Monday, August 18, 2008

రాయల ప్రపంచ అట్లాసు ఆధారంగా తాత్త్విక మీమాంస (పార్టు -2)


నా ముందు పోస్టులో ఈ ప్రపంచంలో ప్రతీ విషయాన్ని జస్టిఫై చేయగల ఒకే అంతస్సూత్రం గురించి, ఈ ప్రపంచాన్ని స్పష్టంగా చూపించగల ఒకే ఒక్క vantage point గురించీ ఏదో రాసేను. మొన్నో రోజు అట్లాసు తిరగేస్తుంటే అలాంటి అంతస్సూత్రం పట్టుబడిన క్షణమేదో నా మీదగా పాకిపోయినట్టనిపించింది. క్షణకాలం పాటు ఆ vantage point దగ్గర నిలబడ్డ అనుభూతి కలిగింది. క్షణం పాటే; మళ్లీ అంతా మామూలే. దీన్నే జాయిస్‌ epiphanic moment అంటాడేమో. విషయానికొస్తే, ఆ అట్లాసులో సౌరమండలాన్ని గురించి ఒక పేజీ ఉంది. అందులో సూర్యుడు, నవగ్రహాల సాపేక్ష పరిమాణాల్ని అర్థమయ్యేలా చూపించడానికి వరుసగా (ప్రక్క ప్రక్కన) వాటి బొమ్మలు వేసారు. అందులో సూర్యుడి ప్రక్కన భూమి ఎలా ఉందంటే, ఒక ఫుట్‌ బాల్‌ ప్రక్కన సగ్గుబియ్యం గింజ పెట్టినట్టు ఉంది. ఆ ప్రక్కనే మన పాలపుంత బొమ్మ వేశారు. ఈ పాలపుంతలో ఉజ్జాయింపుగా పదివేల కోట్ల నక్షత్రాలు ఉంటాయట. వీటిలో సూర్యుడెక్కడ ఉన్నాడో చిన్న బాణం గుర్తుతో సూచించారు. ఆ బాణం గుర్తు సూచించిన చోట కంట్లో నలుసంత కనపడీ కనపడనట్టున్నాడు సూర్యుడు. మన పాలపుంత ఆసియా ఖండమంతా పెద్దది అనుకుంటే, అందులో ఓ చోట గుండు సూది గుచ్చినంత స్థలం మన సౌర కుటుంబం ఆక్రమిస్తుందట. ఈ పాలపుంత లాంటి గెలాక్సీలు ప్రస్తుతం మనకి తెలిసి (అంటే మనకు టెలిస్కోపులో కనపడేవి) మరో పది కోట్లున్నాయి.


ఆ పేజీలోనే క్రింద సూర్యుడి జీవిత కాలం గురించి చిన్న పేరా రాసారు. సూర్యుడు ఇప్పటికే నడి వయస్సు కొచ్చేసిన నక్షత్రమట. వయస్సు పెరిగే కొద్దీ దీని ఆకృతి మారుతుందట. ఒక ఐదు బిలియన్‌ సంవత్సరాల తర్వాత, సూర్యుని కేంద్రకంలో ఉన్న హైడ్రోజన్‌ అంతా హీలియంగా మారిపోయాక, సూర్యుడు ఉబ్బడం మొదలుపెడతాడట. ఎంతగానంటే, ఇప్పుడున్న పరిమాణానికి మరో నూటయాభై రెట్లు పెరిగిపోతాడట. ఒక్కసారి ఊహించండి, మనం రోజూ చూసే ఆకాశంలో రోజూ చూసే సూర్యుడు నూటయాభై రెట్లు పెరిగిపోతే...! కాని ఇది ఒక ఊహే. ఎందుకంటే అది చూడటానికి మనం ఉండం కదా. మాడి మసై పోతాం. సరిగ్గా ఈ పేరా చదువుతున్నపుడే ఇందాక నేనన్న ఎపిఫానిక్‌ మూమెంట్‌ లాంటిది అనుభూతికొచ్చింది.


గత పోస్టులో నేను నన్నొక మెగలోమానియాక్‌గా అభివర్ణించుకున్నాను. నిజానికి నేనే కాదు, మనుషులంతా మెగలోమానియాక్‌లే. విశ్వంలో తమ ఉనికి గురించి అతిగా ప్రాముఖ్యతనిచ్చుకోవడం వల్లే ఇన్ని సందేహాలు, సంశయాలు. కాని మనకంత సీన్‌ లేదు. ఈ సూర్యుణ్ణే తీసుకోండి. ఈ మండే పదార్థం లేకపోతే మనం లేము. భూమిపై మానవ జాతి ఆవిర్భావానికి, మనుగడకు ఇది ఆయువుపట్టు. కాని అనంత విశ్వపు కాలగమనంతో పోల్చి చూస్తే ఈ సూర్యుని జీవితకాలం అనేది చాలా స్వల్ప కాలికమైన విషయం; సూర్యుని పుట్టక గిట్టుక అనేవి పెద్ద లెక్కలోకి రాదు.
A mere fleeting phenomena. దీనిలో ఉన్న హైడ్రోజన్‌ అణువులన్నీ పూర్తిగా హీలియంగా మారిపోతే సరి, దీని పనైపోతుంది. దాంతో పాటే మన పనైపోతుంది. ఒక్కసారి ఈ కోణంలోంచి ఆలోచిస్తే మానవ జన్మ ఎంత చిన్న విషయమో, ఎంత యాదృచ్ఛికమో అర్థమౌతుంది.


ఉదాహరణకి, ఇంట్లో బ్రెడ్‌ని వాడకుండా మూల వదిలేసేమనుకోండి; కొంతకాలానికి దానిమీద బాక్టీరియా, శిలీంధ్రాలు పుడతాయి. ఆ బ్రెడ్డు మీద ఆధారపడి బతుకుతుంటాయి. మనం ఆ బ్రెడ్‌ పాకెట్‌ని బయటపడేస్తే, దాంతో ఆ బ్రెడ్‌ మీద శిలీంధ్రాలూ అంతరించిపోతాయి. బ్రెడ్‌ మీద బతకడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక శిలీంధ్రాలు పుట్టాయి. అలాగే భూమ్మీద బతకడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక మనం మనుషులం పుట్టాం. ఒక మనిషికి సంబంధించినంత వరకూ తన నిలవ రొట్టె, దాని మీద బతికే శిలీంధ్రాల మనుగడ ఎంత అల్పమైన విషయమో, అలాగే ఈ విశాల విశ్వానికి సంబంధించినంత వరకూ ఈ భూమి, ఈ భూమ్మీద బతికే మనుషుల మనుగడ అంతే అల్ప విషయం. హఠాత్తుగా మన గెలాక్సీలో ఏ మూలనో సంభవించిన పెద్ద పేలుడు రేపు సౌర కుటుంబాన్ని తాకి భూమి అంతా చిన్నాభిన్నమైపోయినా మన ల్ని పట్టించుకునే నాథుడెవడూ లేడు. Because, this universe— this mad, irrational universe— don't give a shit about you and your tiny little existence.


అయితే రొట్టె మీద శిలీంధ్రాలకి మనకీ తేడా ఏంటంటే, అవి తమ జన్మ మూలాల గురించి, తమ ఉనికి పరమార్థం గురించీ ఆలోచించవు. మనిషికి మెదడు ఉంది కనుక ఆలోచిస్తాడు. ఈ ఆలోచనే మనిషి మెగలోమానియాకు అసలు కారణం. ఈ మెదడే సృష్టిలో మనిషి అస్తిత్వం కేవలం యాదృచ్ఛికమన్న నిజాన్ని మన చేత అంగీకరించకుండా చేస్తుంది. మనకి మనం ఆపాదించుకున్న ప్రాముఖ్యతే మన అసలు విలువేంటో తెలీకుండా మరుగు పరుస్తుంది. సృష్టి కాలగమనంతో సాపేక్షంగా పోల్చి చూస్తే భూమ్మీద మానవజాతి ఆవిర్భవించడానికి, అంతరించడానికీ మధ్య ఉన్న కాలం, మనకి ఒక సంవత్సరంలో అరసెకను ఎంత చిన్నదో అంత కన్నా చిన్నది. మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. మన పాలపుంత తన చుట్టూ తాను తిరగడానికి 22 మిలియన్‌ సంవత్సరాలు పడుతుందట. భూమ్మీద మనిషి ఆవిర్భవించి మాత్రం 6 మిలియన్‌ సంవత్సరాలే అవుతుంది. అంటే పాలపుంత తన చుట్టూ తాను ఒక రౌండ్‌ కొట్టే సరికే మానవ జాతి పుట్టడం అంతరించిపోవడం కూడా పూర్తయిపోతాయన్నమాట.


ఇందాక నేను చెప్పిన vantage point ఇదే. ఒక్కసారి ఇక్కడకొచ్చి నిలబడండి, చాలా వరకూ అర్థమైపోతుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తత్త్వ శాస్త్ర పుస్తకాల్లో మునిగి తేలాల్సిన అవసరం లేదనుకుంటా. రాయల ప్రపంచ అట్లాసు తిరగేస్తే చాలు; ప్రపంచం అర్థమైపోతుందని చెప్పను గానీ, ప్రపంచం అర్థం వెలకాల్సినంత గొప్పదేం కాదని అర్థమవుతుంది; అసలు దీనికంతా ఓ అర్థమూ పాడూ లేకపోయినా అంత బాధపడాల్సిందేమీ లేదని ఓదారుస్తుంది.


మన అదృష్టం ఏంటంటే, ఈ తాత్కాలిక (transient) ప్రపంచంలో మన ఉనికి అర్థ రహితం అన్న స్పృహ (awareness) మనకి నిత్యం ఉండదు. కొన్ని కొన్ని ఆకస్మిక క్షణాల్లోనే మనకి ఆ స్పృహ కలుగుతుంది. మిగతా సమయమంతా ఒకరకమైన మరుపుతో జీవితాన్ని గడిపేస్తాం. ఈ మరుపు నిజానికి ఒక వరం. ఈ మరుపే మన చేత చదువులు చదివిస్తుంది, ఉద్యోగాలు చేయిస్తుంది; పెళ్ళిల్లు, ప్రత్యుత్పత్తి, పిల్లల పెంపకం ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలని నమ్మిస్తుంది. ఇవన్నీ అలవాటుగా చేసుకొని మనం మన ఉనికిలో అర్థరాహిత్యాన్ని మర్చిపోగలుగుతాం. అందుకే అన్నాను habit is heaven అని. అలవాటు నుంచి బయటకొచ్చి బతకాలనుకుంటే మనది చాలా ఒంటరి బతుకైపోతుంది. దాన్ని మన చుట్టూ మనుషులూ సపోర్ట్‌ చేయరు; మన చుట్టూ ఉన్న విశ్వం కూడా ఎలాంటి కాంపెన్సేషనూ చూపదు, సరికదా భయపెడుతుంది. కాని, బుజ్జగించి నిద్రపుచ్చే అలవాటనే అబద్దం కంటే, భయపెట్టినా నిజమే కావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు- శ్యామ్యూల్‌ బెకెట్‌ లాంటి వాళ్ళు. వాళ్ళ విషాదం ఈ ప్రపంచంలో అన్ని విషాదాల్లోకీ అర్థవంతమైన విషాదం.


"పుట్టుక, చావు అనే రెండు చీకటి తీరాల్ని కలుపుతూ కట్టిన వెలుగు వంతెనే జీవితం'' అంటాడు కాఫ్కా. ఒకసారి ఈ వంతెనెక్కేకా చివరిదాకా నడిచి తీరాలి. వదిలి వచ్చిన తీరం పట్ల బెంగా లేదు, వెళుతున్న తీరంపై ఆశాలేదు. అసలక్కడేముందో కూడా ఎవరికీ తెలీదు. ముందు వెనకల చీకటే. కాబట్టి వంతెన మీద నడిచే కాస్త కాలాన్ని
worthwhile చేసుకోవడమే మనం చేయగలిగింది. కాని ఏం చేస్తే ఇది worthwhile అయినట్టు? వందేళ్ళు బతకమని మనల్ని ఈ ప్రపంచంలో పడేశారు బానేవుంది; what do we do now? ఈ వంతెన అన్న మెటాఫోర్‌ కన్నా "మ్యూజింగ్స్‌''లో చలం ఇంకో మంచి మెటాఫోర్‌ ఇస్తాడు.


"రేపు చచ్చే నేను— ఈ స్టేషన్లో ఎక్కి పక్క స్టేషన్లో దిగిపోయే నేను— సుఖంగా కూచోక, రైలు పెట్టెలు యెందుకు ఊడుస్తూ యీ నాలుగు నిమిషాలు గడపాలి? నాకేం తెలీదు— ఈ రైలు యెక్కడికి పోతుందో, ఏమవుతుందో. ఇది శాశ్వతమనీ, దీనికో గమ్మస్థానం వుందనీ నాకు రూఢీ యేమిటి? ఇది యే బ్రిడ్జి మీద, ఏ బాంబుల క్రింద బోల్తా పడుతుందో! నేనెందుకు నా కాలాన్ని సౌఖ్యాన్ని త్యాగం చేయాలి?''


ఇక్కడ చలం కోపం సామ్యవాదులు, సంఘ సేవకుల పట్ల. పుట్టుక అనే స్టేషన్లో ఈ జీవితం అనే రైలెక్కాం; చావు అనే స్టేషన్లో రైలు దిగిపోతాం. ఒక్కసారి దిగాక ఈ రైలుతో మనకే నిమిత్తం ఉండదు. ఇప్పుడు ఉన్న కాస్త సమయాన్ని నాకు నచ్చినట్టు గడపక సోషలిష్టులు చెప్పినట్టు రైలుని, రైల్లో మిగతా ప్రయాణికుల్నీ ఉద్దరిస్తూ ఎందుకు గడపాలి- అన్నది చలం ప్రశ్న. నిజమే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గడపొచ్చు. చలం తోటి ప్రయాణికుల భార్యల్ని బుట్టలో వేసుకోవడంలో (లేదా "ఉద్దరించడంలో'') గడిపాడు. శ్రీశ్రీ స్లీపర్‌ క్లాస్‌ వాళ్ళని నిద్రలేపి "పదండి ముందుకు పదండి తోసుకు'' అంటూ ఎ.సి. కంపార్ట్‌మెంటు వాళ్ళమీదికి ఉసిగొల్పడంలో బిజీ అయ్యాడు. కృష్ణ శాస్త్రి రైల్లో ఇంతమంది అమ్మాయిలుండగా రైల్లో లేని ఊర్వశి కోసం వెక్కి వెక్కి ఏడుస్తూ గడిపాడు. వడ్డెర చండీదాస్‌ ప్రయాణికుల్నందర్నీ మొత్తంగా బహిష్కరించి బాత్రూంలో తలుపేసుకుని గడిపాడు. అలాగే మీరు మీ లాప్‌ టాప్‌ మీద మీటింగ్‌కి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేస్తూ గడపొచ్చు. ఇంకొకరు తోటి ప్రయాణికులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ గడపొచ్చు. మరొకరు నిద్రపోతూ గడపొచ్చు. మరొకరు పల్లీలు నవుల్తూ గడపొచ్చు. నాకైతే తలుపు దగ్గర నుంచొని ప్రయాణించడం ఇష్టం. ఒకసారి ఢిల్లీ నుండి హైదరాబాద్‌ దాకా పూర్తి ప్రయాణాన్ని రిజర్వేషన్‌ ఉన్నా తలుపు దగ్గరే నుంచుని/కూర్చునే ప్రయాణించాను. నాకు కిటికీ సీటు కూడా సరిపోదు. ఊచలు అడ్డు రావడం ఇష్టం ఉండదు. కిటికీలోంచి ప్రదేశాల్ని చూడటం ఏదో టీవీలోంచి చూసినట్టుంటుంది. అలా కాదు, నాకా ప్రదేశాల్లో భౌతికంగా ఉన్న అనుభూతి కావాలి. తలుపు దగ్గరే అది సాధ్యమౌతుంది. నిజంగా మనం ఎపుడూ చూడని ప్రదేశాల్లోంచి వాటికి మాత్రమే ప్రత్యేకమైన ఫ్లేవర్నేదో మనలోకి తీసుకుంటూ వాటి మధ్య నుంచి వేగంగా దూసుకుపోవడం భలే అనుభూతి. రైల్లోనే అది సాధ్యం. అందుకేనేమో, నాకు రైల్లో ఉన్న ఛార్మ్‌ ఇంకెందులోనూ కనపడదు. మార్సెల్‌ ప్రౌస్ట్‌ ఐతే ఇంకా అల్ప సంతోషి (లేదా— అఫ్‌కోర్స్— మనందరికన్నా తీవ్రమైన భావనా శక్తి ఉన్న వ్యక్తి). అందుకే, కేవలం రైల్వే టైంటేబిల్స్‌ చదవడంలోనే ఆ ఆనందం కలుగుతుందంటాడు: "Oh! the sweet caress of all those names of villages and towns in the railway timetables, the charming evocation of lands of lightness and life that I will never visit. . . ."


నాకు రాహుల్‌ సాంకృత్యాయనంత ధైర్యం లేదుగాని ఉంటే నా జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికి నేను వెంటనే చేయాల్సిన పనొకటుంది. ఉద్యోగాన్ని వదిలేసి దేశ దిమ్మరి. . . కాదు కాదు, ప్రపంచ దిమ్మరి కావడం. నా ఉద్దేశ్యం యాత్రికుడిలాగా కాదు; బైనాక్యులరో, కెమెరానో చేతపుచ్చుకుని, హోటళ్ళలో తింటూ, అవుట్‌ సైడర్‌గా కాదు. ఎక్కడి కెళ్తే అక్కడ ఇమిడిపోవాలి. కృష్ణ శాస్త్రి "ఆకులో ఆకునై, పూవులో పూవునై. . .'' అంటాడు చూడండి, అలా కలిసిపోవాలి. At the fatal end, I should feel at home with the world that I had lived in. ప్రపంచాన్ని చూడటం కాదు, తెలుసుకోవాలి. అది నా ఐడియల్‌ జీవితం. నా ఉద్దేశ్యంలో అదే జీవితం పరమార్థం. నాకే కాదు, ఎవరికైనా ప్రపంచాన్ని తెలుసుకోవడమే హైయ్యస్ట్‌ ఐడియల్‌. నబకోవ్‌ తనకో రచయితగా ఓ గొప్ప రచన పూర్తి చేసినప్పటికన్నా, లెపిడోప్టెరిస్టుగా ఓ సీతాకోక చిలుక జాతిని ఖచ్చితంగా నిర్థారించగలిగినప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుందంటాడు. రచయిత కేవలం ప్రపంచానికి అద్దం పడతాడు. శాస్త్రవేత్త మాత్రం ప్రపంచం చూపించే భ్రమా పూరితమైన అద్దాల్ని ఛేదించి లోపలికి దూసుకుపోతాడు. ఎలా చూసినా శాస్త్రవేత్తల తరువాతే కళాకారుల స్థానం. ఈ ప్రపంచంలో పుట్టి ఈ ప్రపంచాన్ని తెలుసుకోకుండానే చచ్చిపోతే ఎలా? అయితే మళ్ళీ ఇందులోనూ తికమక ఉంది. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి స్థలం మనకు సహాయపడుతుంది గానీ, కాలం మనకు సహాయపడదు.


స్థల, కాలాలంటూ రెండూ ఏవో చాలా దగ్గరి విషయాలన్నట్టూ చెప్తారు గానీ రెంటికీ చాలా దూరముంది. ఈ భూమ్మీద మనం స్థలాన్నే జయించగలం, కాలాన్ని జయించలేం. ఈ ప్రపంచంల్లో స్థలాన్నే తెలుసుకోగలం, కాలాన్ని తెలుసుకోలేం. ఉదాహరణకి, ఇంట్లో మా అమ్మ చిన్నప్పటి ఫోటో ఒకటి ఉంటుంది. ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాలలో పదవతరగతి పూర్తయిన తర్వాత తీయించుకున్న గ్రూప్‌ ఫోటో. టీచర్ల వెనుక వరసగా నిలుచున్న అమ్మాయిల మధ్య, రెండు జళ్ళతో, పరికిణీ-ఓణీ వేసుకుని నుంచునుంటుంది. భలే ముద్దొస్తుంది. వీలైతే ఒక్కసారి వాళ్ళ క్లాసులోకి వెళ్ళి అందరిముందూ పదిహేనేళ్ళ ఆ రెండు జెళ్ళ పిల్లని గట్టిగా "అమ్మా'' అని పిలవాలనుంటుంది; బిత్తరపోయిన ఆ మొహాన్ని ఓసారి చూడాలనుంటుంది. చూడలేను కదా. అలాగే మా మొండిదాన్ని కూడా. ఓ పదిహేనేళ్ళ వెనక్కి పోయి, బహుశా అప్పటికి పదేళ్ళున్న తనని స్కూలు కెళ్తుంటే ఆపి, చాక్లెట్లు ఏవో ఇచ్చి మంచి చేసుకుని "మరో పదిహేనేళ్ళ తర్వాత నేన్నీకు పది పేజీల ప్రేమ లేఖ రాయబోతున్నాను దయచేసి ఒప్పుకోవే'' అని బతిమాలాలని ఉంటుంది. ఇప్పుడు జీవితాన్నే ఇచ్చేస్తానన్నా నా కక్కర్లేదంటుంది, కనీసం చాక్లెట్‌కయినా లొగుతుందేమో చూడాలి. అలాగే సరిగ్గా 1912 ఆగస్టు పదమూడో తారీకున జర్మనీలో ప్రేగ్‌ పట్టణానికి వెళ్ళాలనుంది. యథాతథంగా ఆ రోజు రెండింటికి ఆఫీసు నుండి వస్తున్న కాఫ్కాను అటకాయిస్తాను. "ఈ రాత్రి మీ ఫ్రెండ్‌ మాక్స్‌ ఓ విందు ఇవ్వబోతున్నాడు. అక్కడ మీరు మీ హృదయాన్ని కాస్త జాగ్రత్తగా దాచుకోండి, లేదంటే ఓ అమ్మాయి ఎత్తుకె ళ్ళిపోగలదు'' అని హెచ్చరిస్తాను. మళ్ళీ 2008కి తిరిగి వచ్చేసి, నా దగ్గరున్న కాఫ్కా డైరీలు తిరగేసి, ఆ ఎంట్రీ దగ్గర కాఫ్కా తనకు వీధిలో ఎదురైన ఓ అద్భుతమైన సైకిక్‌ గురించేమన్నా ప్రస్తావించాడేమో చూస్తాను. ఇదీ కాకపోతే తిన్నగా పదమూడో శతాబ్దానికి గోబీ ఎడారి వెళిపోవాలనుంది. వెళ్ళి చంఘీజ్‌ ఖాన్‌ సైన్యంలో రిక్రూట్‌ అయిపోతాను. గుర్రాలు, గుడారాలు, తార్తారు పడుచులు, చీనా చక్రవర్తి మీద యుద్ధాలు- భలే ఉంటుంది కదూ. మేధావుల అజమాయిషీ చూసి చూసి విసుగెత్తింది; ఇప్పుడు భవన నిర్మాణాల్లో కూలీలు, హోటళ్ళలో వెయిటర్లు, ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులూ అప్పుడు సైన్యాధ్యక్ష పదవుల్లో ఉంటే ఓ సారి చూడాలనుంది. (బలవంతుడు బలహీనుణ్ణి దోచుకునే అప్పటి సమాజాన్ని బార్బేరియన్‌ సమాజం అన్నారు. కాని ఇప్పుడూ బలవంతుడు బలహీనుణ్ణి దోచుకుంటూనే ఉన్నాడు. కాకపోతే ఇదంతా ఇంటెలెక్చువల్‌ బార్బేరియనిజం.) సరే ఇలా చాలా ఆశలున్నాయి. కానీ ఏం చేస్తాం! ఈ ప్రపంచంలో బతకడానికి ఏ స్థలాన్నైనా ఎంచుకోవచ్చు, కాని కాలాన్ని మాత్రం ఎంచుకోలేం. We are all prisoners of time. ఆగండాగండి! నిజానికి ఇది కూడా సరైన వాదన కాదేమో. కాలమే కాదు, స్థలం కూడా మన చేతుల్లో లేదేమో. ఎందుకంటే, ప్రపంచంలో మనం ఎక్కడైనా బతకగలం, కాని విశ్వంలో మాత్రం భూమిపైనే బతకగలం. I guess then, we are all prisoners of space too. నువ్వు ఫలానా 1980ల్లో పుట్టి 2060 దరిదాపుల వరకూ (Oh! the greedy me!) ఫలానా భూమ్మీద బతుకు అని పడేస్తే చచ్చినట్టు బతకాలన్నమాట. ఎన్నుకునే అవకాశం ఇసుమంత కూడా లేదన్న మాట.


(I am practising the art of digression. How am I doing?)

34 comments:

రాకేశ్వర రావు said...

Impractically dreamy - అవును నిజం Fantastically imaginative - నిజం నిజం (కాలం మీ చేతనుంటే.. అన్న ఊహ)
Dangerously instinctive - ఈ వ్యాసం చదివితే అట్లా అనిపించలేదు. ఇలాంటి వ్యాసాలు ఇంకాకొన్ని వ్రాస్తే dangerously instinctive అవ్వవచ్చేమో గాని, అలా అయినా పెద్ద ప్రయోజనం వుండదన్నది నా ఇన్‌స్టింక్టు. Instinct could be very misleading. అందుకేగా లెక్కల్లో అన్నీ నిరూపించి చూపించమంటారు.
(అన్నట్టు విశ్వంలో మనం భౌతికంగా ఎంత చిన్నవారమో అన్నది హిచ్చైకర్స్ గైడ్ టు గాలక్సీ లాంటి పరమ సుత్తి సినిమా చూసినా తటస్తిస్తుంది - అది మీకు వాంటేజ్ పాయింట్ గా అనిపించడం నన్ను అబ్బుర పఱచింది, ౧వ భాగం చదివి వాంటేజ్ పాయింటంటే ఏ ఆది శంకరాచార్యుల ఆలోచనా తీరో అనుకున్నా!)
Stubbornly reticent - How am I doing? అని అడిగినపుడే ఇది కూడా నిజం కాదని రూఢీగా తెలియవచ్చింది.

ఇలాంటి వ్యాసాలు వ్రాయడం (వ్రాసుకోవడం అనాలి) పూర్తిగా మీ కోసమే, it helps strip your thinking of all those superficialities (developed in an attempt to explain all the noise you observed), reduce the complexity and set the bounds for your thought process. It might help you distinguish causality from coincidence (the latter does not need analysis).

So you are the only one who can tell how you are doing? If you want to know how you are doing, just measure the above mentioned quantities (that is if you can quantify the said qualities like complexity, superficiality and humbleness of thought).

How am I doing అని అడిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. అదీ అంతర్జాలంలో! అనంతమైన విశ్వాన్ని చిప్పంత బుఱ్ఱలో బంధించడానికి ప్రయత్నిస్తూ సతమతమవుతున్న నాలాంటి ప్రతి దారిని పోయే దానయ్య వచ్చి, తనకు తోచింది తానుఁ జెప్పి పోతాఁడు. మీకు డొంకతిరుగుడుగా చెబితే అర్థమవ్వకపోతే నా ఉద్ధేశం - పైవి నా అభిప్రాయాలు మాత్రమే, నేనూ మనిషినే కాబట్టి నేను చెప్పింది పూర్తిగా తప్పు అయివుండవచ్చు. నా మాటలకు అనంగీకారం తెలుపువారికి నా సాదర స్వాగతం.

వికటకవి said...

@ ఫణి గారు,

ప్రొద్దున్నే ఈ టపా చదివినప్పుడు నేనూ రాకేశ్వర్ లా ఇదేంటి ఈయననుకున్న "వాంటేజ్ పాయింట్" ఇదేనా అనిపించింది . నేనొక్కణ్ణేనా ఇలా అనుకుంటోందనిపించి ఆగాను.

ఓ డీస్కవరీ ఛానల్/జియోగ్రాఫిక్ ఛానల్ వెర్రిగా చూసే నేను విశ్వానికి సంబంధించిన అసంఖ్యాక విషయాలు తెలుసుకుంటున్నప్పుడూ ఎప్పటికప్పుడు, అయ్యో మనం ఈ విశ్వంలో ఓ చిన్ని పరమాణువే కదా అనిపిస్తుంది. మొన్నామధ్య ౧౦౦ గొప్ప ఆవిష్కరణలు చూస్తున్నప్పుడు, ఓ జపాన్ ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ, అనంత విశ్వాన్ని పట్టి బంధిస్తూ ఐన్ స్టీన్ ప్రతిపాదించిన కొన్ని సూత్రాలు చూస్తే, గొప్ప గొప్ప ఫిజిసిస్టులు ఓ అవ్యక్త అనుభూతితో ఏడుస్తారు అని ఉద్వేగంగా చెప్పాడు.

నాకు ఆ సమయంలో టక్కున ఆ మాటలు దాదాపు విశ్వం గూర్చి తాత్వికంగానూ, ఆధ్యాత్మికంగానూ చెప్పిన మన మహానుభావులు గుర్తుకొచ్చారు. రెండు పరస్పర విరుద్ధ శాస్త్రాల్లో ఓ విధమయిన సామీప్యత అక్కడ నాకు కనపడింది. శాస్త్రపరంగా ఓ ఐన్ స్టీన్ స్థాయి ఆలోచనా ధార కల సైంటిస్టుల స్థితి, యోగ లేదా వేదాంత పరంగా ఉన్నత స్థాయికి (ఆలోచనల్లో) చేరిన వారి స్థితి తాలూకు భావనలు ఒకటేనేమో అని నాకు అనిపించింది..

ఈ తరహా ఆలోచనలు నా ఊహ ప్రకారం, పైన చెప్పిన సబ్జెక్ట్ద్ మీద ఆసక్తి గల వారికి తరచుగా వస్తూనే ఉంటాయి. "ఈ విశాల సృష్టిలో నేను ఎవర్ని/ఎంత" అన్న ప్రశ్నకి జవాబు ఖచ్చితంగా సైన్స్ పరంగా కన్నా వేదాంత పరంగా తెలుసుకుంటే కలిగే అనుభూతి విలువే వేరనిపిస్తుంది. (నాకా అనుభూతి లేదు కానీ, సైన్స్ పరంగా కలిగే ఆ అనుభూతి ఎక్కువ కాలం నిలబడక పోవటం వల్ల అలా అనుకుంటున్నాను).

మీకు తెలియదని కాదు, వాంటేజ్ పాయింట్ డెఫినిషన్ ఇలా ఉంది. "A position that affords a broad overall view or perspective, as of a place or situation." .
ఆ డెఫినిషన్లో "place" సైన్సుకీ, "situation" వేదాంతానికీ సరిగ్గా సూట్ అవుతాయనిపించింది.

నేనూ ఏ వేదాంతానికి దగ్గరగానో వెళతారనుకున్నాను.

ఫణీంద్ర said...

To: రాకేస్వరరావు, వికటకవి,

God! I don't know that you guys are expecting some kind of solvation here. (Did my previous post promised something like that?) I am just trying to strip the world to it's bare essentials. When I wrote my previous post, I didn't know that I am going to write a second part to it. When I am reading that page in Atlas, I really felt someting. And I just wanted to put it into words. And I still feel that this is the exact "vantage point" to know the world. Everything stems from here.

To: రాకేస్వరరావు,

What are you psychoanalyzing me? RaKeRa, you should immediately dump all that Freudian stuff you are having in your cup-board. It's doing you no good.

I just asked that question ("How am I doing?") rethorically; I know I am doing great.

GIREESH K. said...

మీ vantage point గురించి చదువుతుంటే, చాన్నాళ్ళ క్రితం ఓ మహానుభావుడు నాతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి - "ఈ సృష్టిలో నీ స్థానమూ,పాత్ర అర్ధమవ్వాలంటే ఓ సారి ప్లానెటోరియంకి వెళ్ళిరా. ఈ విశ్వం యొక్క magnitude నీకు పూర్తిగా అవగతమైన నాడు, నీ భ్రమలన్నీ తొలగిపోతాయి". మీ అనుభవం చదవగానే నాకు చప్పున ఈ మాటలు గుర్తుకొచ్చాయి.

I don't know whether I got you correctly, but I do feel that you are closer to the theory that baffled many minds - Free Will Vs Determinism.

"In the century following Newton's discoveries, a new interpretation of the Universe emerged : 'Determinism'. According to determinism, the Universe may be viewed as a great clock-work set in motion by a divine hand at the beginning of time and left undisturbed".

- Heinz R. Pagels,
The Cosmic Code (Quantum as the Language of Nature)

I am sorry if I understood you wrongly, but I feel you are on the right path.

ప్రసాద్ said...

ఫణీంద్ర గారూ,
మీ ఈ వ్యాసంతో నేను వంద శాతం ఏకీభవిస్తున్నాను. ఎంతలా అంటే నాకు కలిగిన జ్ఞానమేదో అదే మీకూ కలిగినంత అనుభుతి చెందాను మీ ఈ బ్లాగు చదువుతున్నంతసేపూ.

మన పూర్వీకులు తమకు అర్థం కాని ఎన్నో విశయాలకు దేవున్ని ఆధారం చేసుకొని వాదనలు నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ విశాల అనంత విశ్వంలో ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడం ద్వారా మనమేంటో, మన వునికి ఏంటో ఎందుకో అన్నీ కళ్ళ ముందు మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి.

మీకు లాగే నాకూ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు ఈ అనంత విశ్వంలో జరుగుతున్న లీలలలోనుంచే జవాబులు దొరుకుతున్నాయి. మీ ఈ బ్లాగు చదువుతున్నప్పుడు గతంలో నేను రాసిన "అక్రమంలో క్రమం" ( http://www.charasala.com/blog/?p=116 ) అన్న బ్లాగు గుర్తుకు వచ్చింది.

వీలయితే చూడండి.

--ప్రసాద్
http://blog.charasala.com

ప్రసాద్ said...

చెప్పడం మర్చిపోయాను.
బ్రెడ్డు, శిలీంద్రియాల వుదాహరణ అద్భుతంగా సరిపోయింది.

విచిత్రంగా నాకునూ ఈ కాస్తా జీవితాన్ని అలా ప్రకృతిలో చరాచరాల్ని, మనుషుల జీవితాల్ని చూస్తూ వాటిని అనుభవిస్తూ తిరగాలనే కోరిక వుంది. అయితే ఈ ప్రపంచం ముఖ్యంగా మంబమీద ఆధారపడ్డవాళ్ళు వేసే ముద్రకోసం భయపడి (ఇంక భయపడుతున్నాను అంటే ఆ కోరిక వీటిని జయించేంత బలంగా లేదన్న మాట) ఇలా వుండిపోయాను. మీ ఐడియల్ జీవితమే నాకూ కావాలనుంది.

--ప్రసాద్
http://blog.charasala.com

డా.స్మైల్ said...

ఆహా! నా మనోఫలకంలో కదలాడే చిత్తరువులకు ప్రాణం పోసిన టపా ఇది. నాకయితే విజయనగర సామ్రాజ్య కాలానికి వెళ్లి మరో 'నాయకుడి'గా రాయల వారి సేవలో తరించాలని, ఆ జీవితాన్ని అనుభవించాలని బలమైన కోరిక. YOU are Numero Uno in my blog world! Keep blogging your random thoughts...it is like tasting 'ecstacy' to read your thoughts.

ఫణీంద్ర said...

ప్రసాద్ గారు,

"అక్రమం లో క్రమం" చదివాను. వ్యాసం చాలా బాగుంది.

"నాకైతే అక్రమంగా వున్న ఈ అనంత విశ్వంలో తాత్కాలికమైన క్రమమే ఈ సూర్యమండలము అనిపిస్తూంది"

--ఇక్కడ మనిద్దరం చాలా దగ్గిరగా ఉన్నామనిపించింది.

To: GIREESH.K

You got me correctly.

"Free Will Vs. Determinism" గురించి నాకంతగా తెలీదు. Borges అయితే మనకు ఎన్నుకునే సౌలభ్యం ఉందనుకోవడం వట్టి భ్రమ అంటాడు.

ramya said...
This post has been removed by the author.
ramya said...

We are all prisoners of time.., nijame kadaa. naku alaage anipistu untundi.

చిన్నతనం లో టెర్రస్ పై పడుకుని అనంత ఆకాశం లోని నక్షత్రాలని చూస్తూ మన సూర్యుడూ వాటిల్లో ఒకదానిలాంటి వాడు, మనం ఈ అనంతం లో పిపీలి్కమైనా కాదు అనుకునే వాళ్ళం గుబులు గా.
ఇప్పుడూ తెలుసు కానీ ఎప్పటికప్పుడూ మనిషి ఒక మాయా పూరిత మైన సుడిలొ కొట్టుకు పోతూనే ఉంటాడు అనిపిస్తుంది.
చలం ఆత్మార్పణ లో ఈ లోకం అనే కథ లో పెంట కుప్ప పై పురుగులను లోకం లోని వివిద రకాల వాళ్ళతో పోలుస్తూ రాసింది చదివినప్పుడు మొదట నవ్వుతో చదివినా తరువాత ఆ పోలికలు గుండెలో వేరే ఏవో ఆలోచనలని తడుతూ ఉండేవి.

అన్నట్లు టివీ ఫైవ్ లో ప్రతి ఆదివారం ఉదయం భూమిమీదకు వచ్చిన ఏలియన్స్ గురించి, అన్‌ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ గురించి ఆసక్తి కరమైన వివరాలు చూపుతున్నారు (తెలిసే ఉంటుంది) వీలైతే ఈ సారి చూడండి.

ramya said...
This post has been removed by the author.
రాకేశ్వర రావు said...

ఏంటండి ఫణి గారు, తెలుగు ఇంత బాగా వ్రాసే మీరు కూడా రాకేస్ అంటున్నారు! రాకేష్ అని విన్నప్పుడే నాకు బాధగా వుంటుంది. మీలాంటి వారు రాకేస్ అనే సరికి నాకు పుండు మీద గుచ్చుకున్నట్టుంటుంది ;-)

మీరు ఎలాంటి ప్రత్యుత్తరమిచ్చినా స్పందించకూడదనుకున్నా గాని, నా వల్ల ఏ మంచి వారికీ నిందలు రాకూడదని నా కోరిక.
నేనెప్పుడో చెప్పినట్టున్నాను ఫ్రాయిడ్ చదివానని, నేను చదివిన అనేకానేక సిద్ధాంతాలలో అది ఒకటి మాత్రమే, భారతంలో పెరిగిన నాకు ఫ్రాయిడ్ ఒక్క ఆలోచనా తీరు లేదు. అంతకంటే ముఖ్యంగా నాకు అంత మేధాశక్తి కూడా లేదు. ఫ్రాయిడ్ పద్ధతుల్ని ఆయన తప్ప వేరెవరైనా విజయవంతంగా ప్రయోగించారా అన్నది కూడా నా సంశయం. ఎప్పుడో మూడేండ్ల క్రితం చదివిన తరువాత ఒకటి రెండు సార్లు సైకోఅనాలసిస్ ప్రయత్నించి మనవల్ల కాదులే అని ప్రక్కన పడేసాను.
కాబట్టి ఎటువంటి తప్పుడు తర్కం వెల్లబుచ్చినా అది మీ విధేయుడి ప్రతిభేనని మనవి.

నా పాత అనుభవాల ప్రకారం మీరు సాధారణంగా రెటిసెంటు అని, రెటోరికల్ గా మాట్లాడరని గమనించి, మీరు ఆ చివర వేసిన ప్రశ్నను ఆసరాగా తీసుకొని చొఱవ చేసి - మన బ్లాగుల్లో ఎల్లప్పుడూ కనిపించే తాన తందాన వ్యాఖ్యలా కాకుండా నాకు అనిపించింది నిక్కచ్చిగా వ్రాసాను.

*Standard disclaimers apply.

ఫణీంద్ర said...

To: "రాకేశ్వరరావు,"

Sorry. నాకు లేఖిని అలవాటు తప్పిపోయింది. ఉద్యోగంలో "శ్రీలిపి" వాడవలసి వస్తుంది. దాన్ని యూనికోడ్ లోకి మార్చడం పెద్ద తతంగం. అందుకే పోస్టులు "శ్రీలిపి"లో చేసినా, వ్యాఖ్యలు మాత్రం ఎలాగో తంటాలు పడి లేఖినిలో రాస్తున్నాను (అలాంటప్పుడే ఈ బూతులు). మరీ చిరాకు వేస్తే ఇంగ్లీషులోనే కామెంటు చేస్తున్నాను.

నేన్నిజానికి మీ వ్యాఖ్యలకు ఎదురుచూస్తుంటాను. Because—right or wrong—you don't know how to mince words.

నాగమురళి said...

ఫణీంద్ర గారూ, చాలా బాగా రాశారు. మీ రచనని నేను చాలా ఆస్వాదించాను. ప్రస్తుతానికి అంతకన్నా ఏమీ చెప్పలేను. చర్చించలేను.

GIREESH K. said...

మీరన్నట్లు, ఎన్నుకునే సౌలభ్యం మనకు లేదని విశ్వసించిన నాడు, Determinism ని అంగీకరించినట్లే. అంటే, దేవుడి ఉనికిని కూడా ఒప్పొకున్నట్లే (అంటే, మీరు ఒప్పుకోలేదని కాదు!). కాకపోతే, మీరు చేసిన చర్చ తరువాత గమ్యం...దేవుడు! సైన్సు,ఆధ్యాత్మికత ఎంత దగ్గరగా ఉన్నాయో కదా!

దాదాపు, ఇదే విషయమ్మీద నేను కొద్దిరోజుల క్రితం వ్రాసిన
టపా "అంతర్ముఖం" చదవగలరు...

http://gireesh-k.blogspot.com/2008/06/blog-post_18.html

బొల్లోజు బాబా said...

మీ శైలి చాలా చాలా బాగుంది.
కంటెంట్ మాత్రం అక్కడక్కడా ఒకటికి రెండు సార్లు చదవవలసి వచ్చింది.
మీరు జీనియస్

బొల్లోజు బాబా

భైరవభట్ల కామేశ్వర రావు said...

బావుందండీ!
ముందుగా మీరన్నదాంట్లో నేనొప్పుకోని మాటలు:
"నాకే కాదు, ఎవరికైనా ప్రపంచాన్ని తెలుసుకోవడమే హైయ్యస్ట్‌ ఐడియల్‌"
"ఎలా చూసినా శాస్త్రవేత్తల తరువాతే కళాకారుల స్థానం."
ఇవి మీ అభిప్రాయాలే కాబట్టి ఇందులో వాదనికి తావులేదు.
కాలంలో ప్రయాణించాలని కలలుగనే వాళ్ళు చాలామందే ఉంటారు, అందులో నేనూ ఒకణ్ణి. చాలాసార్లు అలా ఊహల్లోకి వెళ్ళినవాణ్ణీను. ఒక విచిత్రమైన విషయం ఏవిటంటే, గడచిన కాలంలోకే ఎప్పుడూ పరుగులు, భవిష్యత్తులోకి కాదు! ఇది కూడా చాలామందికి వర్తిస్తుందనుకుంటాను.
స్థల, కాలాల మధ్యనున్న పెద్ద తేడా, స్థలంలో ప్రయాణించాలంటే మనం శక్తిని వినియోగించాలి (we have to spend some energy), అదే కాలంలో మనం అసంకల్పితంగా నితంతరం ప్రయాణం చేస్తునే ఉన్నాం! ఆ ప్రయాణాన్ని ఆపడానికి(ఒక వేళ సాధ్యమయితే) శక్తిని ఉపయోగించాలి!
సరే ఎలానూ ప్రసక్తి వచ్చింది కాబట్టి సాపేక్ష సిద్ధాంతం (Relativity Theory) గురించిన నా అజ్ఞానాన్ని బయట పెడతాను. ఈ సాపేక్ష సిద్ధాంతం చెప్పేది మన ప్రయోగ, గణన పద్ధతులకున్న పరిమితులని (limitations of our experimental and measurement methods) తప్పిస్తే, మౌలిక వస్తు తత్వాన్ని గురించి కాదని నా ఆలోచన. ఎందుకంటే, ఒక వస్తువు కాంతివేగానికి దగ్గరగా ప్రయాణిస్తున్నప్పుడు, దాని పరిణామంలో (length or mass) రావడం అన్నది మౌలికంగా వస్తువులో మార్పువల్ల కాదు. ఎందుకంటే ఈ పరిణామంలో మార్పన్నది కొలిచే వాళ్ళమీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఉదాహరణకి నేను స్థిరంగా ఒక దగ్గర నిలుచుని ఉన్నాను. మీరేమో ఒక బంతి పట్టుకొని రైల్లో కాంతి వేగానికి దగ్గరగా ఉన్న వేగంతో (with reference to me) ప్రయాణిస్తున్నారనుకొందాం. అప్పుడా బంతి బరువును మీరు కొలిస్తే ఒకటీ, నేను కొలిస్తే వేరొకటిగానూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మౌలికంగా బంతిలో ఏ మార్పూ లేదు. తేడా అల్లా కొలిచేవాళ్ళలోనే. కాబట్టి ఈ తేడాలు కొలిచే విధానాల్లో ఉన్న పరిమితివల్లనే!

ఫణీంద్ర said...

కామేశ్వర రావు గారు,

నా పోస్టులో నేను సాపేక్ష సిద్ధాంతం గురించి ఎక్కడా ప్రస్తావించలేదనుకుంటా. అయినా సాపేక్ష సిద్ధాంతం గురించి మీరు చెప్పేది నిజమేనా? దాని విషయంలో నేనూ అజ్ఞానినే. నాకు అంతరిక్షం గురించి తెలిసిందంతా ఎప్పుడో చదివిన నండూరి రామ్మోహనరావుగారి "విశ్వ రూపం''లో ఉంది. అందులో ఆయన సాపేక్ష సిద్ధాంతాన్ని గురించి చెపుతూ కాంతి వేగంతో ప్రయాణిస్తే గడియారాల్లో సమయం మారడం గురించి, కొలత బద్ద పొడవులో మార్పు రావడం గురించి, వయోవృద్ధి నెమ్మదించడం గురించీ ఏవో చెప్పినట్టు గుర్తు. మరివన్నీ వస్తువు మౌలిక తత్త్వంలో మార్పులేగా?

ఇక మీరిచ్చిన ఉదాహరణకొస్తే - రైల్లో ఉన్న నాకు బంతి బరువు ఒకలా తూగుతుంది, భూమ్మీద ఉన్న మీకు మరొకలా తూగుతుంది. కాని భూమి దాటితే దానికంటూ బరువే ఉండదు కదా. చంద్రుని మీదకు పోతే ఒక బరువు, మరో గ్రహం మీదకు పోతే మరో బరువు ఇలా మారుతూనే ఉంటుందిగా. ఇలా చూస్తే అసలు బరువుకు సంబంధించి దానికంటూ ఒక మౌలిక తత్త్వమే లేదు కదా? దాని బరువు చెప్పుకోవలసి వస్తే సాపేక్షంగానే కదా చెప్పుకోవాలి?

ఇలాంటి అనుమానాలే నాకు మొదటి పేరాలో ప్రస్తావించిన ఉదాహరణలు చదివినపుడు కూడా వచ్చాయి. కొలత బద్ద పొడవు మారడం అంటే అదెలా సాధ్యం. అలాగే కాంతి వేగంతో ప్రయాణిస్తున్న వ్యక్తి వయోవృద్ధి నెమ్మదించడం అంటే అతను భూమ్మీద కొస్తే అతని ఈడు స్నేహితులంతా పెద్దవాళ్ళైపోయి ఉంటారా?

నేను మీ వాదనకి వ్యతిరేకంగా ఇక్కడేవీ చూపించటం లేదు. చూపించలేను కూడా నిజానికి. కానీ ఈ విషయంపై మీరింకా ఏమైనా రాస్తే కాస్త జ్ఞానం కలుగుతుందని ఆశ.

భైరవభట్ల కామేశ్వర రావు said...

Phani garu,
Mention about space-time made me think about Relativety. Regarding your question, there was a slight confusion because of writing in telugu. By "బరువు" what I meant was "mass" not "weight". Mass doesn't depend on gravitational pull. The mass of a ball is same both on earth or on moon.
Well, my knowledge about Relativety is shallow too. It is from reading books like "A Breif History of Time". I too was under the impression that there would be change in the inherent structure of objects because of speed. But it didn't make any sense to me. So when I read about it few times and thought over it again and again, I got the understanding that the whole logic is based on how we can measure those attributes like length, mass, time. Thus, I think it is all about the limitations of our measurement capabilities. Ofcourse I may be wrong!

Cinevalley said...

doglas adams' hitch hikers guide to galaxy described how insignificant we are:

Far out in the uncharted backwaters of the unfashionable end of the western spiral arm of the Galaxy lies a small unregarded yellow sun. Orbiting this at a distance of roughly ninety-two million miles is an utterly insignificant little blue green planet ....


Btw, i suggest you to think beyond. read Shankara's maya vadam. you will start questioning your existence itself :)

ప్రసాద్ said...

గిరీష్ గారన్న మాట నాకు అర్థం కాలేదు.

"మీరన్నట్లు, ఎన్నుకునే సౌలభ్యం మనకు లేదని విశ్వసించిన నాడు, Determinism ని అంగీకరించినట్లే. అంటే, దేవుడి ఉనికిని కూడా ఒప్పొకున్నట్లే (అంటే, మీరు ఒప్పుకోలేదని కాదు!). కాకపోతే, మీరు చేసిన చర్చ తరువాత గమ్యం...దేవుడు!"

*Determinism ని అంగీకరిస్తే దేవుడి ఉనికిని ఎందుకు ఒప్పుకున్నట్లు?
*ఈ చర్చ తర్వాత గమ్యం దేవుడెలా అవుతాడు?

--ప్రసాద్
http://blog.charasala.com

GIREESH K. said...

Prasad garu,

When we agree that we don't have any control over our actions and decisions, it means that we are accepting 'Determinism'.

Determinism as defined by Wiki is is the philosophical proposition that every event, including human cognition and behaviour, decision and action, is causally determined by an unbroken chain of prior occurrences (Karma in common parlance).

In otherwords, the Universe may be viewed as a great clock-work set in motion by a divine hand at the beginning of time and left undisturbed".

Its upto each individual to call this 'divine hand' as God or some supernatural power. And, this is the same 'divine hand' i referred to as 'God' in my comment.

In this stride, Albert Einstein may not look casual when he said: “God does not play dice”.

As regards to your comment in my blog, i will respond to you later in detail.

-Gireesh

ప్రసాద్ said...

గిరీశ్ గారూ,
మీ వివరణకు నెనర్లు. ఈ కోణంలో నా అభిప్రాయాల్నీ మళ్ళి ఓసారి తిరిగి చూసుకొని ఓ టపా రాయాలనుకుంటున్నాను వివరంగా.

--ప్రసాద్
http://blog.charasala.com

ఫణీంద్ర said...

To: ప్రసాద్, గిరీష్,

మీ ఇద్దరూ వాదించుకుని ఓ కొలిక్కి వస్తే ఈ Free will & Determinism గురించి నాకేమైనా "క్లూ" దొరుకుతుందనుకున్నాను. సరే వెళిపోతున్నారు కాబట్టి నా అభిప్రాయలూ చెప్పేస్తున్నాను.

నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి నమ్మను. నేను పైన చెప్పినట్టు దేవుని సృష్ఠికి కూడా మనిషి ఏరొగెన్సే కారణమని నా అభిప్రాయం. (But, I believe, He is the greatest invention mankind so far has produced. And He is quite a romantic idea too. Feels good to have Him in here.) అంతే కాదు "ఫ్రీవిల్, డిటెర్మినిజం"ల మధ్యేమార్గం ఏదో ఉంటుందని నా నమ్మిక.

మీరు చర్చించాలనుకుంటున్న విషయాలు మానవ మేథకు అందేవి కాదు. మీరు ఎంత చర్చించినా ఓ పర్యవసానానికి రాలేరు.

రాకేశ్వర రావు said...

about mincing words, (నిఘంటువు తిరగవేయవలసివచ్చింది ఆ పదార్థం కోసం)
నాకు మింసిగ్ అంటే చాలా ఇష్టం, అది ఒక ఆదర్శం నా దృష్టిలోఁ. మింసు చేయని వారు ఐతే అహంకారులైనా అయి వుండాలి లేదా అజ్ఞానులైనా అయివుండాలి. నా మటుకు నేను మింసింగు చాలా వరకు మా గురువుగారు కొత్తపాళి గారి దగ్గర నుండి నేర్చుకున్నాను. మీలాంటి వారితో మాట్లాడేడప్పుడు నాగరాజుగారి హెచ్చరిక గుర్తుపెట్టుకొని బాగా ఆలోచించి(మింసి) వ్రాస్తాను. ఉదాహరణకు ఈ టపానే రానారె లాంటి ఆప్తులు ఎవరైనా వ్రాసివుంటే చుఱక అంటేది.
మింసింగు ఎందుకు మంచిదంటే, మనకు ఎంత తెలిసినా మనము తప్పు అయే ఆస్కారం ఎప్పుడూ వుంటుంది కాబట్టి.

అశ్విన్ బూదరాజు said...

interting topic interesting comments :-)

Giri said...

నాకు మీ టపాలు చదవగానే వ్యాఖ్య వ్రాయాలని అనిపించదు - కాసేపు ఆలోచిస్తూ కూర్చుండి పోతాను. (మీకు వ్రాయాలని ఉంటే గనక) "the matrix" సినిమా మీద మీ అభిప్రాయాలు వ్రాయండి, చదవాలని ఉంది.

Mahita said...

Trying to understand the universe might be magnanimous. Since, we all forget our own existence in this rat race for life, which we stopped living, I wonder if we can take the time to look for a vantage point for our existence, let alone the vantage point for the world! . Manishi manugada kosam parigedutu, tana manugadaki foundationni vismarinchaademo kada?

To belong to a place, we need to feel that place in every breath we take and to be able to feel that, we need to let go of the consciousness we have, that consciousness we developed by coming up of age and stand naked, with the eyes of a child, inquisitive and full of life, to understand the spectre called world that stands in front of us. Growing up, the spectre vanishes and true enough, we forget the awareness of our existence and run around for the material pleasures that supposedly give us happiness, limited by our thinking.

Prisoners of time and space. Hmmm, may be we are prisoners of our mind and thought. :)

Mee blog ee Madhya kaalam loney parichayam ayyindi, purnima valla. Mee profile chadivaaka, oka kutoohalam. With a little curiosity I started reading your blog and it captivated me to the extent where I revert to it every moment I find time to catch up on it :).

Falling Angel said...

ఫణీ, మీ టపా,comments చదువుతుంటే స్కాట్ అడమ్స్ ఫ్రీ విల్ గురించి వేసిన జోకులన్నీ గుర్తుకొచ్చాయి. అతని ఆర్గుమెంట్స్ లో మీకు అంతర్లీనంగా sarcasm కనిపించొచ్చు, కానీ He often makes his point quite intelligently.

వీలైతే అతని God's Debris చదవండి, He discusses evolution and god quite convincingly there.

ఫణీంద్ర said...

To: Mahati,

Yeah... I agree on that. We are prisoners of mind too.

To: RSG,

"God's Debris" is in my list. Planning to read it for quite some time. Why don't you review it in your blog.

koresh said...

entha kaalaaniki dorikaavyaa bale manchi manishivi, 20 ella krinda hyderabad lo bachelor ga udyogam chesthu roju ee viddullo ila udyoganiki kattubadi tirigesthu unte prakaa vidulloni prapancham emai pothunndo anna digulu tho rendu nellako udyogaanni maarusthu emani adigithe jitham vaddu pommani , jitham vadilese nannu chusina vaalaanu chusi navvu kuntoo,vaddera chandi dass gurinchina sahityam gurinchi aayana student ku goppagaa cheppi ratrntha nidra poka, adi vini vaaru vachi kalava mante kalavaka varu vellina chotukalla velli mounamgaa parisilanagaa vaari hava bavalanu chusto, narendra gari pelli lo vaari student ga mi naana maduranthakam rajaraam gaarini chupistaara ani adigithe raatri onti gantaku pelli koduku gurthu pettukuni parchayam cheste ee saammanyudenaa asmaana rachanalu chesindani oh| college day sandarbanga pulikantini pilavvalani nenu chesina proposal ki katta sekhar reddy oppu kunte, who is he? anna english literature head, teacher ani vini no annappudu emi cheyaleni paristhi, peristroyika parinamam prabhavam manava daridraniki racha bata anna naa mata vinani prof. guthikonda naageswara rao, gaaru , jivtham lo saahityam chadivi sampadichaka chedipothe pilla la paristhi etla anukuntunna naaku, moro chandi dass laagaa miruu....

ఫణీంద్ర said...

కోరేష్‌గారూ,

సాహిత్యంలో మీరు అనుభవించిన మాజిక్ ఆ రచయితల్లో వెతకడానికి ప్రయత్నిస్తే దొరకదండీ. ఎందుకంటే అది వాళ్ళ సొంతం కాదు. అక్షరాల వెంట మీ కళ్ళు పరుగులు తీస్తున్నప్పుడు మీరు పొందిన ఇంద్రియాతీతమైన అనుభూతి మీ ఉనికికి ఎలా బాహ్యమో, అక్షరాల వెంట ఆ రచయితల కలం పరుగులు తీస్తున్నప్పుడు వారు సృజిస్తున్న సృష్టి కూడా వాళ్ళ ఉనికికి బాహ్యమే. ఆ అనుభూతిలోని దివ్యత్యం వారి ప్రమేయం ఏమీ లేకుండానే ఏదో బయట శక్తి వల్ల వారి అక్షరాలకు ఆపాదించబడుతుంది. ఈ బయట శక్తినే మామూలు భాషలో "ప్రేరణ" అంటుంటారు. ఇది పూనినపుడు వాళ్ళు మానవాతీతులే. పూనకం దిగిపోయాక నాలా, మీలా మనుషులే.

కొత్త పాళీ said...

మీరు కొత్త టపా రాసి చాన్నాళ్ళైంది

ఫణీంద్ర said...

☺ ఆ విషయంలో నేనేం భాధ్యత ఫీలవడం లేదండీ. రాయడం కన్నా చదువుకోవడమే సుఖంగా ఉంది నాకు.