Sunday, August 19, 2007

సౌందర్య రాహిత్యం



"As Phaneendra Kumar awoke one morning from uneasy dreams, he found himself transformed in his bed into a gigantic machine."

కళ్ళుతెరవగానే ఉవ్వెత్తున మీదపడే తమస్సు. ఉదయాన పక్కమీద నిద్ర లేవగానే ఇంచుమించు Gregor Samsa లాగే ఉంటుంది నా మనస్థితి. 'ఛత్... లేచామా, బోల్టులు బిగించుకున్నామా, మరమానవులమై ఈ యంత్రనగరానికి మనవంతు ఊడిగం చేసామా! మరలా పక్క మీద వాలామా!' ఇదే తంతు. జీవితం కన్నా కలలే colourfulగా ఉండడం జాలిగొలిపే విషయం కదూ.

మనస్సు ఎక్కడో సతత హరితారణ్యాల సందిట్లో స్వేచ్ఛావిహారానికై ఉవ్విళ్ళూరుతుంటే, తనువుమాత్రం ఏ ట్రాఫిక్ జాంలోనో చిక్కుకుని; ఎదుటివాడి కారు నంబర్ ప్లేటూ, పక్కవాడి బైక్ మీద వాలికూర్చున్న అమ్మాయిసీటూ తప్ప కళ్ళకు మరోదృశ్యం కనిపించక విలవిల్లాడుతుంది. ఇక్కడ విషయం ట్రాఫిక్ జాముల సమస్య కాదు. అర్థంపర్థంలేని బిజీలోపడి ప్రకృతికి ఎంతదూరం జరిగిపోతున్నామా అన్నది. రెండు చేతులూ విహ్వలంగా చాచి బారెడు ఆకాశాన్ని కొలిచేందుకు బయలే లేకుండా పోయిందే ఈ నగరంలో అన్న బాధ. అంతా ఇరుకు... ఇరుకు... ఇరుకు.

ప్రకృతి మాత్రం ఏంచేస్తుంది, మనం ఈ ఇరుకులో మగ్గిపోవడానికే మక్కువ చూపిస్తుంటే. నియాన్ లైట్ల జోరుముందు నిండుపౌర్ణమిరోజునకూడా వెలవెలబోతూన్న చంద్రుడు, పాపం జాలిగా మొహం ముడుచుకుంటాడు. అడ్వర్టైజింగ్ హోర్డింగుల మధ్య చిక్కుకున్న రంగులవానవిల్లు, పేలవంగా ఓనవ్వు నవ్వి, ఫాక్టరీ పొగల్లో మసకబారి మాయమైపోతుంది. నేలకు చక్కిలిగింతలు పెడదామని ఉత్సాహంగా కురిసిన వర్షంకూడా, అంతటా సిమెంటుగచ్చులూ, తార్రోడ్లే కనిపించేసరికి, విసుక్కుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లోకి ఇంకిపోతుంది.

ఒక్కోసారి అనిపిస్తుంది, నేనో కింగ్ కాంగ్ నై ఈ నగరాన్నంతా కసాపిసా తొక్కేసి, అడవుల్లోకి పారిపోవాలని. కానీ ఏంచేస్తాం... there is no way out. అయినా నేనొకరకంగా అదృష్టవంతుడ్నే. పల్లెవాతావరణంలో పెరగడంవల్ల, కనీసం నాకు ప్రకృతితో సాంగత్యమంటే ఏమిటో తెలుసు. తాటిముంజెలబళ్ళ్లూ, రావిచెట్టు ఉయ్యాళ్ళూ, మామిడితోటల్లొ దొంగతనాలూ, మావిచిగురు మాటునుండి కోయిల కూతలూ... ఈ జ్ఞాపకాలన్నీ, పాతపుస్తకపు పేజీల్లో భద్రంగా దాచుకున్న నెమిలీకల్లా, ఎప్పటికీ నాతోనే ఉండి పోతాయి. కానీ ఈ యంత్రనగరం లో పుట్టిపెరిగినవాళ్ళని తల్చుకుంటేనే కొద్దిగా జాలేస్తుంది. ప్రపంచం ఇలానేకాక మరోలాగ ఉంటుందనీ, ఉండచ్చనీ తెలియదు వాళ్ళకి. ఈ లోహప్రపంచాన్నే లోకమనుకుంటారు. మల్టీఫ్లెక్సుల్లోనూ, మౌంట్ ఒపెరాల్లోనూ శెలవు గడపడమే విశ్రాంతి అనుకుంటారు.

బహుశా అందుకే నీ ప్రేమలో పడిపోయానేమో... రంగురంగుల ప్లాస్టిక్ పూల మధ్య స్వచ్ఛంగా పరిమళించే పచ్చ సంపెంగలోని అందం ఉంది నీలో, సహారా ఉక్కపోతలో ఒయాసిస్సు చల్లదనం ఉంటుంది నీ నవ్వులో. My melancholic mermaid, impossible ice-maiden, demure darling... ప్రపంచాన్ని పక్కకు నెట్టేసి ప్రేమించగలను నిన్ను... ఎందుకు అర్థం కాదు నీకు?

9 comments:

కొత్త పాళీ said...

beautiful

RSG said...

భయ్యా... ఏం చెయ్యగలం చెప్పు...
ఆస్థిమూల పంజరాలు... ఆర్తరావ మందిరాలు....
ఏ లోక తల్లీ .. ఏవో బాష్పజలాలు..

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

నగరాలలో యాంత్రిక జీవితాన్ని, కోల్పోతున్న పల్లెటూరు వాతావరణాన్నీ బాగా వర్ణించారు. ముఖ్యంగా తొలకరి వానజల్లు, రంగుల హరివిల్లులను మళ్ళీ గుర్తు చేసారు. ధన్యవాదములు. నా బ్లాగుకు కూడా ఒకసారి విచ్చేయండి. (http://trajarao.wordpress.com).

భాను said...

ఫణీంద్ర గారూ,

Franz Kafka "Metamorphosis" ను తలపిస్తూ మీ రచన జీవీతాన్ని పోగొట్టుకుని ఉనికిని మాత్రం మిగుల్చుకుంటున్న మన నాగరికత కు అద్దం పట్టింది.గొప్పగా చెప్పారు.

భాను

భాను said...

'బహుశా అందుకే నీ ప్రేమలో పడిపోయానేమో... రంగురంగుల ప్లాస్టిక్ పూల మధ్య స్వచ్ఛంగా పరిమళించే పచ్చ సంపెంగలోని అందం ఉంది నీలో, సహారా ఉక్కపోతలో ఒయాసిస్సు చల్లదనం ఉంటుంది నీ నవ్వులో. My melancholic mermaid, impossible ice-maiden, demure darling... ప్రపంచాన్ని పక్కకు నెట్టేసి ప్రేమించగలను నిన్ను... ఎందుకు అర్థం కాదు నీకు?"
మీరన్నారే, వెన్నులో పాకే జలదరింపు అని!అదే జరిగింది ఈ మాటలు చదివాక.ఈ మాటలు ఎప్పటికీ మన్సును పట్టుకుని వేలాడతాయి,ఒక ఆనందం లాంటి విచారంతో!Great.

భాను

ఫణీంద్ర కుమార్ said...

To: Bhanu.
Thank You

రాకేశ్వర రావు said...

బూబూబూ... (ఏడుస్తున్నట్టు)
నేను హైదరాబాదు వెళితే ఎప్పుడు ఇక్కడినుండి పారిపోదామా అనిపిస్తూవుంటుంది. రాత్రి కలల్లో కూడా ఎక్కడో ఉత్తరాఖండంలో వున్నట్లు వస్తూంటాయి.

సూర్యుడు said...

చాలా బాగా వ్రాశారు. ఎప్పటికీ (పగటి) కలలు నిజ జీవితం కంటే అందగానే ఉంటాయి, ఎందుకంటే అవి మన చేతుల్లో పని కాబట్టి. చాలా మంది కలల్లోనే బ్రతికేస్తూ ఉంటారు, అదొక వరం.

~సూర్యుడు :-)

S said...

చాలా బాగా రాసారండీ...
నాకు... W.H.Davies రాసిన Leisure అన్న కవిత గుర్తు వచ్చింది కొన్ని చోట్ల. We used to have it during Intermediete I think...