Tuesday, October 21, 2008

తీక్షణమైన క్షణాలు

నువ్విప్పుడేం చేస్తున్నావ్‌. అసలున్నావా? ఈ క్షణంలో నా మనసులో ఉన్నంత స్పష్టంగానే నువ్వీ భూమ్మీద కూడా ఉన్నావా? నాకీ సమయం ఎలా గడుస్తోందో నీకూ అలాగే గడుస్తుందా? అంటే నా ఉద్దేశ్యం, నువ్వు కూడా నాలాగే గంటకి అరవై నిమిషాలూ, నిమిషానికి అరవై సెకన్లూ గడుపుతున్నావా? ఈ నిముషాలూ, సెకన్లూ నీకు ఎలా గడుస్తున్నాయో తెలియదు గానీ, నాకు మాత్రం చాలా సాంద్రతతో గడుస్తున్నాయి. చిత్రం కదూ! నిన్ను, నన్ను, సృష్టి మొత్తాన్నీ తనలోకి ఇముడ్చుకుని ఒకే కాలం ప్రవహిస్తోంది. కాని ఆ ప్రవాహ గాఢత నీ దగ్గర ఒకలా ఉంది, నా దగ్గర ఒకలా ఉంది. అవును, నమ్మకంగా చెప్పగలను, నువ్విప్పుడేం చేస్తున్నా సరే, నా క్షణాల తీవ్రతతో పోలిస్తే నీ క్షణాలు ఉత్త డొల్లలు. బహుశా ఒకరకంగా అందుకు నేనే సిగ్గుపడాలి. ఎందుకంటే, నీ ఆలోచన నా క్షణాలకు అద్దిన గాఢత, నా ఆలోచన నీ క్షణాలకు అందివ్వలేకపోతోంది కదా. అసలిదంతా కలలాఉంది. నువ్వు నేనెప్పుడో కన్న కలేమో అనిపిస్తుంది. కలలు కూడా అంతేనట. మనం ఒక రాత్రంతా నిర్విరామంగా కన్నట్టనిపించే కల నిడివి నిజానికి గంటో, రెండు గంటలో మాత్రమే ఉంటుందట. అది మనపై కలిగించే అనుభూతి సాంద్రతతో పోలిస్తే ఈ నిడివి చాలా తక్కువ అనిపిస్తుంది కదూ. కలల్లోవన్నీ తీక్షణమైన క్షణాలు, ఇప్పుడు నేను జీవిస్తున్న క్షణాల్లాంటి క్షణాలు. ఒక వేళ ఇది కలే అయితే, నేను ఇప్పట్లో మేలుకోవాలనుకోవటం లేదు. ఎప్పటికీ మేలుకోవాలనుకోవటం లేదు. ఇలాగే ఒక కల నుండి మరొక కలకు ప్రయాణిస్తూ ఎప్పుడో చచ్చిపోబోయే ముందు వాస్తవంలోకి మేలుకొంటాను. అప్పటివకూ నన్నెవరూ నిద్ర లేపొద్దు.

No comments: