Sunday, August 10, 2008

How I messed up an essay అను తడబడిన తాత్త్విక మీమాంస


కాఫ్కా కథొకటుంది. పేరు 'ద గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా'. చైనా గోడ నిర్మాణం ఆ కథకు నేపథ్యం. చైనా ఉత్తర భాగం నుంచీ దక్షిణ భాగం వరకూ కొన్ని వేల మైళ్ళు ఈ గోడ కట్టాలి. చైనా చక్రవర్తి ఆజ్ఞతో లక్షలమంది కూలీలు కలిసి ఆ గోడను కడుతూంటారు. కాని దాన్ని ఒక తీరుగా మొదట్లో మొదలుపెట్టి చివరికంటా కట్టుకుపోరు. మధ్యలో అక్కడ కాస్తా ఇక్కడ కాస్తా ముక్కలు ముక్కలుగా కడుతూంటారు. ఎలాగో చెప్తాను: ఒక ఇరవై మంది కూలీల గుంపు కలిసి ఇటు నుండి ఓ ఐదొందల మీటర్ల పొడవు గోడ కడతారు. ఇంతలో అటు నుండి అంతే పొడవు గోడను మరో ఇరవై మంది కూలీల గుంపు కట్టుకుంటూ వస్తారు. తర్వాత ఈ రెండూ అతికి కడతారు. అయితే అతుకులు కలిపిన తరువాత మళ్ళీ గోడను అక్కడ నుంచే కొనసాగించరు. కూలీలను వేరే చోటకు తరలించి అక్కడ వేరే ముక్క ప్రారంభిస్తారు. చక్రవర్తి రాజధాని నుండే ఈ పనంతా పర్యవేక్షిస్తూంటాడు. ఈ అతుకులు ఎక్కడ కలపాలి, గోడ ఎంత ఎత్తు కట్టాలి, ఒక ముక్క కట్టిన తర్వాత కూలీలను మళ్ళీ వేరే ముక్క కట్టడానికి ఎక్కడకు పంపాలి— ఇవన్నీ చక్రవర్తికి మాత్రమే తెలుస్తాయి. చక్రవర్తి నుంచి వచ్చే ఆదేశాల అనుసారంగా కూలీలు కడుతూపోతూంటారు.

వరసగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఎందుకు కడతారన్న దానికి నేరేటర్‌ ఓ కారణం చెపుతాడు. గోడ ఒకటీ రెండూ కాదు కొన్ని వేల మైళ్ళు కట్టాలి. అన్ని వేల మైళ్ళు అంత పెద్ద గోడను వరసాగ్గా కడుతూ పోతే పూర్తి కావడానికి చాలా కాలం పడుతుంది. అది పూర్తి కాక మునుపే కూలీల జీవితం పూర్తయిపోతుంది. చివరకు వాళ్ళు ఆ పనిని పూర్తి చేయలేకపోయామే అన్న అసంతృప్తితోనే చనిపోతారు. అలా కాకుండా ముక్కలు ముక్కలుగా కట్టారనుకోండి, ఒక ఐదువందల మీటర్ల ముక్కను ఐదు సంవత్సరాల్లో కట్టేస్తారు. ఇలాగైతే వారికి ఏదో పూర్తి చేసామన్న సంతృప్తి మిగులుతుంది. చనిపోయే ముందు తమ జీవితమంతా దేనికి ఖర్చయిందీ అని వెనక్కి తిరిగి చూసుకుంటే సమాధానంగా ఒక కాంక్రీట్‌ ఎవిడెన్స్‌లాగా వారి ముందు పూర్తయిన ఓ గోడ కనిపిస్తుంది.

నేరేటర్‌ ఈ వివరణ ఇచ్చేటపుడు నేను కథలో ఈ భాగాన్ని ప్రపంచానికి అన్వయించుకున్నాను. ఆ కూలీల స్థానంలో మనల్నుంచుకుని మొత్తం సినేరియోని ప్రపంచానికి అన్వయిస్తే, ఈ ప్రపంచమూ చైనా గోడంత భారీ నిర్మాణమే. దీన్ని మొత్తంగా చూడాలనుకుంటే చూడలేం. చూడటం అంటే నా ఉద్దేశ్యం కళ్ళతో చూడటం కాదు; ఈ ప్రపంచంలో ప్రతీ విషయాన్ని జస్టిఫై చేయగల ఒకే ఒక్క అంతస్సూత్రాన్ని (సత్యాన్ని) చూడగలగడం. అల్టిమేట్‌ ట్రూత్‌ అన్నమాట. అదెలా ఉండాలంటే, అది తెలిస్తే ఇక అంతా అర్థమైపోవాలి. ఒక్కసారి ఆ vantage point దగ్గరకెళ్ళి నిలబడ్డాక ఇక అంతా స్పష్టంగా కనపడాలి. కానీ దురదృష్టవశాత్తూ ఈ ప్రపంచానికి అలాంటి పాయింటేమీ లేదు. అక్కడ గోడ కడుతున్న కూలీలకు గోడపై పూర్తి అవగాహన లేకపోయినా, కనీసం అలాంటి అవగాహన ఉన్న వాడి క్రింద పనిచేస్తున్నారు. కనీసం ఆ చైనా గోడను పర్యవేక్షిస్తూ ఓ చక్రవర్తి ఉన్నాడు. కనీసంలో కనీసం అలా ఒకడున్నాడని అక్కడ పనిచేస్తున్న కూలీలకు తెలుసు. కానీ ఈ ప్రపంచాన్ని పర్యవేక్షిస్తూ, ఆదిమధ్యాంతం దీని అనుపానులు తెలిసిన వాడొకడున్నాడన్న పూచీ కూడా మనకి లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇటుకలు పేరుస్తూ పోవడమే. కట్టు! కట్టు! ఎందుక్కడుతున్నావో నీకనవసరం. కట్టడం కోసమే నువ్వు పుట్టావు. కడుతూ కడుతూ చస్తావు. నీ జీవితం ఈ మహాకుడ్యంలో చిన్న భాగం, చిన్న ముక్క. నీకు కేటాయించిన స్థలంలో నీ ముక్క వరకూ నువ్వ కట్టుకో. అది అనుకున్నట్టుగా పూర్తి చేసి సంతృప్తిగా చచ్చిపో. అంతేగాని ఏకమొత్తంగా దీన్ని చూడాలనుకుంటే, అర్థం చేసుకోవాలనుకుంటే, చివరకు అసంతృప్తితోనే చస్తావ్‌.

ఇలాంటి గంభీరమైన సమస్యల్ని నెత్తికెక్కించుకుని అలసిపోవడం నాకో సరదా. నాకేంటంటే, కాస్త కావరం ఎక్కువ. Megalomaniac is the word for me. నా కక్కర్లేనివన్నీ నాకే కావాలనుకుంటాను. అయినా అనుకోకపోతే ఎలా? అరే యార్‌ ఇస్‌ దునియా మే పైదా హువే, ఫిర్‌ ఇసే పూరా జాన్‌కర్‌ హీ మర్‌నా చాహియే; హైకీ నహీ? మళ్ళీ ఇక్కడే పుడతామో, వేరే గెలాక్సీలో వేరే గ్రహం మీదే పుడతామో, అసలు పుట్టనే పుట్టమో ఎవడికి తెలుసు? ఒక్క ఛాన్సు, ఒకే ఒక్క ఛాన్సీ భూమ్మీద. కాబట్టి ఇక్కడ ఏది నిజమో— ఏది ఒకే ఒక్క నిజమో— తెలుసుకోవాలి కదా. అదీ నా మతం. కాని తెలుసుకోగలమా? ఈ ప్రపంచం అలా పూర్తిగా తెలుసుకునేందుకు వీలైన అమరికేనా? ఇంకా సరిగ్గా అడగాలంటే— మన మెదడు ఈ ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు వీలైన అమరికేనా?

నాకిప్పుడోటి గుర్తొస్తోంది. ఒకసారి నేనో పార్కులో పచ్చికలో కూర్చున్నాను. నా కాళ్ళ దగ్గర్నించీ ఒక బుల్లి గొంగళీ పురుగు పాకుతూపోతోంది. పచ్చ గడ్డి ఈనెల మీదగా నానా తంటాలు పడుతూ, చాలా నెమ్మదిగా పాకుతోంది. నిముషానికి చచ్చీ చెడీ ఓ పదంగుళాలు పాకగలుగుతోందేమో. నేను దాన్ని నా కాళ్ళ దగ్గర్నించీ రెండడుగుల దూరం వెళ్ళనిచ్చాను. అప్పుడు చేతికందుబాటులో ఉన్న ఓ ఎండుటాకు తీసుకుని అది వెళ్ళే దారిలో పడుకోబెట్టాను. అది అమాయకంగా దాని మీదకు ఎక్కింది. ఎక్కగానే ఆ ఎండుటాకును ఎత్తి మళ్ళా నా కాళ్ళ దగ్గరకే తెచ్చిపెట్టాను. అంటే అది ప్రయాణం ఎక్కణ్ణించీ ప్రారంభించిందో అక్కడికే తీసుకు వచ్చి పెట్టానన్నమాట. కానీ దానికీ సంగతి తెలీదు. తాను ఏ అంతరాయం లేకుండా నిర్విరామంగా పాకుతూ పోతున్నాననే అనుకుంటోంది. నాకు దాని మీద జాలేసింది. పాపం, ఐదు నిముషాలపాటు తాను పడిన శ్రమంతా వ్యర్థమైపోయిందన్న విషయం కూడా తెలీకుండా, ఎండుటాకు దిగి, మళ్ళీ పాకిన దారినే పాకుతూపోతోంది. అది వచ్చిన దారి గుర్తుపెట్టుకుంటుందా? "అరే! ఇందాక ఈ ఈనె మీంచే నడిచాను కదా, మళ్ళీ ఎదురొచ్చిందేంటిది''- అని అనుకుంటుందా? అనుకోలేదు. ఎందుకంటే దానికి వచ్చిన దారిని గుర్తు పెట్టుకునే మెదడు లేదు; మనలా వర్తమానాన్ని జ్ఞాపకాలుగా మార్చుకుని గతపు సంచీలో పోగేసుకునే మెదడు దానికి లేదు. తన చుట్టూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తగిన మెదడు దానికి లేదు.

ఇదే ఉదాహరణని మనిషికీ అన్వయించవచ్చుననుకుంటా. మన మెదడుకి గొంగళీపురుగు లాగే ఈ ప్రపంచాన్ని— లేదా ఇంకా విశాలంగా— విశ్వాన్ని అర్థం చేసుకునే సత్తా లేదు. కాని గొంగళిపురుగుకి రాని ప్రశ్నలు మనిషికే ఎందుకు వస్తాయి. గొంగళి పురుగెపుడూ భూమ్మీద తన ఉనికికి పూర్వాపరాలేమిటీ, మూలాలేమిటీ అని ఆలోచించదు. ఈగలు, దోమలు, ఆవులు, గేదెలు, కాకులు, గ్రద్దలు ఇవేవీ ఆలోచించవు. ఎందుకంటే వాటి మెదడుకి తమ జ్ఞాపకాల్ని విశ్లేషించి కాన్సెప్ట్స్‌గా తయారు చేసుకోగల శక్తి లేదు. వాటిలో వర్తమానం ఉన్నంత బలంగా గతం, భవిష్యత్తు ఉండవు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా తన తన భవిష్యత్తెలా ఉండబోతోందనే దాని గురించి కలలు కనదు. సీతాకోక చిలుక కూడా తన గొంగళిపురుగు గతాన్ని తల్చుకోదు. వాటికి బతకడం ఒక అలవాటంతే. గొంగళీ పురుగుకు పాకడం ఒక అలవాటు. ఆకులు తినడం ఒక అలవాటు. ఆకు కింద కకూన్‌లో పడుకుని సీతాకోక చిలకగా మారడం ఒక అలవాటు. సీతాకోక చిలకగా మారాక పూల మకరందాన్ని సేవించడం ఒక అలవాటు. అలా సేవిస్తూ సేవిస్తూ ఒన్‌ ఫైన్‌ మార్నింగ్‌ చచ్చిపోవడం ఒక అలవాటు. ప్రతీ గొంగళిపురుగు ఇదే చేస్తుంది. మనుషుల్లో కూడా చాలా మంది జీవించడాన్ని ఒక అలవాటుగా చేసేసుకుంటారు. చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రత్యుత్పత్తి, పిల్లలకు మళ్ళా చదువు, వాళ్ళ ఉద్యోగాలు, ఒన్‌ ఫైన్‌ మార్నింగ్‌ చచ్చిపోవడం— ఇలా అలవాటు ప్రకారం బతికేస్తారు. అలవాటులో సౌకర్యం ఉంటుంది. వెచ్చదనం ఉంటుంది. Habit is heaven. కాని అలవాటు నుండి బయటకొస్తే మాత్రం ఏమంత సౌకర్యంగా ఉండదు——

(ENOUGH!! I don't feel like writing it anymore. ఇప్పుడేం రాయబుద్దేయడం లేదు. అసలు ఇదంతా ఎందుకు రాయబుద్దేసిందంటే, ఇందాకే అంతర్జాలంలో ఒక వ్యాసం చదివాను. చాలా నచ్చింది. మీకందరికీ లింక్‌ ఇద్దామనుకున్నాను. కాని ఉట్టి లింకిస్తే ఏం బావుంటుందని ఈ ఉపోద్ఘాతం మొదలుపెట్టాను. మొదలు పెట్టినపుడు ఏదో అర్థవంతమైందే రాయబోయాను. కానీ ఊహూ! రాను రాను అసలు విషయానికి దూరంగా డైగ్రెస్‌ అవుతూ పోతున్నాను. చివరికి దీన్ని చివరికంటా రాస్తే "ఈ వ్యాసానికీ నువ్విచ్చిన లింకుకీ సంబంధం ఏంటని'' మీరు గదమాయించినా గదమాయిస్తారు. నిజానికి రాసే విషయంపై నేను చాలా క్లియర్‌గా ఉన్నాను. అక్షరాల దాకా వచ్చేసరికే మెదడు మబ్బైపోయింది. ఇవాళ మూడ్‌ లేదు. కాబట్టి చుప్‌ చాప్‌ లింకిచ్చేస్తున్నాను. చదువుకోండి. చదివాకా ఇలాంటి ఆలోచనలేవైనా వస్తే మీ పాట్లు మీరు పడండి.)
Carl Sagan "Can We Know the Universe?"

17 comments:

Purnima said...

"మీ ఆలోచనలు చాలా బాగా రాస్తూ మధ్యలో ఆపేయడం బాలేదు. :-( " అని కూడా అనవచ్చు కదా ఇప్పుడు మీ ఈ టపా చూసి? ఆ లంకె సంబంధం ఉందో లేదో, మీ రాస్తూనే ఉండాల్సింది. ఆలోచనలు ఎప్పుడైనా మిలిటరీ వారిలా ఒక వరుసలో మార్చ్ చేస్తాయా ఏంటి? అక్కడో మొదలై, అక్కడికో పోతాయి, అప్పుడే back tracking భలే వ్యాయామాన్ని ఇస్తుంది నాకైతే. ఆ లింక్ చదివి వచ్చి, మళ్ళా చెప్తా!!

Purnima said...

Understanding is a kind of ecstasy. - Thanks for introducing the link!! :-)

సత్యసాయి కొవ్వలి said...

good pieces of thinking.

independent said...

ఫణీంద్ర గారూ..తెలుగు బ్లాగుల పరిచయమే మీ బ్లాగుతో మొదలయినప్పుడు, నేను మిక్కిలి ఆనందానికి లోనయ్యా( గ్రాంధికం కొంచెం ఎక్కువయిందా:-). కాని జరిగిన నష్టం ఏంటంటే, అంతెత్తులో మొదలెట్టేసరికి తరవాత చదివే బ్లాగుల్లో అంత stimulus దొరక్క కొంచం ఇబ్బంది పడ్డా. మీరేమో March తర్వాత పత్తాలేరు. ఇన్నాళ్ళకి కనపడ్డందుకు extremely happy.
మీరు జూలై లో బ్లాగారన్న సంగతి ఇప్పుడే గమనించా (ఎలా మిస్సయానబ్బా).



నాకు ఓపికుండి నేను చూసిన బ్లాగుల్లో, మీది నాకు ఇప్పటివరకూ బెస్ట్. దయచేసి కొంచెం regular గా రాస్తూండండి .

మీరిచ్చిన లింకు ఇంతకుముందెప్పుడో గుర్తులేదు కాని నేను చదివా.

"ఒకే ఒక్క అంతస్సూత్రాన్ని (సత్యాన్ని) చూడగలగడం. అల్టిమేట్‌ ట్రూత్‌ అన్నమాట. అదెలా ఉండాలంటే, అది తెలిస్తే ఇక అంతా అర్థమైపోవాలి. ఒక్కసారి ఆ vantage point దగ్గరకెళ్ళి నిలబడ్డాక ఇక అంతా స్పష్టంగా కనపడాలి".


ఈ దిశలో సాగిన ప్రయత్నాలు "String Theory" and "Unified Field Theory" లలో బాగా కనబడతాయి.

wiki లో,
string theory is the first candidate for the theory of everything, a way to describe all the known natural forces (gravitational, electromagnetic, weak and strong) and matter (quarks and leptons) in a mathematically complete system.



In physics, a unified field theory is a type of field theory that allows all of the fundamental forces between elementary particles to be written in terms of a single field....Unified field theory is only one possible approach to unification of physics.

అప్పుడెప్పుడో, Bertrand Russell "A history of western philosophy" తో మొదలుపెట్టి(వ్యక్తిగత కారణాల వల్ల), అక్కణ్ణుంచి స్టీఫెన్ హాకింగ్ యూనివర్స్ లొకి వెళ్ళి, Quantum Physics పరిచయం చేసిన మాయల్లో మునిగి బయటొచ్చేసరికి, వేదాలు(Eastern philosophy and other things)
కనబడ్డాయి. వాటిల్లోంచి వెళ్తూ 'How to know God'..zen..taoism...art of motor cycle maintenance..power of now..అన్నీ చదువుకుంటూ వచ్చేసరికి, అసలే చాలా చిన్నది, అందులో అయినదానికీ, కానిదానికీ confuse అయ్యే మెదడు కాస్తా బుస బుస మంటూ ఆవిరి అయిపోయింది.

TS Eliot మాటల్లో "We shall not cease from exploration. The end of our exploring will be to arrive where we started from and know the place for the first time." అలా నేను మళ్ళీ మొదటికే వచ్చా.

చిట్టచివరకి నా సమస్యకి dramatic పరిష్కారం ఏదీ కనబడలేదు. Awareness ఎక్కువయింది, దానితోపాటూ వచ్చే pain కూడా.

నాకు బాగా తెలిసింది...."ఎంత తెలీదో!!!"... అన్నది!

ఈ మనసు/హ్యుమన్ బ్రైన్ కావల ఉండేవి(ఒకవేళ ఉంటే) ఎలాగూ తెలీవు, ఆ లోపలి వాటిని కూడా...మీ మాటల్లో... "ఒక అంతస్సూత్రం(సత్యం)" లో బంధించడానికి ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు జరుగుతూనేవున్నాయి.

నాకేమీ అర్ధం కాక విపరీతమయిన గందరగోళానికి గురయ్యి, చక్కగా ఇక్కడ Democrats, Republicans రాళ్ళు విసురుకుంటూ, ప్రపంచాన్ని ఎలా సేవ్ చేయాలా అని కొట్టుకుంటూంటే మజా చూస్తూ..ప్రస్తుతానికి ఇలా సెటిలయిపొయ్యా. అపుడపుడూ బోర్ కొడితే మన బ్లాగుల్లో మతం గురించో, మగువ గొప్పదా, మగవాడు గొప్పవాడా అనే ముచ్చట్లు ఎలానూ ఉండనే ఉన్నాయి.

నేనూ పైన చెప్పిన ధియరీస్ గురించి అర్ధమయ్యీ, అర్ధం కాని ముక్కలు చెపుదామనుకోని, నా స్వంత పురాణం లోకి దిగిపోయా..క్షమించాలి. పన్నెండయ్యింది..ప్రొద్దున్నే నాలుగ్గంటలకి లేచి,ఏర్ పోర్ట్ తో బ్రతుకు మొదలెట్టాలి. మళ్ళీ కలుస్తా.

I am very glad to know your blog Mr Phanindra..and again.......please DO keep writing..

ఫణీంద్ర said...

To: independent

బెట్రాండ్ రస్సెల్! టి.యస్. ఇలియట్! స్టీఫెన్ హాకింగ్! స్ట్రింగ్ థియరీ!

మీ వ్యాఖ్య చూసాక నాకేమనిపిస్తుందంటే, అసలు నా బ్లాగ్ చదవాలనుకున్నప్పుడల్లా మీరే ఓ పోస్టు రాసుకోచ్చు కదా అని. మీకింకా బ్లాగు లేకపోతే వెంటనే మొదలుపెట్టండి. మిమ్మల్ని చదవాలని వుంది.

శ్రీవిద్య said...

మీ పోస్ట్ నాకేమీ అసంపూర్ణంగా అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే అద్భుతంగా అనిపించింది. చైన గోడకి, మనిషి బతుకుకి పోలిక.. :). గొంగళి పురుగు ప్రయాణం గురించి బాగా నచ్చాయి. నిజంగా ఏది మొదలో, ఏది తుదలో, ఏది గెలుపో, ఏది ఓటమో తెలీకుండా వెళ్తూ వెళ్తూ వుంటాము. ఆగి ఆలోచించామో చాలా అసంతృప్తి. అందుకే కళ్ళు మూసుకుని నేను కట్టాల్సి ముక్క ఇదే అని గుడ్డెద్దులా పోతే బోలెడంత ప్రశాంతత. ఇంత గొప్ప నిజం తెల్సినా ఈ వెర్రి మనసు ఊరుకోదు. అప్పుడప్పుడు కెలికి కలవరపెడుతూనే వుంటుంది. ప్రపంచాన్ని మొత్తం అర్ధం చేసుకోవాలని ఆరాటపడి అలిసిపోతూనే వుంటుంది.

Wonderful... Please keep blogging

GIREESH K. said...

రాయబుద్ధేయట్లేదంటూనే, చాలా చక్కగా వ్రాసారు. జీవితాన్ని అలవాటుగా కాక, "ఆలోచించడం" అలవాటైన ప్రతివాడు, ఈ సందిగ్ధావస్తకు లోనుకావల్సిందేననుకుంటాను. మీ టపా, మీరిచ్చిన లింకు చదివాక, ఎప్పుడో చదివిన ఈ పంక్తులు గుర్తుకొచ్చాయి:

We are the students of words;
We are shut-up in schools and colleges
And recitation-rooms for ten or fifteen years;
And come out at last with a bug of wind;
A memory of words
And do not know a thing.
-RW Emerson

Goodone!

భైరవభట్ల కామేశ్వర రావు said...

అసలు మనమో చైనా గోడని కడుతున్నామనుకోవడమే మన భ్రమేమో అని నాకనిపిస్తూ ఉంటుంది.
మన ఆలోచనలూ, మన విశ్లేషణలూ అన్నీ మన మేధకి అణుగుణంగానే జరిగినప్పుడు, మనమనుకొంటున్న సత్యాలు "పరమ" సత్యాలనుకోవడం హాస్యాస్పదమనిపిస్తుంది. కార్య కారణ సంబంధాలూ, తర్కం, ప్రయోగ ఫలితాలద్వారా మనం నిరూపించే సిద్ధాంతాలూ అన్నీ మన బుద్ధికి లోబడి చేస్తున్నవే. కాబట్టి మనిషి ఈ విశ్వాన్ని తన దృక్కోణంలోంచి చూస్తున్నాడు. విశ్వమంతా ఆ దృష్టికి లొంగాల్సిన అవసరం లేదు. కానీ ఒక జీవజాతిగా మనిషి మనుగడకి ఇట్లాంటి దృష్టి అవసరంగా మారిపోయింది. అంచేత తన బుద్ధిని తాను నమ్మడం కన్నా మరో మార్గం మనిషికి లేదేమో!

ఫణీంద్ర said...

To: భైరవభట్ల కామేశ్వర రావు,

Exactly! నేను చాంతాడంత సాగదీసి చెప్పడానికి ప్రయత్నించినదాన్నే మీరు మూడు ముక్కల్లో చెప్పారు: కొత్త పోస్టు చూడండి (http://naagodava.blogspot.com/2008/08/2.html)

RSG said...

Carl Sagan's "Contact" is one of my fav's. మీ వ్యాసం చదువుతుంటే "If its just us, then its an awful waste of space" అన్న quote గుర్తొచ్చింది.

కొత్త పాళీ said...

చాలా బావుంది. మీ రచన చదవడం .. చక్కటి భాష వల్లనూ, అరుదుగా ఎక్కడో గానీ ఎదురు కాని ఆలోచనల వల్లనూ, రెంటినీ మేళవించే వ్యక్తీకరణ వల్లనూ .. నాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది.

సాంఘిక తత్త్వ వేత్తలు ఇలాంటి అల్టింఏట్ ట్రూత్ ఏదీ లేదని ఎప్పుడోనే నిర్ధారణకి వచ్చేశారు. నేనూ ఆ నిర్ధారణని చాన్నాళ్ళు నమ్మేశాను. అది నిజం కాదనీ, మనిషి తెలుసుకో గలిగిన పరమ సత్యం ఒకటి ఉన్నదని నాకు ఇటీవలే కొంచెం అనుభవ పూర్వకంగానే స్ఫురణకి వచ్చింది. దానికోసం వెదుకులాట మేధతో మొదలైతే అవ్వొచ్చు గానీ, దాన్ని జీర్ణుంచుకోవడనికి అవసరమైన పరిశ్రమ వేరే, కావలసిన జిజ్నాస వేరే.
మీకు ఈ ఇతర జిజ్నాసలతో బాటు త్వరలో అటువంటి జిజ్నాస కూడ కలగాలని కోరుకుంటున్నా.

ఫణీంద్ర said...

కొత్తపాళీ గారూ,

పరమ సత్యం తెలిసిపోయిందంటూనే ఏమీ చెప్పకుండా వెళిపోతే ఎలాగండీ!

ఆ అవసరమైన జిజ్ఞాస, పరిశ్రమలేంటో చెప్పండి. నేను సిద్ధం. "అనుభవపూర్వకంగా" అంటున్నారు కాబట్టి మీ బ్లాగులో ఇంకా వివరంగా రాస్తే బాగుంటుంది (అఫ్కోర్స్, పంచుకోదగింది అయితేనే).

కొత్త పాళీ said...

పరమసత్యం ఒకటి ఉన్నది అని తెలిసింది అన్నాను, సత్యమే తెలిసిపోయింది అనలేదు. మీకు ఆసక్తి ఉంటే kottapali at gmail dot com కి క మెయిలు రాయండి. మాట్లాడదాం.

నాగన్న said...

"పరమ సత్యం" అనే పదంతో మనం దేనినైతే ఉద్దేశిస్తున్నామో అది భౌతిక పరిధిలో లేదు, మనసుకు అందేది కాదు. తెలుసుకోవాలనుకున్న దాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టి, తెలుసుకోగోరుతున్న దాని గురించి స్టడీ చెయ్యడం మొదలుపెడితే, మొదటి అడుగు సరిగ్గా వేసినట్టు. చివరికి వెతకడమే అడ్డ్డంకి!

కత్తి మహేష్ కుమార్ said...

చాలా విస్తృతమైన సమాచారం. అంతకంటే ఆసక్తి కరమైన చర్చ.తెలుసుకోవడానికీ, నేర్చుకోవడానికే బోలెడుంది. ఇక "పరమసత్యం" ఎప్పుడు చేతికందేది?!?

independent said...

నాగన్న గారూ,
"తెలుసుకోవాలనుకున్న దాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టి, తెలుసుకోగోరుతున్న దాని గురించి స్టడీ చెయ్యడం "

అంతగా అర్ధం కాలేదండీ, కొంచెం వివరిస్తారా..

పోతే, మీరు సజెస్ట్ చేసిన New Earth లో ఒక్క చాప్టర్ మాత్రమే చదివా నిన్న..వచ్చే వారం ఏమైనా పూర్తి చేయగలనేమో. Thanks.

Eckhart Tolle దే power of now చాలా రోజుల క్రితం చదివా..బాగుండింది.