
రాత్రి ఓ కల. చిత్రంగా వచ్చిందని చెప్పను; చిత్రంగా ఉండటం కలల ప్రాథమిక లక్షణమే కాబట్టి. ఒక మబ్బు పట్టిన మధ్యాహ్నం, జనంతో క్రిక్కిరిసిన పుస్తకాల ఎగ్జిబిషన్‌లో, వేటూరి సుందర్రామ్మూర్తిగారి పాటలపుస్తకం కోసం స్టాల్స్ అన్నీ కలియదిరుగుతున్నానంట. రాబోతున్న వర్షానికి సూచనగా వీస్తున్న హోరుగాలి. నేలమీది పాలిథీన్‌కవర్లూ, చిత్తుకాగితాలూ సుళ్ళుతిరుగుతూ గాల్లోకి లేస్తున్నాయి. ఒకావిడ చీరకొంగు, నేలకు సమాంతరంగా పైకిలేచి, జెండాలావిచ్చుకుని ఎగరడం గుర్తు. ప్రతీ షాప్ ముందూ గుంపులుగా జనం. (పుస్తకాల షాపు ముందు! గుంపులుగా జనం!! Oh, the hopeful me!!!) నేనెలాగోకలాగ వాళ్ళమధ్య జొరబడి ప్రతీ స్టాల్‌లోనూ ఆ పుస్తకం గురించి ఆరా తీస్తున్నాను. అందరూ ఒకే సమాధానం: ఆయన పాటలింకా పుస్తకరూపంలో వెలువడలేదు. చివరకు విసిగి, ఆశలు వదిలేసుకుని, వెనుదిరగ నిశ్చయించుకున్నాక; ఈ స్టాల్స్ అన్నింటికీ దూరంగా, మూలగా, ఒక ఒంటరి స్టాల్ కనిపిస్తుంది. నిజానికి అది స్టాల్ కూడా కాదు; చెక్కటేబిల్‌పై పుస్తకాలుంచి, దానివెనుక చెక్క కూర్చీలో ఓ యాభై-అరవైయేళ్ళ ముసలాయన కూర్చుని ఉంటాడు. పొగమంచురంగు ఖద్దరు లాల్చీ-షరాయి, దళసరి ఫ్రేము కళ్ళజోడు, వెండిపోగుల్ని వెనక్కి దువ్వినట్టున్న కేశాలు, కూర్చున్న కుర్చీకి వ్రేలాడేసి ఉన్న బెంగాలీసంచి. నా దృష్ఠి తన దిశగా ఎప్పుడు మరలుతోందో అన్నట్లు, మరలుతుందని ముందే తెలిసినట్లు, నావైపే ప్రశాంతంగా చూస్తూంటాడు. నేనాయన వైపు చూసిన మరుక్షణం... ఆయన టేబిల్‌ముందు నించొని ఉంటాను. Time lapse. మధ్యలో ఆ టేబిల్‌దాకా నడవడం అనే ప్రక్రియని, ఈ కలతీసిన దర్శకుడెవరో ఎడిటింగ్‌లో కట్‌చేసిపడేసుంటాడు. ఆయన నిశ్శబ్దంగా ఓ లావాటి బౌండుపుస్తకాన్ని నా ముందుంచుతాడు. ముదురాకుపచ్చ రంగు అట్టమీద బంగారం రంగు అక్షరాలు. బాగా పాతది కావడంవల్ల పేజీలన్నీ లేతగోధుమవర్ణంలోకి మారిపోయి; పెళుసుగా, విరిగిపోవడానికి సిధ్ధంగా ఉంటాయి. పుస్తకాన్ని శ్రధ్ధగా, పవిత్రగ్రంధంలా నా చేతుల్లోకి తీసుకుంటాను. అంతే, అక్కడితో కలంతా శకలాలై ఎటో చెదిరిపోయింది.
బహుశా ఓనెల క్రితం "విశాలాంధ్రా బుక్‌హౌస్"లో వేటూరి పాటల పుస్తకం గురించి నేను చేసిన ఎంక్వైరీ ఈ కలకు కారణమై ఉండవచ్చు. లేదా, రాత్రి FM వింటూ, హెడ్‌ఫోన్స్ చెవుల్లోనే ఉంచుకొని నిద్రలోకిజారిపోయాను. ఇంకా పూర్తిగా సుషుప్తిలోకి చేరకుండా, పొలిమేరల్లో మగతగా తచ్చాడుతుంటే, నేపథ్యంలో ఎక్కడినుంచో సాధనాసర్గమ్ గొంతు "...రహస్య స్నేహితుడా" అని పాడుతూ లీలగా వినిపిస్తుంది. అది FM లోంచా లేక అదీ కలేనా అంటే ఇపుడు స్పష్టంగా చెప్పలేను. "సఖి"లోని ఈ పాట వేటూరి వ్రాసిందే. బహుశా ఇది కొంత కారణం కావచ్చు. ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. కొన్ని చోట్ల, కొన్ని పదాలు అర్థం కాకపోయినా కూడా. ఉదాహరణకి "ఉల్లం చుక్క ఆరబోసే వయసే..." అంటే ఏమిటి? వేటూరికే తెలియాలి. కానీ ఆ పదాలకి అర్థం అవసరమంటారా? స్వరం, శబ్దం అంత గాఢమైన కౌగిలిలో ఏకమై తన్మయిస్తుంటే, అర్థం వెతకడం పాపమనిపిస్తుంది. ముఖ్యంగా పాట మధ్యలో:"నిండామునిమాపుల్లో నిద్దరోవు నీఒళ్ళో... గాలల్లే తేలిపోతానోయ్, ఇలా డోలలూగేనోయ్...." అంటూ కోరస్ మొదలౌతుందే, అది ఎప్పుడు విన్నా, ఎన్ని సార్లు విన్నా, వెన్నులోంచి ఏదో ఆనందపు వణుకు మొదలై, శరీరమంతా పాకిపోతుంది. రోమాంచితం చేస్తూ విద్యుత్ ప్రసారమేదో నరాల్లో ప్రవహించినట్లుంటుంది. సంగీతం, సాహిత్యం, గానం - ఈ మూడు కళల త్రివేణీ సంగమం ఇంత సామరస్యతతో పరిపూర్ణమవడం సినిమా సంగీతంలో చాలా అరుదైన సందర్భం. అసలిదంతా సరే, వేటూరి పాటల్తో ఇప్పటివరకూ పుస్తకమేదైనా వెలువడిందా లేక అంతా నా కలేనా?
ఈ పోస్టుకి వేటూరిగారి ఫోటో కోసం వెతుకుతుంటే ఈ లింకు కన్పించింది: వేటూరిపై సిరివెన్నెల వ్రాసిన వ్యాసం.
baagaa raastunnaaru. keep it up!
వేటూరి గారి పుస్తకాలు ఉన్నాయి....ఒక పుస్తకమ్ పేరు మాత్రమ్ తెల్సు...కొమ్మ కొమ్మ కో సన్నాయి....
అది "ఉల్లం చక్కా ఆరబోసే వయసే" అంటే....వయసు మనసును exhibit చేస్తుందన్నమాట....ఉల్లం అంటే మనసు...
పాత పాట వినలేదా...."రాస క్రీడల రమణుని గాంచిన ఉల్లము ఝల్లన పొంగదటే"....బృందావనమది అందరిది..లో
@ ప్రియమైన నీకు.........
చాలా చాలా థాంక్స్. నిజంగా అంత మంచి అర్థం ఉందా అందులో! అందుకే అంటారు: మంచి రచన different లేయర్స్‌తో ఉంటుందని. మనం లోతుగా పయనించేకొద్దీ దాని సౌందర్యం ప్రవర్థమానమౌతూ వస్తుంది. హేట్సాఫ్ వేటూరీ! ప్రియమైన మీకు మరోసారి థాంక్స్.
ఆపాటొచ్చిన కొత్తలో మా మిత్రులమధ్య ఇదే ప్రస్తావనకొచ్చింది. "ఒళ్లు ఎంచక్కా ఆరబోసే ..." అని ఒకరూ, "ఉలెన్ చొక్కా వయసును ఆరబోసే" అని మరొకరూ, "ఉల్లం ..." అని తమిళ వాసనలు గల ఒక తెలుగు మిత్రుడూ ఇలా ఎవరికి తోచింది వారు చెప్పి, ఎవరికి నచ్చినట్లు వారు అర్థం చేసుకుని ఆ పాటను మాత్రం చాలా సార్లే విన్నాం, వింటున్నాం. సాధనాసర్‌గమ్ గొంతు ఎన్ని సార్లు విన్నా విసుగనిపించదు.
పుస్తకాల షాపుల నిండా జనాలా? అహా ఎంత మంచి కల.
ఫణీంద్ర గారూ,
మీరు అనుకున్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించగలగడం మీ శైలిలో ప్రత్యేకత. చాలా బాగుంది.
ప్రియమైన నీకు గారూ,
"ఉల్లం" అనే పదం ఒకటుందని నాకు ఇంతవరకూ తెలియదు. మీకు నా ధన్యవాదములు.
To: రానారె
చిత్రం కదూ... మీరన్నట్టూ అది "ఒళ్ళెంచక్కా ఆరబోసే వయసే" అయినా, 'ప్రియమైన నీకు...' గారి వివరణ ప్రకారం "ఉల్లం చక్కా ఆరబోసే వయసే" అయినా, ఎంత కాంట్రాస్ట్‌తో అర్థాలు వేరయిపోతున్నాయో చూడండి. ఒక అర్థం ప్రియునికై తనువుని పాన్పుగా పరచే వయస్సుని గురించి చెప్తుంటే, మరొకటి మనసు ఆరబోయడాన్ని వర్ణిస్తుంది. కాని బహుశా 'ఉల్లం' (మనసు) అనే అర్థమే కరక్టనుకుంటా.
అనువాదచిత్రాలకు వేటూరి రాసిన పాటలు తలా తోకా లేని పిచ్చి ప్రయోగాలతో ఉంటున్నాయి. lip sync కోసం చేసే ప్రయత్నంలో ’తిలకాష్ట మహిష బంధనాలు ’ తయారు చేస్తున్నాడు. అయినా వేటూరి రాసిన చాలాపాటల్లో పదబంధాలు బాగుండొచ్చేమో కానీ, మొత్తంపాటలో ’continuity' కనిపించదు. రానారన్నా! సాధనా సర్గమ్ ది నిజంగా అమృతగాత్రమే.
విమర్శించడం చాలా సులభం. ఆ కష్టమేంటో రాసేవాడికే తెలుస్తుంది. అనువాద చిత్రాలకు రాయడం కత్తిమీదసామే. మూలభావం చెడకుండా, తెరపై పాత్రలు పర భాషలో పదాల్ని ఉచ్ఛరిస్తూ చేసే పెదాల కదలికకు అనుగుణంగా, ఒక ప్రక్క స్వరాన్ని దృష్ఠిలో పెత్తుకుంటూ... ఇన్ని పరిమితుల మధ్య కూడా అంత అందమైన, శ్రవ్యమైన పదాల్ని అల్లి పాటను తయారు చేయడం, మనం విమర్శించినంత సులువు కాదు నా దృష్ఠిలో.
మీ ఈ టపా చూస్తే సిగ్ముంట్ ఫ్రాయిట్ సంతోషిస్తాడు. మీకు ఏ కోరికైతే వుందో అదే కలగా వస్తుందంట.
ఉదా- నాకు పదే పదే హిమాలయాల్లో వున్నట్టు కలలు వస్తుంటాయి.
ఉల్లం చక్కా విషయమై..
మేమందరం woolen చొక్కా అనుకుని, కొత్త సినిమా పాటలను కొంత సేపు తిట్టుకున్నాం.. అప్పుడు మా మిత్రుడొకడు.
woolen చొక్కా ఆరోపోయడమంటే, బట్టలు విప్పేసి.. చేసు కోవలసినది చేసుకునే సమయం అని అర్థం చెప్పాడు.
వాడు మామూలుగా వికృతంగా ఆలోచించడు కాబట్టి, ఒహో అవునా అనుకుని, అబ్బుర పోయాం.
చూడబోతే వాడిదీ వికృత బుద్ధోనన్న మాట :)
బహుశా వేటూరి తర్వాత ఆస్థాయికి దగ్గరదగ్గరగా వెళ్ళినవాళ్ళే అందరూ,అంతే తప్ప వేటూరి ను సమీపించలేక పోయారు.కానీ డబ్బింగు సినిమాల రచన విషయములో పాత రోజులనాటి వారిని వదిలేస్తే,రాజశ్రీ,వేటూరి,వెన్నెలకంటి ఇలా వస్తుంది వరుస.
నేను కిందనుంచి మీ బ్లాగు టపాలన్నీ చదువుతూ వస్తున్నాను... ఈపాటికే మీ అభిమానిని... ఇంకొన్ని చదివితే వీరాభిమానిని ఐపోతా కాబోలు... కల మాత్రం బాగుంది..