను.

3. Collective Reality, సామూహిక వాస్తవికత - మొత్తం మానవుల వ్యక్తిగత వాస్తవాలన్నీ కలిపి గిలక్కొడితే వచ్చేది. ఇది కూడా ఏ ఒక్క మానవుడూ తెలుసుకో గలిగే వాస్తవికత కాదు. మరొక్క వ్యక్తి వ్యక్తిగత వాస్తవికతనే తెలుసుకోలేం కదా, ఈ సామూహిక వాస్తవికతని ఎలా తెలుస్కోగలుగుతాం? అంచేత ఇది కూడా మానవ మేధకి అందనిదే.

4. Common Reality, సామాన్య వాస్తవికత - ఇది నేను చెప్పినది. మిరన్నారే - "చెట్టు అనగానే "మెజారిటీ" జనం లాగానే, మీ లాగానే, నా క్కూడా ఒక కాండం, కొన్ని శాఖలు, ఆకులు కలిగిన ఒక ఆకారం స్ఫురణకు రావచ్చు. ఇది మీ లాగానే, నాలాగానే "టిపికల్‌"గా చాలామంది మనుషులకు ఒకే "సెర్టెయిన్‌ కామన్‌" రియాలిటీ కావచ్చు." - సరిగ్గా నేనన్నది అదే. ఇందులో అస్పష్టత ఏముంది? చెట్టంటే ప్రతి మనిషికీ ఉన్న సామాన్య అవగాహన ఉంటూనే, తనదంటూ ఒక ప్రత్యేక అవగాహన కూడా ఉంటుంది. నేను దాన్ని కాదనటం లేదు. నేనంటున్నదల్లా ఈ Common Reality ఉనికిని కూడా గుర్తించాలనీ, మనిషికీ మనిషికీ మధ్య communicationకి అది చాలా అవసరమనీను. మీరిచ్చిన ఉదాహరణ కథలో, మీరా ఒక్క కుర్రాడి గురించి చెప్తున్నారు, నేనా ఇంజినీరు పిలిస్తే వచ్చిన మిగతా కుర్రాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మేధకీ మేధకీ మధ్య ఎంతటి వైవిధ్యం ఉన్నదో అంతటి సామ్యం కూడా ఉంది. ప్రస్తుత మానవుని పరిస్థితికి రెండూ కారణాలే, రెండూ అవసరాలే. ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కాదు. అందుకే, చాలామంది బతికే ఒకే లాటి బతుకుని మూస బతుకులని నిరసించడం సమంజసం కాదని నా ఉద్దేశం.

ఇప్పుడు మీరు మొదట చెప్పిన విమర్శకులగురించి ఆలోచించండి (వాళ్ళు మూర్ఖులు కారన్న నమ్మకంతో). ఆ విమర్శకులు ఏ వాస్తవికత గురించి మాట్లాడుతున్నారు?

ఫణీంద్ర said...

కామేశ్వరరావు గారూ,

బ్రిలియెంట్‌! మీ వివరణలో మొదటి రెండూ (వస్తుగత వాస్తవికత, వ్యక్తిగత వాస్తవికత) నా భావనలే . అయితే మూడోదానికి, నాలుగోదానికి (సామూహిక వాస్తవికత, సామాన్య వాస్తవికత) మధ్యగల వ్యత్యాసాన్ని నేను గమనించకపోవడం వల్లే ఇంత చర్చ నడిచింది. నేను రెండింటినీ కలిపి సామూహిక వాస్తవికత అని వాడాను. అక్కడ పప్పులో కాలేసాను. మీరిప్పుడు వాటిని విడగొట్టి నేను చూడని నాలుగో కోణాన్ని బయటపెట్టారు. అయితే ఈ రెండింటి మధ్యా వ్యత్యాసం చూపవలసిన అవసరం నా వ్యాసానికి రాలేదు. నాకు అవసరమైందల్లా వ్యక్తిగత వాస్తవికత. నిజానికి మీరీ వివరణ ఇచ్చాక నా వ్యాసానికి మరింత పట్టు చేకూరినట్టయింది.

(అయితే దానికి "సామాన్య వాస్తవికత'' అనే పేరు కన్నా "ఉమ్మడి వాస్తవికత'' అనే పేరు బాగుంటుందేమో- దుష్ట సమాసం కాకపోతే.)

మీరు చివర్న అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇది: ఆ విమర్శకులు (అంటే ఆ వ్యాసం రాసేటపుడు నా దృష్టిలో ఉన్న విమర్శకులు) మీరన్న "సామాన్య వాస్తవికత'' గురించి మాట్లాడుతున్నారు.

నేను నా వ్యాసంలో చూపించదలచింది వ్యక్తిగత వాస్తవికతకు, సామాన్య (ఉమ్మడి) వాస్తవికతకు మధ్య ఘర్షణ. నిజమైన కళ సబ్జెక్టివ్‌ రియాలిటీ ఆధారంగా పుడుతుంది అని నేను చెప్పదలచుకున్నాను. కళ యొక్క ఆదర్శం కమ్యూనికేషన్‌ కాదు; ప్రపంచాన్ని కళాకారుడు ఎలా చూస్తాడో ఆ దృక్కోణాన్ని, అతనికే ప్రత్యేకమైన ఆ వాస్తవికతను ఆవిష్కరించడం- అని నా అభిప్రాయం.

చెట్టు అనగానే మీలాగే నాలాగే అందరికీ కాండం, శాఖలు, వేళ్ళు ఇలా కొంత సామాన్య వాస్తవికత ఉంటుంది, ఒక ఉమ్మడి దృక్కోణం ఉంటుంది. అలాగే రచన అనగానే విమర్శకులతో సహా చాలామందికి దాని రూపం (స్ట్రక్చర్‌), సారం (ఎస్సెన్స్‌) ఎలా ఉండాలో కొంత ఉమ్మడి దృక్కోణం ఉంటుంది. అంతేకాదు, కొన్ని ప్రి కన్సీవ్డ్‌ నోషన్స్‌ కూడా ఉంటాయి. చాలా శాతం రచనలు కూడా ఈ ఉమ్మడి వాస్తవికతను చూపించే ప్రయత్నమే చేస్తాయి. అంటే ప్రపంచాన్ని అందరూ ఏ దృక్కోణం లోంచి చూస్తారో ఆ దృక్కోణానికి అనుగుణంగా ఒదిగిపోయేందుకు తాపత్రయపడతాయి. చాలా పాపులర్‌ చెత్త ఈ విభాగానికే చెందుతుంది. అందుకే ఇక్కడ ఒకరికి సమాధానం ఇస్తూ 'నేను మాట్లాడేది సిడ్నీ షెల్డన్‌ గురించి, జాన్‌ గ్రిషమ్‌ గురించీ కాదని' అన్నాను. నిజమైన కళాకారుడు ఈ ఉమ్మడి వాస్తవికతపై ఆధారపడి రచనలు చేయడు. తనలోకి చూసుకుంటాడు. తన చుట్టూ వున్న ప్రపంచాన్ని తన చైతన్యం ఎలా లోనికి స్వీకరిస్తుందో అర్థం చేసుకుంటాడు. తన చైతన్య ప్రవాహంపై ఈ ప్రపంచపు ప్రతిఫలనాల ఖచ్చితమైన నమోదు అతని రచనల్లో కనిపిస్తుంది. అదే నేను నా వ్యాసంలో చెప్పింది, లేదా చెప్పదలచుకొంది.

ఇక ఇలాంటి విమర్శ లేదని మీరనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరెప్పుడూ 'మార్కిస్టు విమర్శ', 'ఫ్రాయిడియన్‌ విమర్శ' లాంటి పేర్లు వినలేదని నేననుకోను. శ్రీపాద వారిని 'ఫ్యూడలిస్టు' రచయిత అన్న విమర్శకులు నాకు తెలుసు. తిలక్‌ 'వ్యక్తి శ్రేయో వాద' రచయిత అన్న విమర్శకులు నాకు తెలుసు. కాఫ్కాను ఫ్రాయిడియన్‌ విమర్శలో బంధించాలని చూసిన మూర్ఖ విమర్శకులూ నాకు తెలుసు. అయితే వాళ్ళెవరినీ టార్గెట్‌ చేయాలని నేనీ వ్యాసం రాయలేదు; వాళ్ళని నెగ్లెట్‌ చేయగల సత్తా నాకు నేను కల్పించుకోవడానికి రాసాను. ఈ వ్యాసం ఎక్కుపెట్టిన బాణం కాదు, రక్షణకై నిర్దేశించిన కవచం. అందుకే నేను ఎవ్వరినీ ఉదహరించలేదు. పైనే చెప్పాను- నేనిక్కడెవ్వరికీ జ్ఞాన ప్రదానం చేయటం లేదు, నాకు నేను స్పష్టత తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ స్పష్టత దిశగా నా చేత ఓ ముందడుగు వేయించినందుకు కృతజ్ఞతలు.

Anonymous said...

కవచం కూడా కాదు, మీకు మీరు ధైర్యం చెప్పుకోడానికి రాశారు.

అయితే లేబుళ్ళు తగిలించినంత మాత్రాన తిలక్‌నీ, కాఫ్కానీ ఎవరూ చదవకుండా పోలేదు. ఈ విమర్శలన్నీ ఒక వ్యక్తిగత వాస్తవికతని ఉమ్మడి వాస్తవికతలోకి అనువదించుకునే ప్రయత్నంలో భాగమని ఎందుకు అనుకోకూడదు? లేక అది ఆ విమర్శకుడి వ్యక్తిగత వాస్తవం ఎందుకు కాదు?

internal consistency ఉండి ఆకట్టుకునేలా చెప్పగలిగితే అది ఏ వ్యక్తిగత వాస్తవికత అయినా పాఠకుడిని చేరుతుంది. నాలుగు కాలాలూ మన్నుతుంది.

అన్నట్టు వస్తుగత వాస్తవికతకు పొరలూ, దగ్గరగా రావటాలూ ఉండవు. వ్యక్తిగత వాస్తవికతలన్నీ దానికి భిన్న కోణాలు, అంతే!

కొంచెం ఆనందం కోసం ఇది చూడండి -
http://www.nytimes.com/2008/08/18/world/18kafka.html?ref=todayspaper

భైరవభట్ల కామేశ్వర రావు said...

హమ్మయ్యా! ఇప్పటికి నేను చెప్పాలనుకున్నది సరిగా చెప్పగలిగానన్న మాట! ఈరోజు హాయిగా నిద్రపడుతుంది! మన ఆలోచనలని మరొకరు అర్థం చేసుకున్నారని తెలిస్తే కలిగే ఆనందం బృహత్తరమైనది.
మీరీ వ్యాఖ్యలో చెప్పిన దాంతో నేను నూటికి నూరుపాళ్ళూ ఏకీభవిస్తున్నాను. మీరన్న విమర్శలన్నీ నాకు తెలీవుకానీ కొన్ని చదివాను. అందులో చాలావాటిని నేను "సీరియస్" విమర్శలుగా పరిగణించను :-)
విమర్శకుడికి రచయిత వ్యక్తిగత వాస్తవికతపై అవగాహన ఉండాలి. దాన్నే మనవాళ్ళు "సహృదయత" అన్నారు. ఆ వాస్తవికతని రచయిత ఎలా ఆవిష్కరించగలిగాడో అంచనా వేస్తూ, దాన్ని పాఠకుల దగ్గరకి తీసుకువెళ్ళే దిశగా సాగేదే సద్విమర్శ.
అయితే ఇందులో రచయితకి కూడా బాధ్యత ఉంది. తన వ్యక్తిగత వాస్తవికతకి సంబంధించిన ఉమ్మడివాస్తవికత (ఈ పదమే బావుంది) కొంత ఉంటుంది. దానిపై పూర్తి అవగాహన ఆ రచయితకి ఉండాలి. దానికీ తన వ్యక్తిగత వాస్తవికతకీ మధ్యనున్న సంబంధాన్నీ తేడానీ తెలుసుకొని, దాన్ని అతి సున్నితంగా తన రచనలో ఆవిష్కరించాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా కొందరికైనా అది చేరుతుంది. ఒక పాఠకుడు, రచయిత వ్యక్తిగత వాస్తవికతని తనదిగా అనుభవించగలిగే స్థితినే రసానుభూతి అంటారనుకుంటాను.

teresa said...

interesting discussion!
Hemophilia and color blindness are not the same.

independent said...

ఫణీంద్రా...కామేశ్వరరావు గారి వివరణ చూసాకా అంతా ఒకే విషయం మాట్లాడుతున్నామనిపిస్తొంది. ఇప్పటికే దీని మీద చాలా చర్చ జరిగినట్లుంది. దీన్నింకా పీకక, క్లుప్తంగా నాకనిపించింది చెపుతా.

1. - "ప్రపంచాన్ని కళాకారుడు ఎలా చూస్తాడో ఆ దృక్కోణాన్ని, అతనికే ప్రత్యేకమైన ఆ వాస్తవికతను ఆవిష్కరించడం- అని నా అభిప్రాయం."
ఆ విషయం మీ వ్యాసం మొదట్లో చదివినప్పుడే మీరు చెప్పదలచుకున్నది నాకర్ధమయ్యింది. I agreed with it..అందుకే ఏ వ్యాఖ్యా రాయలేదు.

2. ఇకపోతే విశ్వం అంతా ఒక ఉదాహరణలో ఇమడదని నేను అభిప్రాయపడ్డాను. మీ భావనా అదే అన్నారు.. బహుశా చాలా మంది కూడా ఇదే అభిప్రాయం తో ఏకీభవిస్తారనుకుంటా.

3. "ఇక్కడ "పరమ" సత్యాలంటూ ఏవో ఉంటాయని నా ఉద్దేశం కాదు. అసలలాంటివి ఉన్నాయో లేవో కూడా మనం తెలుసుకోలేమని నా భావం". అని కామేశ్వర్రావు గారన్నారు.

నేను మీ బ్లాగులో వదిలిన మొట్టమొదటి వ్యాఖ్యలో ఇదే భావనని ఇలా రాసా. "ఈ మనసు/హ్యుమన్ బ్రైన్ కావల ఉండేవి(ఒకవేళ ఉంటే) ఎలాగూ తెలీవు" అని .

కాబట్టి ఇక్కడ నేనూ కారా( ఈ పిలుపు అభ్యంతరమయితే చెప్పండి రావు గారు) గారితో, మీతోనే ఉన్నాను. ఈ విశ్వాన్ని,మనమెప్పుడూ లోపలనుంచి తప్ప బయట నుంచి చూడలేము కాబట్టి "అసలు" సంగతేంటి(అదుంటే),అనేది మనకు ఎప్పటికీ భోధపడదు. ఈ విశ్వమంతా, విశ్వానికావలా ఒకే ఒక రియాలిటీ ఉంటుందనుకొని, దాన్ని objective reality అని పిలిచి, అది మనకు ఎప్పటికీ అందదూ అంటే, దాంట్లో విభేదించేదెమీ లేదు.

లోపలనుంచి చూసే వాటి మీద కూడా, "Observer" effect "Observed" మీద ఉండే ఉదాహరణలు కోకొల్లలు. ఒక పాత ఉదా: ఒక ఆంత్రోపాలజిస్టు ఒక ట్రైబల్ తెగని స్టడీ చేయడానికి వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు, తనకి ఒరిజినల్ అబ్జర్వేషన్స్ ఎప్పుడూ రావు. ఇతని ప్రజెన్స్ అనేది వాళ్ళ బిహేవియర్ ని ప్రభావితం చేసి, తద్వారా ప్రభావితం అయిన రీడింగ్స్ మాత్రమే లభిస్తాయి కాబట్టి. వాళ్ళ మధ్యలో లేకుండా తీసుకోవచ్చు కదా అన్న వాదన సబబు కాదు ఎందుకంటే, మనం విశ్వం మధ్యలోనే ఉన్నాం/ఎప్పటికీ ఉంటాం కాబట్టి.

ఈ కోణం లోంచి చూసినా కూడా , మనం observe చేసేది, observer effect లేకుండా చూడలేం కాబట్టి, పూర్తి "సత్యం(?)" ఎప్పటికీ తెలీదు అనేదాన్ని కూడా అంత తేలిగ్గా కొట్టివేయలేం.

4. "I do believe that there are existing 6 billion different worlds simultaeniously. "అని మీరన్నారు. Yes, అందులో ఏ అనుమానమూ లేదు నాకు.

5. "Subjective Realilty is not a theory; it's truth"...Yes, it's an individual truth.

6. అయితే నేను ఇచ్చిన ఉదాహరణలు(wall, pin) కారా గారి వివరణ ప్రకారం common reality లోకి వెళ్తాయి. That's fine with me, I have no qualms about it. ఎందుకంటే ఒక హాట్ స్టవ్ మీద చేయిపెట్టినప్పుడు, కాల్తుంది అనేది ఒక tangible సత్యం. అది ఒక objective సత్యం కాదు అంటే...well..మనం objective అనే దాని పరిధిని నిర్వచించే దాన్ని బట్టి ఉంటుంది. for ex: ఈ విశ్వంలోనే ఉండే ఇంకో గ్రహాంతర వాసి వచ్చి తన చేయి(?) పెడితే తనకి కాలకపోవచ్చు. అది అప్పుడు తనకి సత్యమే కాదు.

మీరు కారా గారికి రిప్లై చేస్తూ వాడిన "మీరు ''There is no such thing as 'Objective reality' " అన్నప్పుడూ నాక లాగే అనిపించింది. మన మేథకు అందనంత మాత్రాన అక్కడ వస్తుగతంగా ఒక వాస్తవికత లేదనలేం కదా." అన్న వ్యాక్యంలో ఉన్న భావాన్నే కదా నేను వ్యక్తం చేసింది?

అయితే కారా గారి వివరణ చూసింతర్వాత, ఇది నిర్వచనాల్తో ముడిపడి ఉన్న విషయం అన్నది అవగతమయింది. అందుకే నా ముందు వ్యాఖ్యలో నేను మాట్లాడే objective reality ఒక లిమిటెడ్ సెన్స్ లో వాడుతున్నట్లుగా అర్ధమొచ్చేలా క్రింద ఒక థియరీ పేర్కొన్నా(simulated-game/video game). అయితే నేను రాసింది నా భావాన్ని అంత బాగా కమ్యూనికేట్ చేయలేదు.

Jim Carrey ది "The Truman Show" సినిమా చూసారా?

7. చివరగా ఒక్క అభిప్రాయం ఫణీంద్రా. మీ తాత్వికమీమాంస రెండవ భాగం గురించి. ఇది ఇప్పుడు చెప్పాల్సిన అవసరమేమీ లేదు, ఎందుకంటే మీరు ఇంతకుముందే రిప్లై ఇచ్చి ఉన్నారు రాకేరా, వికటకవి గారికి. కాని వాళ్ళు చెప్పలేనిదేదో చెప్పాలనిపించింది.

నేనది పబ్లిష్ అవ్వగానే చదివా హాట్ హాట్ గా. నేను కూడా కొంచం డిసప్పాయింట్ అయ్యా. అయితే మీరు ఇచ్చిన రిప్లై చూసింతర్వాత మీరు చెప్పిన vantage point definition నుంచి మీరు చెప్పిందంతా సబబే. అయితే ఇది మీ మొదటి భాగం చదివి దాంతో వచ్చిన expectations వల్ల కలిగిన disappointment అని నాకిప్పుడు అనిపిస్తోంది. మీరు రెండో భాగంలో vantage point నుంచి ఇదంతా "ఏంటో" చెప్పారు. ఈ "ఏంటో" అనేది మనందరికీ అప్పటికీ తెలిసే ఉండడం వల్ల, మీరు ఇదంతా "ఏంటి" అనే డైరక్షన్ లో కాకుండా, "ఎందుకు" అనే డైరక్షన్ లో వెళ్తారని అని అనుకుని ఉంటారేమో అందరూ. at least నేనలా అనుకున్నా.

యితే ఈ "ఏంటి" అనేది చూసినప్పుడు మీకు "అంతస్సూత్రం పట్టుబడిన క్షణమేదో నా మీదగా పాకిపోయినట్టనిపించింది" అన్నారు కదా. అది ఎవ్వరికీ ఎక్కినట్లు లేదు..కాని మీరే ఎక్కడో అన్నారు కదా..కొన్ని భావాల్ని ఎప్పటికీ కమ్యూనికేట్ చేయలేం అని. this is perfect example అనుకుంటా..కొన్నింటిని కమ్యూనికేట్ చేయటం impossible అనడానికి.

ఈ "ఎందుకు" అనేది అంత ఈజీ గా అర్ధం అయిపోతే/అర్ధం అవ్వాలని ఆశ పట్టం అవివేకమే అవుతుందీ.. కానీ ఏదో ఆశ అనుకుంటా మనుషులకి..
అస్సలు కారణం లేదూ పాడూ లేదూ..ఇదంతా ఒక meaningless existence అనేది నాక్కూడా అనిపిస్తుంది. కాని సైన్స్ ఇంకా విశ్వాన్ని శోధించుతూనే ఉంది కదా.. వాళ్ళేదో conclude చేసే దాకా, or at least దగ్గరికి వెళ్ళేదాకా వెయిట్ చేస్తా. ofcourse అప్పటిదాకా మనమెవ్వరమూ ఉండం లెండి.

క్లుప్తంగా అన్నట్లున్నాను కదా. :-) Sorry.

ప్రసాద్ said...

మీ మరియు కామేశ్వరరావు గారి వాఖ్యలు నన్ను మళ్ళీ మొదటికి చేర్చాయి. "వ్యక్తిగత వాస్తివికతే" నిజమయితే "సామాన్య వాస్తవికత" ఎలా సాధ్యమో అర్థమయ్యి చావడం లేదు. సామూహిక వాస్తవికతను రావు గారు చెప్పినట్లు "వ్యక్తిగత వాస్తవికతల సమూహం(union)" అనుకోవచ్చు. కానీ ఈ వ్యక్తిగత వాస్తవికతల మద్య సామాన్యత (commonality) వుందో లేదో చెప్పలేనప్పుడు, సామాన్య వాస్తవికత వుందని ఎలా అనుకోవడం???

(ఇది నా ఆలోచనా పరంపర మాత్రమే, మీ వివరణలు ఆశించడం లేదు, ఇస్తే మంచిదే.)

ఇండిపెండెంట్ మరియు రావు గార్లు ఈ వ్యాసానికి మంచి చర్చను జోడించారు. కృతజ్ఞతలు.

--ప్రసాద్
http://blog.charasala.com

ఫణీంద్ర said...

To: Anonymous,

అవును, "ధైర్యం" సరైన పదం.

"లేబుళ్ళు తగిలించినంత మాత్రాన" ఎవరూ వారిని చదవకుండా పోరని నాకు తెలుసు. కాని ఆ విమర్శల ప్రభావం రచయితల మీద చాలా ఉంటుంది.

ఈ విమర్శలన్నీ ఒక వ్యక్తిగత వాస్తవికతని ఉమ్మడి వాస్తవికతలోకి అనువదించుకునే ప్రయత్నంలో భాగమని ఎందుకు అనుకోకూడదు?

ఇదే చాలా రచనల విలువ తగ్గిస్తుందని నా అభిప్రాయం.

లేక అది ఆ విమర్శకుడి వ్యక్తిగత వాస్తవం ఎందుకు కాదు??

అవ్వొచ్చు. అవ్వొచ్చని నేను నా వ్యాసంలో చెప్పాను కూడా. ఒకసారి చదవండి.

internal consistency ఉండి ఆకట్టుకునేలా చెప్పగలిగితే అది ఏ వ్యక్తిగత వాస్తవికత అయినా పాఠకుడిని చేరుతుంది. నాలుగు కాలాలూ మన్నుతుంది.

అవును అదే నా అభిప్రాయమూ.

అన్నట్టు వస్తుగత వాస్తవికతకు పొరలూ, దగ్గరగా రావటాలూ ఉండవు. వ్యక్తిగత వాస్తవికతలన్నీ దానికి భిన్న కోణాలు, అంతే!

It's not even an opinion; you just blundered there.

మీరిచ్చిన లింకు ఇంకా చదవలేదు. చదివి రాసేదేమైనా ఉంటే రాస్తాను.

*** *** ***

మిగతా వాళ్ళలో సమాధానాలు ఇవ్వవలసిన వారికి తీరిగ్గా సమాధానం ఇస్తాను.

ఫణీంద్ర said...
This post has been removed by the author.
ఫణీంద్ర said...

To: teresa,

Hemophilia and color blindness are not the same.

Sorry. I was wrong there. I actually meant color blindness. Thank you.