Thursday, December 25, 2008

:p


పాట అసలు వరస "వయసు వడగళ్ళ వాన నీరు వంటపట్టింది ఎందుకో" అని; కాని పొద్దున్నించీ "వయసు వడగళ్ళ వాన నీరు వరదకట్టింది ఎందుకో" అని పాడుకుంటున్నాను.

ఎందుకో, వేటూరి తీక్షణమైన అర్థాన్ని గుప్పించిన వరసల్లో ఎంతగా నచ్చుతాడో, ఆకర్షణీయమైన శబ్దాల్ని పేర్చి అల్లిన అర్థం పర్థం లేని వరసల్లో కూడా అంతగానే నచ్చుతాడు—ముఖ్యంగా ఆ అల్లిక వెనక బాణీలు ఇలా ఇళయరాజావి అయినపుడు:

అ: రెండు హృదయాల పిట్ట పోరు తీరనంటోంది ఎందుకో

ఆ: దొంగ యోగాల కొంగ గారు గాలమేసేది ఎందుకో

అ: చేతికందాక జాబిలి చుక్కతో నాకు ఏం పని

ఆ: తట్టుకున్నాక కౌగిలి ఏమి కావాలో చెప్పనీ

అ: కస్సుమన్న దాని సోకు కసిగా ఉంటుందీ

ఆ: తుమ్మెదొచ్చి వాలినాక పువ్వేమౌతుందీ


ఆ: అబ్బో నా బాయ్‌ఫ్రెండు/ ముద్దిస్తే నోరు పండు/ వాటేస్తే వళ్ళు పండునమ్మా

అ: అరె నా. . . నా. . . నా. . ./ నేనేం కాదంటున్నానా

--ఈ పాట పొద్దుట్నించీ నోట్లో నానుతోంది. ఇంకా మొహం మొత్తలేదు. దీనికి భిన్నంగా సీతారామశాస్త్రి చెప్పే జీవిత సత్యాలంటే ఎందుకో పరమ బోరు.

** ** **
ఉద్యోగధర్మంగా రాబోయే రోజుల్లో హిందీ క్లాసిక్స్ దండిగా చూసే అవకాశం—నా పుస్తక పఠనం పరంగా చూస్తే "అగత్యం"—కలిగింది. అంతే కాదు వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా చదవాల్సి ఉంటుంది. మొన్నే బయోగ్రఫీల గురించి ఏదో మాటన్నాను; కానీ ఇప్పటికే నా దగ్గర రాజ్ కపూర్, గురుదత్, నర్గీస్... ఇత్యాది నటుల జీవిత చరిత్రలు వచ్చిచేరాయి. (ఒక్క గురుదత్‌వే మూడున్నాయి.) నస్రీన్ మున్నీ కబీర్ రాసిన "గురుదత్ - ఎ లైఫ్ ఇన్ సినిమా" పుస్తకాన్ని ఇప్పుడే మొదలు పెట్టాను. మరణించిన వ్యక్తుల జీవిత చరిత్రల్లో ఏదో ఉంది. చావు అన్నింటికీ లెక్క తేల్చేస్తుంది, జీవితాన్ని చాలా తేలిక వ్యవహారమన్నట్లు చూపిస్తుంది, ఎంత అస్తవ్యస్తమైన జీవితానికైనా చక్కని సిమ్మెట్రీ తెస్తుంది, అంతా మించిపోయాక ఏ తాపత్రయాలు విలువైనవో ఏవి ఎండమావుల వెనక వెంపర్లాటలో ఓ స్థూల దృశ్యాన్ని చూపిస్తుంది. బతికినంత కాలం ఆ వ్యక్తులకు తమ జీవితాల పట్ల అందని అధివీక్షణ ఈ జీవితచరిత్రల వల్ల ఎవడో కోన్‌కిస్కా పాఠకుడికి అందుతుంది. గురుదత్తే గనక ఈ పుస్తకం చదివితే, తన వ్యాకులతలో అర్థం లేదని అర్థం చేసుకునేవాడేమో; తొందరపడక, చావు సహజంగా దరి చేరే వరకూ ఓపికపట్టేవాడేమో.

4 comments:

మురారి said...

సంబంధం లేకపోయినా ఒక ప్రశ్నని అడగకుండా ఉండలేకపోతున్నాను.
>>ఉద్యోగధర్మంగా రాబోయే రోజుల్లో హిందీ క్లాసిక్స్ దండిగా చూసే అవకాశం—నా పుస్తక పఠనం పరంగా చూస్తే "అగత్యం"—కలిగింది.
మీ ఉద్యోగం ఏమిటి? ఇష్టం లేకపోతే లైట్ తీసుకోండి.

Anonymous said...

ఫణీ, uncyclopedia తిరగేస్తుంటే JD Salinger గురించిన ఈ పేజీ కనబడింది. Somebody quite hilariously parodied him here (Imitating Holden Claufield)

http://uncyclopedia.wikia.com/wiki/Salinger

Just wanted to share with you :)

ఫణీంద్ర said...

మురారిగారు, నేనో న్యూస్‌ఛానెల్‌కి పనిచేస్తున్నాను.

Anon..., hilarious piece, thank you.

Anonymous said...

Hmm.. నువ్వు పాటలు కూడా పాడతావన్నమాట :)